Arnab’s Fury! ఆర్నబ్ బీభత్సం
ABN , Publish Date - Oct 29 , 2026 | 12:22 AM
Arnab’s Fury! అతి తీవ్ర తుఫాన్ ‘ఆర్నబ్’ జిల్లాను వణికించింది. కుండపోత వర్షాలతో అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. నదులు, చెరువులకు వరద పోటెత్తింది. ఏజెన్సీలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పూరిళ్లు కూలిపోయాయి. దీంతో పలువురు గాయపడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, కూడళ్లలో వర్షపునీరు నిలిచింది.
జిల్లాలో కుండపోతగా వర్షాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
నేలకొరిగిన చెట్లు, ఇళ్లు, విద్యుత్ స్తంభాలు
దెబ్బతిన్న రహదారులు
ఉధృతంగా నదులు, చెరువులు
ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
కొన్నిచోట్ల నీటమునిగిన పంటలు
వంతెనలపై వరద.. కొన్ని గ్రామాలకు రాకపోకలు బంద్
పార్వతీపురం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): అతి తీవ్ర తుఫాన్ ‘ఆర్నబ్’ జిల్లాను వణికించింది. కుండపోత వర్షాలతో అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. నదులు, చెరువులకు వరద పోటెత్తింది. ఏజెన్సీలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పూరిళ్లు కూలిపోయాయి. దీంతో పలువురు గాయపడ్డారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, కూడళ్లలో వర్షపునీరు నిలిచింది. వంతెనలపై వరద ప్రవహించడంతో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో రహదారులకు గండ్లు పడ్డాయి. పంటలు ముంపునకు గురయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. మొత్తంగా మంగళ, బుధవారాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో మూడు రోజుల పాటు తుఫాన్ గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో మన్యంవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులు ఎక్కువగా లేకపోవడంతో ఖరీఫ్ రైతులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ముంపు కారణంగా పాలకొండ, వీరఘట్టం, బలిజిపేట, సాలూరు తదితర మండలాల్లో వరి పంటకు నష్టం ఏర్పడింది. జిల్లాలో మొత్తంగా 262.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 18 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 15 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది.
కూలిపోయిన కల్వర్టు
పార్వతీపురం రూరల్: వర్షాల వల్ల లక్ష్మీనారాయణపురం నుంచి చొక్కాపువానివలస మధ్యలో ఉన్న కల్వర్టు పూర్తిగా కూలిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికార యంత్రాంగం వెంటనే ఆ ప్రాంతంలో గ్రావెల్‌తో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. చాకిగెడ్డ పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలుల వల్ల వరి పంటకు నష్టం ఏర్పడింది.
దెబ్బతిన్న ఇళ్లు.. ముగ్గురికి గాయాలు
పాచిపెంట రూరల్: తుఫాన్ ప్రభావంతో గుమ్మడిగుడ్డివలస గ్రామానికి చెందిన కొర్రా మల్లేసు ఇంటి గోడ బుధవారం తెల్లవారుజామున కూలిపోయింది. దీంతో మల్లేష్‌తో పాటు భార్య తవుడమ్మ , వారి ఎనిమిది నెలల చిన్నారి పార్వతి కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంతో సాలూరు పీహెచ్‌సీకి తరలించారు. పాపకు మెరుగైన వైద్యం కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎంహెచ్‌వో విజయలక్ష్మి ఆసుపత్రికి చేరుకుని.. చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీశారు. పాంచాలి గ్రామానికి చెందిన చల్లా ఆదినారాయణ, కేసలి గ్రామానికి చెందిన యజ్జల కొత్తయ్య ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
పెద్దగెడ్డ నుంచి 1000 క్యూసెక్కులు విడుదల
పెద్దగెడ్డ జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 213.80 మీటర్లు కాగా 212.50 మీటర్ల స్థాయికి నీటిమట్టం చేరుకుంది. సగటున ఇన్‌ఫ్లో ద్వారా పది వేల క్యూసెక్కులు చేరడంతో రెండు గేట్లు ఎత్తి బుధవారం అవుట్‌ఫ్లో ద్వారా 1000 క్యూసెక్కులను దిగువుకు విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని పెద్దగెడ్డ జేఈ మోహన్‌రావు తెలిపారు.
