Are the elections happening or not? ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:50 PM
Are the elections happening or not? రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టిసారించింది. సన్నాహాలు ప్రారంభించింది. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల కేటాయింపు తదితర అంశాలను కొలిక్కి తెచ్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా ఎన్నికల ప్రక్రియ జరగని రాజాంకు ఈసారైనా కదలిక వస్తుందేమో అన్న చర్చ జిల్లాలో సాగుతోంది.
ఎన్నికలు ఉన్నట్టా? లేనట్టా?
రాజాం మునిసిపాల్టీపై సందిగ్ధత
కోర్టు కేసులో కౌంటర్ దాఖలు చేసిన అధికారులు
ఆ రెండు పంచాయతీలతోనే చిక్కు
ప్రభుత్వానికి నివేదించిన అధికారులు
రాజాం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టిసారించింది. సన్నాహాలు ప్రారంభించింది. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల కేటాయింపు తదితర అంశాలను కొలిక్కి తెచ్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా ఎన్నికల ప్రక్రియ జరగని రాజాంకు ఈసారైనా కదలిక వస్తుందేమో అన్న చర్చ జిల్లాలో సాగుతోంది. కోర్టు కేసుల్లో ఉన్న మునిసిపాల్టీల్లో కూడా స్థానిక సమస్యలను కొలిక్కి తెచ్చి ఎన్నికలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అయితే రాజాంకు సంబంధించి వార్డుల పెంపు ప్రకటన ఇచ్చింది. ఈ అంశంలో కూడా పొనుగుటివలస, కొత్తవలస పంచాయతీలను మినహాయించాలని కోరుతూ స్థానికులు కోర్టుకు వెళ్లడంతో వార్డుల విభజనకు బ్రేక్ పడింది. ఈ పరిణామంతో అన్ని మునిసిపాల్టీలతో పాటు రాజాంకు ఎన్నికలు జరుగుతాయా? జరగవా?అన్న అనుమానం స్థానికుల్లో ఉంది.
రాజాం మున్సిపాలిటీ వివాదం కోర్టులో ఉన్నందున ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. నగరపంచాయతీ, ఆపై మున్సిపాలిటీ అయిన తరువాత సుమారు 18 మంది కమిషనర్లు మారారు. కేసు మాత్రం పెండింగ్‌లోనే నడుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయినా ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించి కోర్టు కేసులు పరిష్కరించుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో కమీషనర్ ఏ.రామచంద్రరావు కొంతమంది సిబ్బందిని వెంటబెట్టుకొని ఇటీవల హైకోర్టుకు వెళ్లి అడిషనల్ అడ్వకేట్ జనరల్‌ను కలిశారు. కేసు వివరాలను తెలియజేశారు. ఆపై కోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్టు కమిషనర్ తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అభివృద్ధి పనులకు రావాల్సిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.10 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని, కోర్టు కేసు పరిష్కారమైతే రాజాం మున్సిపాలిటీ విశేషంగా అభివృద్ధి చెందుతున్నారు.
రాజాం నగర పంచాయతీగా 2005లో రూపాంతరం చెందింది. సారధి మేజర్ పంచాయతీలో పొనుగటివలస, కొత్తవలస, కొండంపేటలను విలీనం చేస్తూ రాజాం నగర పంచాయతీని ఏర్పాటుచేశారు. కానీ న్యాయస్థానంలో కేసుల దృష్ట్యా ఎన్నికలు సాధ్యపడలేదు. రెండు దశాబ్దాలుగా పాలకవర్గాలు లేవు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రత్యేకాధికారుల ఏలుబడిలోనే కొనసాగుతోంది. ఆ మూడు పంచాయతీలకు సంబంధించి పాలకవర్గాలు ఉండగానే 2005లో ప్రత్యేక తీర్మానం చేసి నగర పంచాయతీలో విలీనం చేశారు. నాలుగేళ్ల కిందట వైసీపీ హయాంలోనే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రత్యేక తీర్మానాలు చేయించారు. ప్రత్యేకాధికారులను నియమించి ఆ తతంగం పూర్తిచేశారు. 2021లో మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్ చేసి ఎన్నికలకు సిద్ధపడ్డారు. మరోసారి పొనుగుటివలస, కొండంపేట, కొత్తవలస పంచాయతీలు విలీన ప్రక్రియతో ఉపాధి హామీ పథకం నిలిచిపోతుందని.. పన్నుల భారంతో సతమతమవుతామని చెప్పి మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి ఎన్నికల నిర్వహణ జోలికి వెళ్లడం లేదు.
నిధలు లేక.. అభివృద్ధి కాక
రెండు దశాబ్దాలుగా పాలకవర్గం లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ పడింది. ఐదు విడతల్లో రావాల్సిన రూ.10 కోట్లు నిలిచిపోయాయి. కేవలం సాధారణ నిధులతోనే నెట్టుకొస్తున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.2.25 కోట్లు, శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ (సుడా) నుంచి మరో రూ.10 కోట్లు వచ్చాయి. మొత్తం రూ.12,50 కోట్లతో 180 పనులు చేపట్టాల్సి ఉంది. కానీ పాలకవర్గం లేకపోవడంతో పనులు మొదలుపెట్టలేదు. పర్యవేక్షణ కూడా లేదు. ప్రత్యామ్నాయ రూపంలో నిధులు తెచ్చుకోవడం తప్ప.. నేరుగా వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఆ రెండు పంచాయతీలను మినహాయించి.. మిగతా ప్రాంతాలతో మునిసిపాల్టీని ఏర్పాటుచేస్తారంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ రెండు పంచాయతీల విషయంలో అధికార కూటమి, విపక్ష వైసీపీతో పాటు అన్నిరాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వస్తే సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం కనిపించడం లేదు.