Kharif Cultivation ఖరీఫ్ సాగుకు కష్టాలు తప్పవా?
ABN , Publish Date - Jun 16 , 2026 | 12:13 AM
Are Difficulties Inevitable for Kharif Cultivation? తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని పాత రెగ్యులేటర్‌కు చెందిన ప్రధాన కాలువలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం కుడి కాలువ గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో నిండింది. కాలువల్లో దిగేందుకు వీలులేని పరిస్థితి. ఎడమ కాలువ ప్రాంతం కోతకు గురైంది. మరోవైపు ఏడాది కాలంగా ప్రధాన కాలువకు చెందిన షట్టర్లు కూడా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో సాగునీరు వృథాగా పోతోంది.
ఏడాది కావస్తున్నా మరమ్మతులకు నోచని షట్టర్లు
వృథాగా పోతున్న సాగునీరు..
మంజూరు కాని నిధులు.. ఆందోళనలో రైతులు
గరుగుబిల్లి, జూన్15(ఆంధ్రజ్యోతి): తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని పాత రెగ్యులేటర్‌కు చెందిన ప్రధాన కాలువలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం కుడి కాలువ గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో నిండింది. కాలువల్లో దిగేందుకు వీలులేని పరిస్థితి. ఎడమ కాలువ ప్రాంతం కోతకు గురైంది. మరోవైపు ఏడాది కాలంగా ప్రధాన కాలువకు చెందిన షట్టర్లు కూడా మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో సాగునీరు వృథాగా పోతోంది. నిధులు మంజూరు కాక పోవడంతో ప్రాజెక్టు పరిధిలో పనులేవీ జరగడం లేదు. దీంతో రైతన్నలు ఆందోళన చెందు తున్నారు. ఇప్పటికే వరి విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. ఖరీఫ్ రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. అయితే అధికారులు ఇంకా సాగునీటిపై దృష్టి సారించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
- ఎడమ ప్రధాన కాలువ పరిధిలో సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గరుగుబిల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పరిధిలోని పాలవలస వరకు సాగునీరు చేరుతుంది. గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ పరిధిలోని రైతులకు ఈ కాలువే ప్రధాన ఆధారం. కుడి కాలువకు సంబంధించి 9 వేల ఎకరాలకు పైగా సాగునీరు సరఫరా అవుతుంది. గరుగుబిల్లి, బలిజిపేట, విజయనగరం జిల్లా వంగర మండలాలకు చెందిన రైతులకు ఈ కాలువే ప్రధాన ఆధారం. రెండు కాలువల పరిధిలో గత కొన్నాళ్లుగా అధికంగా గండ్లు పడుతున్నాయి. జల వనరులశాఖ ప్రేక్షక పాత్ర వహించడంతో రైతులే సొంతంగా గండ్లు పూడ్చుకున్న పరిస్థి తులు నెలకొన్నాయి. మొత్తంగా రెండు కాలువల పరిధిలోని రైతులు ఏటా ఖరీఫ్‌కాలంలో పడరాని పాట్లు పడుతున్నారు. గతేడాది జూలైలో కాలువల నుంచి సాగునీరు విడుదల చేశారు. అయితే షట్టర్లు మరమ్మతులకు గురవడంతో ఏడాదిగా రోజుకు 300 క్యూసెక్కులకు పైబడే నీరు వృథాగా పోతుంది.
ఆధునికీకరణ పనులెప్పుడో..?
పాత రెగ్యులేటర్ పరిధిలోని రెండు కాలువలను బ్రిటిష్ హయాంలో నిర్మించారు. 37.52 కిలో మీటర్లు మేర ఎడమ కాలువ, 20 కిలో మీటర్ల మేర కుడి కాలువకు ఏర్పాటు చేశారు. మొత్తంగా రెండు కాలువల పరిధిలో సుమారు 64 వేల ఎకరాలకు సాగునీరందేలా అప్పట్లో చర్యలు చేపట్టారు. అయితే రెండు కాలువలు శిఽథిలావస్థకు చేరుకోవడంతో 2018లో టీడీపీ ప్రభుత్వం ఆధునికీకరణకు రూ. 193 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో సుమారు 23 శాతం అభివృద్ధి పనులు నిర్వహించారు. అయితే ఆ తర్వాత వైసీపీ సర్కారు అధికారంలోకి రావడంతో పనులు అర్ధాంతరంగా నిలిచాయి. 2020 సంవత్సరం నుంచి రెండు కాలువలు మరింత దయనీయంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధునికీకరణ కోసం రూ. 258 కోట్లతో అధికారులు ప్రతిపాదించినా.. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. షట్టర్లు మరమ్మ తులకు మరో రూ. 46.20 లక్షలు అవసరమని సంబంధిత రెగ్యులేటర్ అధికారులు నార్త్ కోస్ట్ చీఫ్ ఇంజనీర్‌కు ప్రతిపాదనలు పంపించారు. అయితే నెల రోజులు గడిచినా.. నేటికీ ఎటువంటి సమాచారం లేదు.
ప్రాజెక్టులో నీటి నిల్వలు ఇలా..
ప్రస్తుతం తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 103.50 మీటర్ల మేర నీటి నిల్వలున్నాయి. పైప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 475 క్యూసెక్కుల నీరు చేరుతుంది. ఇందులో 300 క్యూసెక్కులు కాలువలు, నది గుండా సరఫరా అవుతుంది. అయితే రుతు పవనాల రాక ఆలస్యమైతే వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రాజెక్టులో నీటినిల్వలు మరింత తగ్గనున్నాయి. ఇదే జరిగితే సాగునీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవు. ఏదేమైనా ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఖరీప్ వరి సాగు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు.
ప్రతిపాదనలు పంపించాం
తోటపల్లి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్ పరిధిలోని రెండు కాలువల షట్టర్ల మరమ్మతుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధుల మంజూరులో జాప్యం నెలకొంది. షట్టర్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో నీరు విడుదల చేయకముందే వృథాగా పోతోంది.
-డీవీ రమణ, ఏఈ, వీరఘట్టం, తోటపల్లి పాత రెగ్యులేటర్