Share News

Are we going to be born again, or what? మళ్లీ పుడతామా ఏంటి?

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:03 AM

Are we going to be born again, or what? పరీక్షల్లో మార్కులు తగ్గాయని ఒకరు.. ప్రేమ విఫలమైందని మరొకరు.. తల్లిదండ్రులు కోపడ్డారని ఇంకొకరు.. ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏదైనా ఆవేశంలో తీసుకుంటున్న ఒక నిర్ణయం కన్నవారికి తీరని శోకాన్ని మిగుల్చుతుంది. చిన్నపాటి క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు.

Are we going to be born again, or what? మళ్లీ పుడతామా ఏంటి?

మళ్లీ పుడతామా ఏంటి?

బతికి సాధిద్దాం

తొందపాటు వద్దు.. కొంచెం ఆలోచించు

బలవన్మరణాలతో బంగారు భవిష్యత్‌ కోల్పోతున్న యువత

మానసిక స్థైర్యం కోల్పోవడం, ఒత్తిడే కారణమంటున్న నిపుణులు

నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం

పరీక్షల్లో మార్కులు తగ్గాయని ఒకరు.. ప్రేమ విఫలమైందని మరొకరు.. తల్లిదండ్రులు కోపడ్డారని ఇంకొకరు.. ఆత్మహత్య చేసుకుంటున్నారు. కారణం ఏదైనా ఆవేశంలో తీసుకుంటున్న ఒక నిర్ణయం కన్నవారికి తీరని శోకాన్ని మిగుల్చుతుంది. చిన్నపాటి క్షణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. బంగారు భవిష్యత్తు వున్న యువత, విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నెల10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పురస్కరించుకుని ఇకపై ఎలాంటి పరిస్థితిలోనూ క్షణికావేశానికి గురికాకూడదని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోబోమని సంకల్పిద్దాం.

- బొబ్బిలి మండలం పారాది గ్రామంలో ఓ యువకుడికి పరిచయమైన అమ్మాయి మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

- గజపతినగరంలో ఓ యువతి ఆ మధ్య టెట్‌ పరీక్ష రాసింది. అందులో మార్కులు తక్కువ రావడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంది.

- కెఎల్‌ పురం రెవెన్యూ కాలనీలో ఓ వివాహిత ఇంట్లో మనస్పర్థలు కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇద్దరు కుమారులు దిక్కుతోచని స్థితిలో వున్నారు.

- గరివిడి మండలం కొండశంభాం గ్రామంలో పైళ్లి అయిన 15 రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. మనస్పర్థలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

- నగరానికి చెందిన ఓ యువతి తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. కళాశాల ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది.

విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఏడాదిలో బలవన్మరణాలు పాల్పతున్నవారిలో ఎక్కువ మంది యువత, టీనేజీ సమీప వయసులో ఉన్న వారే ఉన్నారు. చదువులో ఒత్తిడి భరించలేక, మార్కులు తక్కువ వచ్చాయన్న బాధతో చనిపోయిన వారు కొంత మందికాగా వ్యక్తిగత కారణాలతో జీవితాన్ని మధ్యలో ముగిస్తున్నారు ఇంకొందరు. ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో అధికశాతం 15-25 ఏళ్ల వయసున్నవారే. చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదమని హెచ్చిరించినా.. సెల్‌ఫోన్‌ వాడకం తగ్గించాలని మందలించినా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికినా తట్టుకోలేకపోవడం విచారకరం. మన మంచికే చెబుతున్నారని గుర్తించలేకపోవడం ఆందోళనకరం. చిన్నప్పటి నుంచి అతిగారాబంగా పెంచడం, తగిన శారీరక శ్రమ లేకపోవడం, బయట ప్రపంచంపై అంతగా అవగాహన లేకపోవడం వంటి కారణాలతోనూ తొందర పాటు చర్యలతో అర్ధాయుష్కులవుతున్నారు. ఇతర వయస్కులు కూడా వివిధ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతుండడం జరుగుతోంది.

వయసుల వారీగా..

యువతలో.. చదువు పూర్తయినా సరైన ఉద్యోగం దొరక్కపోవడం, ప్రేమ వైఫల్యాలు, సోషల్‌ మీడియా ప్రభావం, డిప్రెషన్‌ వంటి కారణాలు కొందరిలో కనిపిస్తున్నాయి.

