Share News

‘హైస్కూల్‌ ప్లస్‌’లు ఇక కనుమరుగేనా?

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:35 PM

త వైసీపీ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేసి ఇంటర్మీడియట్‌ను ప్రారంభించింది.

‘హైస్కూల్‌ ప్లస్‌’లు ఇక కనుమరుగేనా?
గరుగుబిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

- పూర్తిగా పడిపోయిన అడ్మిషన్లు

- బోధనా సిబ్బంది కరువు

- ప్రాక్టికల్స్‌కు విద్యార్థుల ఇబ్బందులు

- వైసీపీ సర్కారు నిర్లక్ష్యమే కారణం

- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

జియ్యమ్మవలస, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేసి ఇంటర్మీడియట్‌ను ప్రారంభించింది. 2020-21 విద్యా సంవత్సరంలో హైస్కూల్‌ ప్లస్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. మన్యం జిల్లాలో మాత్రం 2023-24 ప్రారంభమయ్యింది. అయితే, వైసీపీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా హైస్కూల్‌ ప్లస్‌లు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. అప్పట్లో అధ్యాపకులను నియమించకపోవడం, ప్రాక్టికల్స్‌ సదుపాయం లేకపోవడంతో జిల్లాలో రెండేళ్లుగా ఆశించినస్థాయిలో అడ్మిషన్లు జరగడం లేదు. కూటమి ప్రభుత్వమైనా కొత్త విధి విధానాలతో హైస్కూల్‌ ప్లస్‌లను కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

జిల్లాలో రెండుచోట్ల..

జిల్లాలో 2023-24లో గరుగుబిల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైస్కూల్‌ ప్లస్‌గా ఎంపిక చేశారు. గరుగుబిల్లిలో సైన్స్‌, ఆర్ట్స్‌ గ్రూపులు నెలకొల్పారు. ఆ ఏడాది ఇక్కడ ఈ రెండు గ్రూపుల్లో 20 మంది విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరారు. శత శాతం ఉత్తీర్ణత కూడా వచ్చింది. సీతంపేట పాఠశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 26 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇక్కడ కూడా శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి ఏడాది, రెండవ ఏడాది కూడా అష్ట కష్టాల మీడ కొనసాగించారు. అయితే, బోధనకు సీనియర్‌ అధ్యాపకులను నియమించకపోవడం, పాఠపుస్తకాలను సకాలంలో పంపిణీ చేయకపోవడం, సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ సదుపాయం లేకపోవడం తదితర కారణాలతో హైస్కూల్‌ ప్లస్‌ల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. మొదటి రెండేళ్లు అష్టకష్టాల మీద వీటిని కొనసాగించారు. ఆ తరువాత విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు అంతగా లేకపోవడంతో హైస్కూల్‌ ప్లస్‌లు మరి లేనట్లే అని ఆ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 2025-26 సంవత్సరంలో గరుగుబిల్లి నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వమైనా కొత్త విధి విధానాలతో హైస్కూల్‌ ప్లస్‌ను అమలు చేయాలని వారు కోరుతున్నారు.

ఇబ్బందులెన్నో

హైస్కూల్‌ ప్లస్‌ల నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ప్రధానంగా బోధనా సిబ్బందిని నియమించకపోవడంతో విద్యార్థులు ముఖం చాటేస్తున్నారు. అదే విధంగా బోధన అధ్యాపకులుగా హైస్కూల్‌ ఉపాధ్యాయులకే బాధ్యత అప్పగించడం, దానికి తగ్గ రెమ్యూనరేషన్‌ ఇవ్వకపోవడంతో వారు బోధించేందకు నిరాకరిస్తున్నారు. హైస్కూల్‌ ప్లస్‌లో ప్రాక్టికల్‌ సదుపాయం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2024-25లో అప్పటి జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు చొరవ తీసుకుని గరుగుబిల్లి హైస్కూల్‌ ప్లస్‌ విద్యార్థులకు గరుగుబిల్లిలోనే ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూ రెసిడెన్సియల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రాక్టికల్స్‌ నిర్వహించారు. సీతంపేట హైస్కూల్‌ ప్లస్‌ విద్యార్థులకు భామినిలో సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాలలో ప్రాక్టికల్స్‌ నిర్వహించారు.

రెండేళ్లుగా అడ్మిషన్లు లేవు

హైస్కూల్‌ ప్లస్‌లలో 2025-26, 2026-27 విద్యా సంవత్సరాల్లో పూర్తిగా అడ్మిషన్లు లేవు. దీనికి కారణం ప్రత్యేక బోధనా సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం, హైస్కూల్‌ ఉపాధ్యాయులు బోధించేందుక నిరాకరించడం. దీనివల్ల హైస్కూల్‌ ప్లస్‌లో విద్యార్థులు చేరడం లేదు.

-వి.హరగోపాల్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖాధికారి, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 13 , 2026 | 11:35 PM