When Will the Work Begin? మంజూరై పది నెలలు .. మరి పనులెప్పుడో?
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:39 PM
Approved 10 Months Ago… When Will the Work Begin? జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధాన రోడ్లు నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. వాటి నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది డిసెంబరులోనే నిధులు మంజూరు చేసింది. పరిపాలన, సాంకేతిక ఆమోదం తెలిపింది. అయితే సుమారు 10 నెలలు గడుస్తున్నా.. నేటికీ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
నిధులున్నా.. జరగని పనులు
రాకపోకలు సాగించలేకపోతున్న వాహనదారులు, ప్రజలు
త్వరలో ప్రారంభిస్తామంటున్న అధికారులు
జియ్యమ్మవలస, అక్టోబరు4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధాన రోడ్లు నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. వాటి నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది డిసెంబరులోనే నిధులు మంజూరు చేసింది. పరిపాలన, సాంకేతిక ఆమోదం తెలిపింది. అయితే సుమారు 10 నెలలు గడుస్తున్నా.. నేటికీ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పల్లెవాసులు కూఏడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్వాన రహదారులపై రాకపోకలు సాగించలేకపోతున్నామని, దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
- ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ స్ర్టెంక్తనింగ్ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ) కింద జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 23 బీటీ రోడ్లును ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి రూ. 56.78 కోట్లు కేటాయించింది. నిర్మాణ బాధ్యతలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగానికి అప్పగించింది. ఈ పనులు పూర్తయితే మొత్తం 107.241 కిలో మీటర్లు వరకు రోడ్డు అనుసంధానం పూర్తయినట్టే.
- మంజూరైన రోడ్లలో పాచిపెంట మండలంలో ఐదు, సాలూరు మండలంలో రెండు, పార్వతీపురం మండలంలో ఐదు, సీతానగరం మండలంలో మూడు, పాలకొండ మండలంలో మూడు, సీతంపేట, కురుపాం, వీరఘట్టాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. అయితే నిధులు మంజూరై దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారంతా గుంతలు ఏర్పడడంతో రాకపోకలు కష్టంగా మారింది.
- పాచిపెంట రూరల్: వేటగానివలసలో 5.78 కిలోమీటర్లు రోడ్డుకు గతంలో రూ.3.13 కోట్లు మంజూరైంది. అయితే దీని పనులు కూడా ప్రారంభం కాలేదు. మాతుమూరు జంక్షన్ నుంచి కుడుమూరు మీదుగా వేటగానివలసకు వెళ్లే రోడ్డు ప్రస్తుతం అధ్వానంగా మారింది. ఎక్కడకక్కడ రాళ్లు తేలి గుంతలమయంగా మారడంతో తంగలాం, గరిసిగుడ్డి, మూటకూడు, బొ ర్రమామిడి, గొట్టూరు, శతాబి పంచాయతీల్లో సుమారు 50 గిరిజన గ్రామాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు 108 వాహనం కూడా వెళ్లడం లేదు. దీంతో గిరిజనులు అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందలేకపోతున్నారు. ఉపాధ్యాయులు, వైద్య, సచివాలయాల సిబ్బంది కూడా తిప్పలు తప్పడంలేదు. కాగా త్వరలో ఈ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ డీఈ శర్మ తెలిపారు.
త్వరలో ప్రారంభిస్తాం
జిల్లాలో 23 రోడ్లు మంజూరవ్వడం వాస్తవమే. తారు రేటు పెరగడం, ఎస్టిమేంట్ల జాబితా రూపకల్పనలో జాప్యం కారణంగా రోడ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. వాటిని పల్లె పండుగ 3.0లోకి తీసుకొస్తున్నాం. ప్రస్తుతం వాటి ఎస్టిమేట్లు చకచకా వేస్తున్నాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం.
- జి.ప్రదీప్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయతీరాజ్ శాఖ, పార్వతీపురం మన్యం