పురుషుల్లో.. కుటుంబ పోషణ భారం, వ్యాపార నష్టాలు, అప్పుల ఒత్తిడి, తమ బాధలు బయటకు చెప్పుకోలేక లోలోపలే నలిగిపోవడం కారణాలతో కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

మహిళల్లో... గృహహింస, వరకట్న వేధింపులు, వైవాహిక జీవితంలో తీవ్రమైన మనస్పర్థలు లేదా తనకు నచ్చని భాగస్వామి దొరకనప్పుడు, ఆశించిన గౌరవం దక్కకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

వృద్ధుల్లో.. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, భాగస్వామి మరణంతో ఒంటరి తనం, కుటుంబ సభ్యుల ఆదరణ కరువుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

లక్షణాలు ఇవే

- ‘నేనిక బతకలేను. అందరికీ భారం అయ్యాను. నేను చనిపోతేనే అందరూ ప్రశాంతంగా వుంటారని’ తరచూ అనడం... మరణం గురించి ఎక్కువ మాట్లాడడం చేస్తుంటారు.

- కుటుంబ సభ్యులు, స్నేహితులకు పూర్తి దూరంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా గదిలో వుండిపోతుంటారు.

- ఎంతో ఇష్టంగా చేసే పనులు, హాబీలపై ఆసక్తి కోల్పోతుంటారు.

- ప్రియమైన వస్తువులు ఇతరులకు ఇచ్చేయడం, వీలునామా లేదా ఆస్తుల అంశం మాట్లాడడం చేస్తుంటారు.

- ఆకస్మాత్తుగా వచ్చి ఆత్మీయులను కలవడం, ఫోన్‌ చేసి సారీ చెప్పడం, భవిష్యత్తుపై ఆశ పూర్తిగా కోల్పోవడం చేస్తుంటారు.

- మద్యపానం, ధూమపానం మత్తు పదార్థాల వాడకాన్ని హఠాత్తుగా ఆలవాటు చేసుకోవడం ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కన్పించే లక్షణాలు

నివారణకు ప్రత్యేక నెంబర్లు

14416 లేదా 18008914416 వంటి ఉచిత హెల్ప్‌లైన్ల నెంబర్లకు నేరుగా ఫోన్‌ చేసి మానసిక నిపుణులతో మాట్లాడవచ్చు. ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపేలా వారు కౌన్సిలింగు అందిస్తారు.

మానసిక సమస్యలతోనే ఆత్మహత్యలు

డాక్టరు జాగరపు రమేష్‌, న్యూరో సైక్యాట్రిస్ట్‌

ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తిగత బలహీనతలు కావు. తీవ్రమైన మానసిక ఒత్తిడి.. మెదడులో సరటోనిన్‌ అనే రసాయన లోపం వల్ల ఉత్పన్నమయ్యే తాత్కాలిక సమస్య. ఆత్మహత్య అనేది ఆకస్మాత్తుగా జరగదు. బాధితుల ప్రవర్తనలో కన్పించే హెచ్చరిక సంకేతాలను కుటుంబ సభ్యులు ప్రాణ స్నేహితులు ముందుగానే గుర్తించి సరైన సమయంలో స్పందిస్తే నిండు ప్రాణాలను కాపాడవచ్చు. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడే వారికి కౌన్సిలింగు, సైకో థెరపీతో పాటు వైద్యుల పర్యవేక్షణలో వైద్యం అందించడం ద్వారా సాధారణ స్థితికి తీసుకురావడం సాధ్యమౌతుంది. భావాలను దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవడం వల్ల మానసిక భారం తగ్గుతుంది.

ఆత్మహత్య పరిష్కారం కాదు

ఏఆర్‌ దామోదర్‌, ఎస్పీ

ఏ సమస్యకు ఆత్మహత్యకు పరిష్కారం కాదు. క్లిష్ట సమయాల్లో ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని బలి తీసుకోవద్దు. సైబర్‌ వేఽధింపులు, కుటుంబ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా ఎటువంటి సమస్య ఎదురైనా బాధపడకుండా ధైర్యంతో పోలీసులను ఆశ్రయించండి. బాధితులకు చట్టపరమైన రక్షణతో పాటు తగిన కౌన్సిలింగు అందిస్తున్నాం. ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ మహిళలు, యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి ఫ్రెండ్లీ పోలీసింగు సేవలు అందుబాటులో వున్నాయి. తీవ్ర మానసిక ఒత్తిడి ఎదురైతే 112 లేదా 100కు సమాచారం ఇచ్చి పోలీసుల సహాయం పొందవచ్చు.

================

Updated Date - Sep 10 , 2026 | 12:04 AM