Share News

Bad Name to the Government? ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారా?

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:15 AM

Are You Bringing a Bad Name to the Government? రోడ్ల మరమ్మతు పనుల విషయంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల తీరుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించడం సరికాదన్నారు.

  Bad Name to the Government?  ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారా?
జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సంధ్యారాణి

పూర్తిస్థాయిలో రోడ్లకు మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశం

మక్కువరూరల్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రోడ్ల మరమ్మతు పనుల విషయంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల తీరుపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరించడం సరికాదన్నారు. శనివారం ఆమె శంబరలో పర్యటించారు. తొలుత కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పోలమాంబను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. శంబర జాతర నిర్వహణపై నెలరోజుల ముందు సమావేశం నిర్వహించి.. రోడ్లన్నీ సిద్ధం చేయాలని ఆదేశించినా.. ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. రోడ్ల మరమ్మతు పనులు సక్రమంగా జరగడంలేదని ప్రజల నుంచి ఫిర్యాదులొస్తున్నాయని తెలిపారు. ఆదివారం నాటికి పూర్తిస్థాయిలో రోడ్లుకు మరమ్మతులు చేపట్టి భక్తుల రాకపోకలకు ఎటవంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె వనం, చదురుగుడుల్లో ఏర్పాట్లు, చలువ పందిళ్లు, పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు. సోమవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఆటంకం కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలోని వీధుల్లో విద్యుత్‌ లైట్లు ఏర్పాటు చేయాలని, పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టిసారిం చాలని సూచించారు. ప్రస్తుత ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ చినతిరుపతి తన సొంత డబ్బులతో పనులు చేయిస్తుండడం అభినందనీయమన్నారు. ఈ పరిశీలనలో సబ్‌కలెక్టర్‌ ఆర్‌.వైశాలి. ఏఎస్పీ మనీషా, సాలూరు సీఐ పి.రామకృష్ణ, మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ దేవదాయ, రెవెన్యూశాఖ అధికారులు ఉన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:15 AM