Share News

మన భవనాలు క్షేమమేనా?

ABN , Publish Date - Jun 04 , 2026 | 11:29 PM

ఢిల్లీలో ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమైన ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను చలింపజేసింది.

మన భవనాలు క్షేమమేనా?

- జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లాడ్జీలు, రెస్టారెంట్లు

- కానరాని అత్యవసర ద్వారాలు

- ప్రమాదాలు జరిగితే అంతే సంగతులు

- అధికారులు తనిఖీలు చేపడితే లోపాలు బహిర్గతం

పార్వతీపురం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఓ హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది సజీవ దహనమైన ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను చలింపజేసింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వారంతా కన్నీరుపెట్టారు. ఆ మహా విషాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన దయనీయ గాథలు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. జిల్లాలోనూ అలాంటి భవనాలు అనేకం ఉండడంతో ప్రజలు కలవర పడుతున్నారు. తేరుకోకపోతే భవిష్యత్‌లో పెను అపాయం తప్పదని భయపడుతున్నారు. జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా లేని భవనాలు చాలా ఉన్నాయి. వారంతా పునరాలోచించి ప్రమాద రహితంగా భవనాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని ఢిల్లీ ఘటన గుర్తుచేస్తోంది.

జిల్లాలో పరిస్థితి..

పార్వతీపురం పట్టణంలో లాడ్జీలతో పాటు వాటికి అనుసంధానంగా ఉన్న రెస్టారెంట్లు 10 వరకు ఉన్నాయి. ప్రత్యేక రెస్టారెంట్లు కూడా సుమారు 20 వరకు ఉన్నాయి. సాలూరు పట్టణంలో లాడ్జీలకు అనుసంధానంగా ఐదు రెస్టారెంట్లు, పాలకొండలో లాడ్జీకి అనుసంధానంగా ఒక రెస్టారెంట్‌ ఉంది. ఇవే కాకుండా సాలూరు, పాలకొండ ప్రాంతాల్లో ప్రత్యేక రెస్టారెంట్లు ఉన్నాయి. అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. అసలు రెస్టారెంట్‌, హోటల్‌కు విడిగా పూర్తి రక్షణతో వంట గదులు ఏర్పాటు చేయాలి. ఇటీవల గ్యాస్‌ కొరతతో దాదాపు పేరుమోసిన హోటళ్లు ఎక్కువగా విద్యుత్‌ హీటర్లు వినియోగిస్తున్నాయి. మొత్తం హోటల్‌, రెస్టారెంట్‌కు అంతర్గత విద్యుత్‌ వైరింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అక్కడ అగ్నిప్రమాద నియంత్రణకు సంబంధించి పరికరాలు కూడా అందుబాటులో లేవు. తాజాగా ఢిల్లీలో జరిగిన ప్రమాదంతోనైనా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది.

ఇవి తప్పనిసరి..

భారీ భవంతులు, ఆస్పత్రులు, షాపింగ్‌ మాల్స్‌, హోటళ్ల నిర్మాణంలో అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. భవనం చుట్టూ ఫైర్‌ ఇంజన్‌ సులభంగా తిరిగేందుకు అవసరమైన ఖాళీ స్థలం ఉంచాలి. భవనంలో ప్రతి గదిలో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి. అత్యవసర మార్గాలను ఏర్పాటు చేయాలి. జిల్లాలో మాత్రం అటువంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు. చాలా లాడ్జీలకు అనుసంధానంగా ఉన్న రెస్టారెంట్లలో అగ్ని, విద్యుత్‌ ప్రమాదాలు జరిగితే తప్పించుకునేందుకు అత్యవసర ద్వారాలు లేవు.

తనిఖీలు నిర్వహిస్తున్నాం

ఫైర్‌ సర్వీస్‌ యాక్ట్‌ వర్తించే పెద్ద లాడ్జీలు, రెస్టారెంట్లు, భవనాలు జిల్లాలో లేవు. అయినప్పటికీ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దే చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఏడాదిగా ఎటువంటి అగ్ని ప్రమాదాలు లేవు. ప్రధానంగా ఆసుపత్రులతో పాటు విద్యాలయాలను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. తనిఖీలపై కలెక్టర్‌కు నివేదిక కూడా అందిస్తాం.

-సింహాచలం, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి

Updated Date - Jun 04 , 2026 | 11:29 PM