Are those changes transparent? ఆ మార్పులు పారదర్శకమేనా?
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:05 AM
Are those changes transparent? ‘‘నగర పంచాయతీ కార్యాలయంలో అంతర్గత బదిలీల వెనుక ఏదో జరిగింది.. సహేతుక విధానం పాటించినట్లు కనిపించట్లేదు.. కీలక బాధ్యతలను చూస్తున్న వ్యక్తులను అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చారు.. అవినీతి మరకలు ఉన్న ఉద్యోగులకు అందలం ఎక్కించారు..’’ కొద్దిరోజులుగా నగర పంచాయతీ ఉద్యోగుల్లో నడుస్తున్న చర్చ ఇది. పాలనలో భాగంగా ఇటీవల కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన 20 రోజుల్లోనే బదిలీలు, బాధ్యతల మార్పులకు దిగడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
ఆ మార్పులు పారదర్శకమేనా?
నగర పంచాయతీ కార్యాలయంలో అంతర్గత బదిలీల కలకలం
కమిషనర్ నిర్ణయాలపై తీవ్ర చర్చ
ఉద్యోగుల్లో అయోమయం
అవినీతి మరకలు ఉన్న ఉద్యోగులకు అందలంపై విమర్శలు
‘‘నగర పంచాయతీ కార్యాలయంలో అంతర్గత బదిలీల వెనుక ఏదో జరిగింది.. సహేతుక విధానం పాటించినట్లు కనిపించట్లేదు.. కీలక బాధ్యతలను చూస్తున్న వ్యక్తులను అప్రాధాన్య పోస్టుల్లోకి మార్చారు.. అవినీతి మరకలు ఉన్న ఉద్యోగులకు అందలం ఎక్కించారు..’’ కొద్దిరోజులుగా నగర పంచాయతీ ఉద్యోగుల్లో నడుస్తున్న చర్చ ఇది. పాలనలో భాగంగా ఇటీవల కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన 20 రోజుల్లోనే బదిలీలు, బాధ్యతల మార్పులకు దిగడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
నెల్లిమర్ల, జూన్ 23(ఆంధ్రజ్యోతి):
నెల్లిమర్ల నగర పంచాయతీ పాలకవర్గ పదవీకాలం మార్చి పదో తేదీతో ముగిసిపోవడంతో పాటు కమిషనర్‌గా పనిచేసిన అధికారి గత నెల 31న ఉద్యోగ విరమణ పొందారు. కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్న విజయనగర పాలకసంస్థ అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు పలు విభాగాల్లో మార్పులు చేశారు. పరిపాలన అవసరాల పేరిట ఉద్యోగుల విధులను మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్య వివాదాస్పదంగా మారింది. ఎలాంటి కారణాలు చూపకుండా ఆకస్మికంగా మార్పులు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. విభాగాల మార్పు, విధుల కేటాయింపు ప్రక్రియ అయినవారికి ఆకులు, కానివారికి కంచాలు చందంగా చేశారని చర్చించుకుంటున్నారు.
తాగునీటి విభాగంలో ఇంతవరకు పంపు ఆపరేటర్లుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్యాలయంలో ప్రధాన విధులను అప్పగించారు. ఇంతవరకు ప్రధాన విఽధులను నిర్వహించిన ఉద్యోగులను తాగునీటి పథకాల పంప్ ఆపరేటర్లుగా మార్చడం వెనుక ఉద్దేశం ఏమిటని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంతవరకు పంప్ ఆపరేటర్‌గా పనిచేసిన ఒక ఉద్యోగిని తీసుకువచ్చి కార్యాలయంలో జనన, మరణ నమోదు ఉద్యోగిగా మార్పు చేశారు. ఆ స్థానంలో ఇంతవరకు పనిచేసిన ఉద్యోగిని పంపు ఆపరేటర్‌గా పంపించారు. మరో పంప్ ఆపరేటర్‌ను ఆ విధుల్లో ఉంచుతూ ఇంటి పన్నుల వసూలుకు బిల్లు కలెక్టర్‌గా అదనపు విధులు అప్పగించారు. ఈ ఉద్యోగి గతంలో బిల్లు కలెక్టర్‌గా విధులు నిర్వహించినప్పుడు అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో కార్యాలయ విధుల నుంచి తప్పించి పంపు ఆపరేటర్‌గా పంపించారు. ఇప్పుడు తిరిగి అదే వ్యక్తిని మళ్లీ బిల్లు కలెక్టర్‌గా ఎలా వేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫ కొన్ని సంవత్సరాలుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి అయిన హెల్త్ అసిస్టెంట్‌కు ఆ అదనపు బాధ్యతలను ఆకస్మికంగా తప్పించారు. ఆ బాధ్యలను ఆయన కన్నా దిగువ స్థాయి ఉద్యోగి, సచివాలయ పరిధిలోని శానిటరీ కార్యదర్శికి అప్పగించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. కార్యాలయంలో ఇంతవరకు అటెండర్లుగా పని చేస్తున్న ఇద్దరు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వారి స్థాయిని పెంచి ఆశీలు కలెక్షన్‌కు, ఇంటి పన్ను వసూలు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అటెండర్ స్థాయి ఉద్యోగులకు ఉన్నత స్థాయి పనులు అప్పగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా కమిషనర్ పరిపాలనాపరమైన అవసరాలు (అడ్మినిస్ర్టేటివ్ గ్రౌండ్స్)పేరుతో ఉద్దేహ పూర్వకంగా చేస్తున్నారా, లేదంటే ఎవరైనా కథ నడిపిస్తున్నారా అన్న సంశయాలు కొందరిలో కలుగుతున్నాయి. మే 31వ తేదీ వరకు ప్రశాంతంగా నడిచిన కార్యాలయంలో ఈ 20 రోజుల్లో ఎందుకిన్ని మార్పులు చోటు చేసుకున్నాయంటూ చర్చించుకుంటున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయ పాలన వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాని కోరుతున్నారు.
అవసరం మేరకే బదిలీలు
నెల్లిమర్ల నగర పంచాయతీలో పరిపాలనాపరంగా అవసరం మేరకే పలువురి విధులను మార్చాం. దీంట్లో ఎలాంటి ఉద్దేశపూర్వకం లేదు. ప్రజాసేవలు వేగవంతం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం.
- కిల్లాన అప్పలరాజు, కమిషనర్, నెల్లిమర్ల నగర పంచాయతీ