Share News

Pensions కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:36 AM

Applications Open for New Pensions ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సోమవారం తొలిరోజు జిల్లాలోని పలు ప్రాంతా ల్లోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు స్వర్ణ గ్రామ , వార్డు సచివాల యాలకు చేరుకుని దరఖాస్తులు అందించారు.

 Pensions కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ
గరుగుబిల్లి: గొట్టివలస సచివాలయం వద్ద దరఖాస్తుదారులు ఇలా..

  • అప్లికేషన్లు అందిస్తున్న అర్హులు

  • తొలిరోజు వెంటాడిన సర్వర్‌ సమస్య

  • క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకుల హడావుడి

పార్వతీపురం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సోమవారం తొలిరోజు జిల్లాలోని పలు ప్రాంతా ల్లోని వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు స్వర్ణ గ్రామ , వార్డు సచివాల యాలకు చేరుకుని దరఖాస్తులు అందించారు. ఆధార్‌, రైస్‌ కార్డు, ఆదాయ, సదరం, కుల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ నెల 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, 17 నుంచి 21 వరకు పరిశీలన, 22 నుంచి 24 వరకు ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషననర్ల పరిశీలన, 25, 26 తేదీల్లో నూతన పింఛన్లకు నిధులు ప్రతిపాదన ఉంటుంది. సెర్ప్‌ సీఈవో, సోషల్‌ వెల్ఫేర్‌, తదితర శాఖల అధికారుల పర్యవేక్షణలో పింఛన్ల మంజూరు ఉంటుంది. స్థానిక ఎన్నికల కోడ్‌ రాకముందే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అర్హులకు దశలవారీగా పింఛన్లు అందిం చనున్నారు.

మొదటిరోజు సర్వర్‌ ఇబ్బందులు...

సామాజిక పింఛన్లు మంజూరు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవడంతో తొలిరోజు జిల్లాలో పలుచోట్ల సర్వర్‌ సమస్య తలెత్తింది. దీంతో ఆన్‌లైన్‌ ప్రక్రియ ఇబ్బందిగా మారింది. సాలూరులో 6, 7 స్వర్ణవార్డు సచివాలయాలకు 12 దరఖాస్తులు రాగా అందులో మూడు మాత్రమే ఆన్‌లైన్‌ అయ్యాయి. కురుపాం 1,2 సచివాలయాలకు 40 దరఖాస్తులు రాగా.. 20 వరకు ఆన్‌లైన్‌ అయినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. కాగా దరఖాస్తుల స్వీకరణకు వారం రోజులే గడువు ఉండడంతో మరోవైపు అర్హులు పెద్దఎత్తున సచివాలయాలకు తరలివస్తున్నారు. సుమారు మూడేళ్లగా పింఛన్ల కోసం నిరీక్షిస్తున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు ఎంతో ఉత్సాహంగా కదిలారు. పాచిపెంటలోని స్వర్ణ గ్రామ 1,2 సచివాలయాలకు మొదటిరోజే 42 దరఖాస్తులు వచ్చాయి. అందులో 16 వితంతు , 22 వృద్ధాప్య పింఛన్లు కోసం దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీ నాయకులు హడావుడి మొదలైంది. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దరఖాస్తుదారులను నేరుగా సచివాలయాలకు తీసుకెళ్తున్నారు. మరి కొందరు అర్హులతో దగ్గరుండి దరఖాస్తు చేయిస్తున్నారు. మొత్తంగా క్షేత్రస్థాయిలో ఆశావహుల సందడి కనిపిస్తుంది.

Updated Date - Sep 08 , 2026 | 12:36 AM