కూలిన విద్యుత్ స్తంభాలు.. దెబ్బతిన్న రోడ్లు
ఊబిగుడ్డి పరిసర ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో బిగుడ్డితో పాటు చేరుకగుడ్డి, మెట్టగుడ్డి, పనసగుడ్డి, కుంతాం బడేవలస తదితర సుమారు పది గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఊబిగుడ్డిలో కాదల చిన్నమ్మి ఇంటిపై విద్యుత్ స్తంభం కూలింది. కానీఎటువంటి ప్రమాదం జరగలేదు. అమ్మవలసలో భారీ వేపచెట్టును , తోటవలస బస్సు షెల్టర్ సమీపంలో చెట్టు కొమ్మలను తొలగించారు. ఇక కేరంగి, తుమరావల్లి, మెళియాకంచూరు, తంగలాం, గరిసిగుడ్డి, మూటకూడు తదితర గ్రామాల రోడ్లు దెబ్బతిన్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగుల మీదుగా ప్రజలు రాకపోకలు సాగించకుండా రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
కూలిన చెట్లు
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని బుడగరాయి, గులుమూరు, మీనకోట గ్రామాలకు వెళ్లే మార్గంలో భారీ చెట్లు నేలకూలాయి. దీంతో ఆమార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీతంపేట ప్రభుత్వ ఉన్నతపాఠశాల ఆవరణలో కూడా చెట్టు నేలకూలింది. అయితే పాఠశాలకు సెలవు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పింది. నేలకూలిన వృక్షాలను అధికారులు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సీతంపేటకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.
నడుకూరు- కిమ్మి మధ్య నిలిచిన రాకపోకలు
వీరఘట్టం: నడుకూరు, కిమ్మి రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ రెండు గ్రామాల్లో అధికారులు కంచె ఏర్పాటు చేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత తుఫాన్‌లో ఇదే రోడ్డు కోతకు గురవగా.. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం కళింగ చానల్ నుంచి వరద పోటెత్తడంతో మళ్లీ ఆ రహదారి దెబ్బతింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు వాహనాల రాకపోకలకు నిలిపివేశారు. మరోవైపు మండలంలో ఒట్టిగెడ్డ నీటి ప్రవాహం పెరిగింది. ఒట్టిగెడ్డ పరిసరాలకు ప్రజలు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
- భామిని: భామిని సమీపంలోని చీకటితోట గెడ్డ పొంగిపొర్లుతోంది. కాగా భారీ వర్షాలు వరి పంటకు ఊపిరిపోశాయి. అయితే పత్తి పంటకు మాత్రం నష్టం తప్పదని రైతులు చెబుతున్నారు.
వీఆర్‌ఎస్ కాలువకు గండి
సీతానగరం: అంటిపేట, లచ్చయ్యపేట గ్రామాల మధ్య ఉన్న వెంగళరాయ సాగర్ 18 ఎల్ కాలువకు గండి పడింది. దీంతో వరి చేలుకు నష్టం వాటిల్లింది. ఇక అంటిపేట - రెడ్డివానివలస గ్రామాల మధ్య ఉన్న వరి చేలు నీట మునిగింది. అంటిపేట వద్ద విశాఖ - పార్వతీపురం హైవేపై వరద నీరు ప్రవహించడంతో వాహన చోదకులకు ఇబ్బందులు తప్పలేదు.
తోటపల్లికి వరద
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు పరిధి నాగావళి నదిలోకి బుధవారం 7,500 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో అధికారులు స్పిల్‌వే గేట్లు నుంచి 500 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 102.72 మీటర్ల మేర నీటి నిల్వలున్నాయి.
వీఆర్‌ఎస్ నుంచి 3,166 క్యూసెక్కులు విడుదల
మక్కువ: శంబరలో ఉన్న వెంగళరాయసాగర్ ప్రాజెక్టు రెండు స్పిల్‌వే గేట్లు ఎత్తి.. దిగువకు 3,166 క్యూసెక్కులను విడుదల చేశారు. ఈ నీరంతా సువర్ణముఖి, గోముఖి నదుల్లోకి చేరడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కవిరిపల్లి వద్ద కాజ్‌వేపై ప్రజలు రాకపోకలు సాగించకుండా అధికారులు బారికేడ్లు పెట్టారు. సుమారు 15 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా వీఆర్‌ఎస్ ప్రాజెక్టు సామర్థ్యం 161 మీటర్లు కాగా.. ప్రస్తుతం 159.50 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి.
మంత్రి పరామర్శ
సాలూరు: సాలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుమ్మిడి గుడ్డివలస బాధితులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బుధవారం పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. గోడ కూలిన ఘటనలో గాయపడిన ఎనిమిది నెలల చిన్నారి సహా తల్లిదండ్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న తుఫాన్ బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. వారికి కావాల్సిన భోజనం, దుప్పట్లు, అవసరమైన దుస్తులు, వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
- పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. సువర్ణముఖి నది వరదతో మండలంలో మామిడిపల్లి పీహెచ్‌సీ పూర్తిగా ముంపునకు గురైంది. దీంతో ఆసుపత్రిలో ఉన్న వైద్య పరికరాలను, విలువైన మందులను, సామగ్రిని పక్కనే ఉన్న ఆరోగ్య సిబ్బంది క్వార్టర్స్‌లోకి తరలించారు. మామిడిపల్లి పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో పరిశీలించారు.
ప్రతి గంటకూ నివేదికలు అందించండి: కలెక్టర్
పార్వతీపురం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ప్రతి గంటకూ నివేదికలు అందించాలని కలెక్టర్ ప్రభాకర్ ఆదేశించారు. బుధవారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చూడాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి.. ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు వాగులు, గెడ్డల వద్దకు వెళ్లకుండా పశువులను బయటకు వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.