Are our buildings safe? మన భవనాలు భద్రమేనా?
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:06 AM
Are our buildings safe? ఢిల్లీలో ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమైన ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను చలింపజేసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వారంతా కన్నీరుపెట్టారు. ఆ మహా విషాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన దయనీయ గాథలు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. జిల్లాలోనూ అలాంటి భవనాలు అనేకం ఉన్నాయని కలవర పడుతున్నారు.
మన భవనాలు
భద్రమేనా?
జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, భారీ భవంతులు, షాపింగ్ మాల్స్
అగ్నిమాపక శాఖ అనుమతులున్నవి కొన్నే
క్షేత్రస్థాయి పరిశీలనలు లేకుండానే పర్మిషన్లు
జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ ఘటన
- విజయనగరంలో గత ఏడాది మేలో రైల్వేస్టేషన్ మార్గంలోని ఓ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇదే మాల్‌లో నాలుగు థియేటర్లతో పాటు రెస్టారెంట్, చిన్నారుల గేమ్ జోన్ ఉంది. ఒక్కసారిగా రెస్టారెంట్ సీలింగ్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో మాల్‌లో ఉన్న పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు పరుగులుతీశారు. రాత్రి 9 గంటల సమయం కావడంతో థియేటర్లు బంద్ అయ్యాయి. లేకుంటే తొక్కిసలాట జరిగేది.
- రెండేళ్ల కిందట రాజాంలో గృహోపకరణాల షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏసీలు, గృహోపకరణాలకు సంబంధించిన షాపులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లో ఇతర షాపులకు వ్యాపిస్తుండగా జనం పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
- 2023లో విజయనగరం జిల్లాకేంద్రం ఆర్‌అండ్‌బీ బంగ్లా సమీపంలోని మూడు అంతస్తుల వస్త్ర దుకాణం అగ్నికి ఆహుతి అయ్యింది. కోట్లరూపాయల నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు తేల్చారు. అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.
ఢిల్లీలో ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమైన ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను చలింపజేసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వారంతా కన్నీరుపెట్టారు. ఆ మహా విషాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన దయనీయ గాథలు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. జిల్లాలోనూ అలాంటి భవనాలు అనేకం ఉన్నాయని కలవర పడుతున్నారు. తేరుకోకపోతే భవిష్యత్‌లో పెను అపాయం తప్పదని భయపడుతున్నారు. జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా లేని భవనాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వారంతా పునరాలోచించి ప్రమాద రహితంగా భవనాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని ఢిల్లీ ఘటన గుర్తుచేస్తోంది.
విజయనగరం, జూన్ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పట్టణాలు, నగరంలో ఇరుకు సందుల్లో కనీస నిబంధనలు పాటించకుండా ఉన్న భవనాలు కోకొల్లలు. అగ్నిమాపక శాఖకు సంబంధించి అనుమతులు తీసుకోకపోవడం, సంబంధిత శాఖలు బాధ్యతగా వ్యవహరించకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ఘటన కూడా ఇదే తరహాలో చోటుచేసుకుంది. జిల్లాలో ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్ల ఏర్పాటు, నిర్మాణంలో కనీస నిబంధనలు పాటించడం లేదు. అనుమతుల విషయంలో సైతం నిర్లక్ష్యం కొనసాగుతోంది. రాష్ట్రంలో భారీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి చేసింది. దరఖాస్తు చేసిన 21 నుంచి 30 రోజుల్లో అన్నిరకాల తనిఖీలు చేపట్టి ఎన్‌వోసీ మంజూరు చేస్తామంటోంది. క్షేత్రస్థాయిలో అధికారులు తప్పనిసరిగా పరిశీలించి ఈ ప్రక్రియ చేపట్టాలి. కానీ ఇదెక్కడా అమలువుతున్న దాఖలాలు లేవు. అధికారులు కనీస స్థాయిలో సందర్శించకుండానే ధ్రువపత్రం జారీచేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
ఇవి తప్పనిసరి..
భారీ భవంతులు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, హోటళ్ల నిర్మాణంలో అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. భవనం చుట్టూ ఫైర్ ఇంజన్ సులభంగా తిరిగేందుకు అవసరమైన ఖాళీ స్థలం ఉంచాలి. భవనంలో ప్రతి గదిలో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి. అత్యవసర మార్గాలను ఏర్పాటు చేయాలి. జిల్లాలో మాత్రం అటువంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. విజయనగరంలో అయితే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవే అధికం. ఇరుకు సందుల్లోనే ఎక్కువగా కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. భారీ షాపింగ్ మాల్స్, భవంతులు వెలిశాయి. అటు బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీల్లోనూ అదే పరిస్థితి. కార్యాలయాల నుంచి అడుగు బయటపెట్టక ముందే అనుమతులు జారీచేస్తున్నారన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రణాళిక విభాగాలు సైతం భవనాల మంజూరులో నిబంధనలు పాటించడం లేదు. అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత ఉంది. జిల్లా అవసరాలకు తగ్గట్టు అగ్నిమాపక కేంద్రాలు లేవు. భారీ భవంతులు, షాపింగ్ మాల్స్, హోటళ్లలో అగ్నిప్రమాదాలు జరిగితే అంతే సంగతులు.
హోటళ్లు, రెస్టారెంట్లలో..
జిల్లా కేంద్రంలో రెస్టారెంట్లు - 31, లాడ్జీలు 21, హోటల్స్ (గదులు అద్దెకిచ్చే భవనాలు) లాడ్జీలు 158 , హాస్టల్స్ 45 ఉన్నాయి. ఎస్.కోట, రాజాం, బొబ్బిలి తదితర పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా గదులు అద్దెకిచ్చే హోటల్స్ 1000 కిపైనే ఉంటాయి. కొన్నిచోట్ల హోటళ్ల కిందనే రెస్టారెంట్లు ఉన్నాయి. అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కిచెన్లు ఏర్పాటుచేస్తున్నారు. అసలు రెస్టారెంట్, హోటల్‌కు విడిగా పూర్తి రక్షణతో వంట గదులు ఏర్పాటుచేయాలి. ఇటీవల గ్యాస్ కొరతతో దాదాపు పేరుమోసిన హోటళ్లు ఎక్కువగా విద్యుత్ హీటర్లు వినియోగిస్తున్నాయి. మొత్తం హోటల్, రెస్టారెంట్‌కు అంతర్గత విద్యుత్ వైరింగ్ ఏర్పాటుచేస్తున్నారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అక్కడ అగ్నిప్రమాద నియంత్రణకు సంబంధించి పరికరాలు కూడా అందుబాటులో లేవు. చాలా నిర్మాణాలు, భవనాలపై అసలు అగ్నిమాపక శాఖ పర్యవేక్షణ లేదు. తాజాగా ఢిల్లీలో జరిగిన ప్రమాదంతోనైనా అప్రమత్తం కావాల్సి ఉంది.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
జిల్లాలో అగ్నిమాపక శాఖపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అగ్నిమాపక వారోత్సవాల్లో హోటళ్లు, భారీ భవంతులు, ఆస్పత్రుల యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. ప్రమాదాల నియంత్రణకు సంబంధించి పరికరాలు ఉంచుకోవాలి. అనుమతులు కూడా తప్పనిసరి.
- రాజేష్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, విజయనగరం
==================