Share News

నష్టం మిగిల్చిన ఆర్నబ్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:32 PM

ఆర్నబ్‌ తుఫాన్‌ జిల్లాపై విరుచుకుపడింది. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

 నష్టం మిగిల్చిన ఆర్నబ్‌
భామిని మండలం కీసరలో చెరువుని తలపిస్తున్న పంట పొలాలు

- జిల్లాలో మూడు రోజులు కురిసిన భారీ వర్షాలు

- చెరువుల్లా మారిన పంట పంటలు

- 900 ఎకరాల్లో వరి, 19 ఎకరాల్లో పత్తికి నష్టం

- నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

- దెబ్బతిన్న రోడ్లు

పార్వతీపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ జిల్లాపై విరుచుకుపడింది. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పలుచోట్ల వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. మొక్కజొన్న, చెరుకు, పత్తి, కూరగాయల పంటల్లో వర్షపు నీరు చేరింది. వరద నీరు తగ్గకుంటే పంటలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పాలకొండ, సీతంపేట మండలాల్లోని రావాడగెడ్డ, ఓనిగెడ్డ, జంపరకోటగెడ్డ, గజిలిగెడ్డ, తంపర గెడ్డతో పాటు ఒట్టిగెడ్డ, మల్లిగెడ్డ తదితర గెడ్డలు ఉప్పొంగాయి. దీంతో మైదాన ప్రాంతాల్లోని పంట పొలాలు నీటమునిగాయి. నాగావళి నదికి వరద పోటెత్తి గోపాలపురం, అన్నవరం, పాలకొండ, మంగళాపురం, తంపటాపల్లి, బుక్కూరు, వీపీరాజుపేట తదితర గ్రామాల్లో పొలాలు నీటమునిగాయి. ఓని, పాలకొండ గ్రామాల మధ్య ఉదయం 10 గంటల వరకు రాకపోకలు నిలిచిపోయాయి. నవగాం, పొట్లి గ్రామాల మధ్య కొన్ని గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

- వర్షాలకు తోడు ఈదురుగాలుల ప్రభావంతో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో 900 ఎకరాల్లో వరి పైరు నేలవాలింది. కొన్నిచోట్ల పంట ముంపునకు గురైంది. జిల్లాలో 49 గ్రామాలకు సంబంధించి 718 మంది రైతులు బాధితులుగా మిగిలారు. అత్యధికంగా బలిజిపేట మండలంలో 491 ఎకరాల్లో వరి పంటకు నష్టం ఏర్పడింది. మక్కువ మండలంలో 19 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌శాఖకు నష్టం..

తుఫాన్‌తో ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.80 లక్షల నష్టం కలిగింది. పి.కోనవలస-పాచిపెంట, సాలూరు-మక్కువ, చిలకపాలెం-రామభద్రపురం, పెదమెరంగి-గడ్డసింగుపురం తదితర రోడ్లు దెబ్బతిన్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు జిల్లా ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారి అప్పాజీ తెలిపారు. అదే విధంగా విద్యుత్‌శాఖకు సంబంధించి 11 కేవీ లైన్‌కు చెందిన 40 స్తంభాలు, ఎల్టీలైన్‌కు చెందిన 120 స్తంభాలు, 11 డీటీఆర్‌లకు నష్టం వాటిల్లింది. సుమారు రూ.30 లక్షల నష్టం ఏర్పడినట్టు ఆ శాఖ నివేదిక తయారు చేసింది.

పంట నష్టాన్ని రైతులే నమోదు చేసుకోవచ్చు

పంట నష్టపోయిన రైతులు తమ వివరాలను ఈ-పంట వెబ్‌సైట్‌ లేదా ఏపీఐఎంఎస్‌ ఫార్మర్‌ యాప్‌ ద్వారా ఆధార్‌ ఓటీపీ ధ్రువీకరణతో స్వయంగా నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పంట నష్టానికి సంబంధించి సర్వే నెంబర్‌, పొలం వివరాలు, దెబ్బతిన్న పంట ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఈ వివరాలు అధికారుల పంట నష్టం అంచనాలకు సహాయపతాయని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీనిపై రైతులకు అవసరమైన అవగాహన, సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రాథమిక అంచనా వేశాం..

జిల్లాలో తుఫాన్‌ కారణంగా సుమారు 366 హెక్టార్లలో వరి పంటకు, 8 హెక్టార్లలో పత్తిపంటకు నష్టం ఏర్పడినట్లు ప్రాథమిక అంచనా వేశాం. దీనిపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తాం.

భవానీ శంకర్‌, జిల్లా వ్యవసాయాధికారి...

Updated Date - Oct 29 , 2026 | 11:32 PM