Share News

Arnab’s angry ఆర్నబ్‌ కన్నెర్ర

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:12 AM

Arnab’s angry

Arnab’s angry  ఆర్నబ్‌ కన్నెర్ర
బొబ్బిలి రూరల్‌: పిరిడిలో నేలకొరిగిన వరి పంట

ఆర్నబ్‌ కన్నెర్ర

ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షాలు

నీట మునిగిన వరి పొలాలు

ఇతర పంటలకూ నష్టం

నేలకొరిగిన 115 విద్యుత్‌ స్తంభాలు

దెబ్బతిన్న 28 ట్రాన్స్‌ ఫార్మర్లు

ధ్వంసమైన రహదారులు

ప్రాజెక్టుల్లో భారీగా చేరిన వరద నీరు

వరి దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతులు

నేడు కూడా విద్యా సంస్థలకు సెలవు

ఆర్నబ్‌ తుఫాన్‌ జిల్లాను ముంచేసింది. ఎటు చూసినా జలమే కనిపిస్తోంది. చాలా చోట్ల రోడ్లు, పొలాలు కలిసిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. ఉద్యాన పంటలకూ తీవ్ర నష్టం వాటిల్లింది. నదులు, వాగులు, వంగలు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. రిజర్వాయర్లలోకి భారీగా వరదనీరు చేరుతోంది. విద్యుత్‌ స్తంభాలు కూలడంతో చాలా గ్రామాల్లో అంధకారం నెలకొంది. పునరుద్ధరణ పనుల్లో వేపాడ మండలంలో ఓ జూనియర్‌ లైన్‌మెన్‌ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. కీలక పంట అయిన వరి దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు గురువారం కూడా కొనసాగుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో విద్యా సంస్థలకు వరుసగా మూడో రోజు సెలవు ప్రకటించారు.

విజయనగరం /కలెక్టరేట్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్‌ తుఫాన్‌ తీవ్ర అలజడి రేపింది. అందరూ భయపడినట్టే జల విలయం సృష్టించింది. జిల్లా ప్రజలను రెండు రోజులుగా వణికిస్తోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ కుంభవృష్టి కురిసింది. బుధవారం ఉదయం గాలి బీభత్సం సృష్టించింది. ఆ తీవ్రతకు వరి పంట ఎక్కడికక్కడే నీట మునిగింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 115 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 28 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 496 ఫీడర్లలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో 1,492 మంది విద్యుత్‌ శాఖ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు. భారీ వర్షం కారణంగా పూసపాటిరేగ మండలం కామవరం మీదుగా కనిమెళ్ళ వెళ్లే మార్గంలో ఉన్న కాజ్‌వై పైనుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. భోగాపురం మండలం రావాడ వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. జిల్లా కేంద్రంలోని అయ్యన్నపేట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో భారీగా వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి7 గంటల వరకూ జిల్లా వ్యాప్తంగా 221 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కొత్తవలసలో అత్యధికంగా, తెర్లాం మండలంలో అత్యల్పంగా వర్షపాతం నమోదైంది.

దెబ్బతిన్న స్తంభాలు.. ట్రాన్స్‌ఫార్మర్లు

విజయనగరం రింగురోడ్డు, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విద్యుత్‌ వ్యవస్థ చాలా చోట్ల దెబ్బతింది. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు పాడయ్యాయి. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన విద్యుత్‌శాఖ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. జిల్లాలో 115 విద్యుత్‌ స్తంభాలు దెబ్బతినగా, ఇప్పటి వరకూ 76 పునరుద్ధరించారు. అలాగే 28 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా వాటి స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్టు ఏపీఈపీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీరు ఎం.లక్ష్మణరావు తెలిపారు. మొత్తంగా 19.24 లక్షలు నష్టం వాటిల్లినట్టు తెలియజేశారు.

- నగరంలోని 33/11 కెవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో వర్షం నీరు నిలిచి చెరువును తలపించింది. దీంతో సిబ్బంది విద్యుత్‌ పరికరాలు దెబ్బతినకుండా చూస్తున్నారు.

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

మంత్రి శ్రీనివాస్‌

విజయనగరం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఆధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులకు సూచించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని తుఫాన్‌ కంట్రోల్‌రూమ్‌ నుంచి జిల్లా అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. జిల్లాలో కురిసిన వర్షపాత వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోతకు గురైన రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఆయా గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముంపునకు గురైన వరిపంటల పరిస్థితి తెలుసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు.

విద్యుదాఘాతంతో జేఎల్‌ఎం మృతి

వేపాడ, అక్టోబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): నీలకంఠరాజపురం ట్రాన్స్‌ఫారం వద్ద ఏబీ స్వీచ్‌ ఆన్‌ చేస్తుండగా బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో నల్లబిల్లి సచివాలయానికి చెందిన జేఎల్‌ఎం దువ్వాడ పైడిరాజు (28) మృతి చెందాడు. తుఫాన్‌ వర్షాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో సరిచేసేందుకు సాయంత్రం ఆ గ్రామం వెళ్లాడు. ముందుగా ఏబీ స్వీచ్‌ను ఆన్‌ చేయడానికి ప్రయత్నించగా విద్యుదాఘా తానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు విద్యుత్‌శాఖ ఏఈఈ పిచ్చయ్య తెలిపారు. ఈయనకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు.

కంట్రోల్‌ రూం నుంచి సమీక్షించిన కలెక్టర్‌

తుఫాన్‌ పరిస్థితులను కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మంగళవారం రాత్రి కలెక ్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి కూడా సమీక్షించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకురావొద్దున్నారు.

నేడూ విద్యా సంస్థలకు సెలవు

జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కూడా అన్ని విద్యా సంస్థలకు డీఈవో సెలవు ప్రకటించారు. విద్యార్థులంతా ఇంటి వద్దే ఉండాలని సూచించారు.

Updated Date - Oct 29 , 2026 | 12:12 AM