Share News

కోడి కోస్తుండగా దంపతుల మధ్య గొడవ

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:59 AM

కోడిని కోసే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో జోక్యం చేసుకున్న వ్యక్తి హత్యకు గురయ్యాడు.

కోడి కోస్తుండగా దంపతుల మధ్య గొడవ

గంట్యాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): కోడిని కోసే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో జోక్యం చేసుకున్న వ్యక్తి హత్యకు గురయ్యాడు. గంట్యాడ మండలం డీకే పర్తి పంచాయతీ పరిధిలోని రేంగరువు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంట్యాడ ఎస్‌ఐ లక్ష్మణ రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నేగల పోలయ్య గురువారం రాత్రి కోడిని కోసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో అతడి భార్య సన్యాసమ్మ.. ఇప్పుడు కోడిని ఎందుకు కోస్తున్నావని ప్రశ్నించింది. దీంతో పోలయ్య ఆమెను కొట్టసాగాడు. అక్కడే ఉన్న నేగల గంగులు(41) అడ్డుకుని, ఎందుకు కొడుతున్నావని పోలయ్యను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహించిన పోలయ్య కోడిని కోసే కత్తితో గంగులు ఛాతిపై పొడిచాడు. తీవ్ర గాయంతో గంగులు అక్కడికక్కడే మృతిచెందాడు. గంగులుకు ఇద్దరు భార్యలు, ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. మొదటి భార్య ఫిర్యాదు మేరకు గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ లక్ష్మణరావు శుక్రవారం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Updated Date - Oct 17 , 2026 | 12:59 AM