Traffic Woes! ఆమోదిస్తే.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే!
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:15 PM
Approval Could Resolve Traffic Woes! జిల్లా కేంద్రం పార్వతీపురంలో సుమారు రూ.85 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పార్వతీపురం మండలం నర్సిపురం నుంచి చిన్నబొండపల్లి, చొక్కాపువానివలస, లక్ష్మీ నారా యణపురం, కృష్ణపల్లి గంగసాగరం మీదుగా శివుని వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి నిర్మించాల్సి ఉందని ప్రతిపాదనల్లో పేర్కొంది.
రూ.85 కోట్లతో అంచనాలు
15 కిలోమీటర్ల నిర్మాణం కోసం
ప్రభుత్వానికి పంపించిన ఆర్‌అండ్‌బీ శాఖ
పార్వతీపురం, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంలో సుమారు రూ.85 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పార్వతీపురం మండలం నర్సిపురం నుంచి చిన్నబొండపల్లి, చొక్కాపువానివలస, లక్ష్మీ నారా యణపురం, కృష్ణపల్లి గంగసాగరం మీదుగా శివుని వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర బైపాస్ రహదారి నిర్మించాల్సి ఉందని ప్రతిపాదనల్లో పేర్కొంది. శివుని గ్రామం వద్ద బైపాస్ రహదారి కనెక్ట్ చేస్తే భవిష్యత్‌లో జిల్లా కేంద్ర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాకేంద్రంగా ఏర్పాటైన తర్వాత పార్వతీపురంలోని వాహనాల రద్దీ బాగా పెరిగింది. పట్టణం మీదుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రాయగడ రోడ్డు జంక్షన్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అంతర్రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఆక్రమణలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. ఇక దుకాణ సముదాయాల ముందు వాహనాలను కూడా పార్కింగ్ చేయలేని పరిస్థితి. మరోవైపు వాహన రాకపోకలకు ఇక్కట్లు తప్పడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న గత టీడీపీ ప్రభుత్వం బైపాస్ రహదారి నిర్మాణానికి అప్పట్లో సర్వే కూడా నిర్వహించింది. పార్వతీపురం మండలం వెంకంపేట గోలీల నుంచి శివుని గ్రామం వరకు బైపాస్ రహదారి నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. దీంతో పట్టణవాసులు, వాహనదారులు కొన్నాళ్లుగా ట్రాఫిక్ సమస్యతో సతమతమవు తున్నారు. తాజాగా కొత్త ప్రతిపాదనలతో బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం వద్దకు ప్రతిపాదనలు వెళ్లడంతో జిల్లాకేంద్రవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
భూసేకరణ ఇలా..
- పార్వతీపురం నుంచి నర్సిపురం లేదా వెంకంపేట గోలీల నుంచి బైపాస్ రహదారి నిర్మాణం చేపడితే పెద్దగా భూసేకరణ అవసరం ఉండదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకంపేట గోలీల నుంచి చిన్నబొండపల్లి, చొక్కాపువానివలస, కృష్ణపల్లి గంగసాగరం చెరువు వరకు బీటీ రహదారిని ఇప్పటికకే నిర్మించారు. ఈ బీటీ రోడ్డుకు ఇరువైపులా సుమారు 20 ఎకరాల వరకు భూసేకరణ చేసి డబుల్ రోడ్డు నిర్మిస్తే చాలు.
- కృష్ణపల్లి గంగసాగరం నుంచి శివుని వరకు కొత్తగా రహదారి నిర్మించాల్సి ఉంది. శివుని గ్రామం వద్ద ప్రస్తుతం ఉన్న స్టేట్ హైవేకు బైపాస్ రహదారిని కనెక్ట్ చేస్తే వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రభుత్వానికి ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ బైపాస్ రహదారి వల్ల జిల్లా కేంద్రంలో వందలాది మంది వ్యాపారులకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రహదారికి ఇరువైపులా ఎప్పటిలానే వారు వ్యాపారాలు చేసుకోవచ్చు.
మరో ప్రతిపాదన...
- చిలకపాలెం, రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం మీదుగా రాయగడ రోడ్డు వరకు రూ.855 కోట్లతో రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కొంతకాలంగా ఒక ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు కూడా అప్రూవల్ అయ్యింది. కానీ ఈ రహదారి నిర్మిస్తే జిల్లా సరిహద్దుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
- సీతానగరం మండలం లచ్చయ్యపేట నుంచి పార్వతీపురం, రాయగడ రోడ్డు వరకు పెద్ద ఎత్తున భవనాలు తొలగింపుతో పాటు అనేక రహదారి విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. దీనివల్ల అనేక మంది వ్యాపారులు ఉపాధి కోల్పోనున్నారు. ప్రజలు కూడా తమ నివాసాలను కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోడ్డు స్థానంలో బైపాస్ రహదారి నిర్మిస్తే ప్రభుత్వానికి నిధులు ఆదాతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండవనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు
పార్వతీపురంలో రూ.85 కోట్లతో బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అదే విధంగా రూ.855 కోట్లతో చిలకపాలెం నుంచి రాయగడ రోడ్డు వరకు రహదారి నిర్మాణం కోసం మరో ప్రతిపాదన కూడా పంపించాం. డీపీఆర్ ఆమోదం పూర్తయింది. కానీ నిధులు మంజూరు కాలేదు. ఈ రెండు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. సర్కారు ఆదేశాల ప్రకారం రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.
ఎ.అప్పాజీ, జిల్లా ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ శాఖ అధికారి