Share News

‘యాప్‌’సోపాలు

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:48 AM

జిల్లాలోని ఉపాధి వేతనదారులకు ఎంఎంఎస్‌ (మొబైల్‌ మోనటరింగ్‌ సిస్టం) ఫేస్‌ యాప్‌ బాధలు ఎక్కువయ్యాయి.

‘యాప్‌’సోపాలు
ఫేస్‌ యాప్‌లో హాజరు పడకపోవడంతో ఉపాధి పని ప్రదేశంలో ఖాళీగా కూర్చున్న తుంబలి గిరిజనులు

-ఎంఎంఎస్‌ ఫేస్‌ యాప్‌తో ఉపాధి వేతనదారుల పాట్లు

- సిగ్నల్స్‌ అందకపోవడంతో కష్టాలు

- హాజరు కోసం ఎండలో గంటల కొద్దీ నిరీక్షణ

- తగ్గుతున్న వేతనదారుల సంఖ్య

గరుగుబిల్లి/సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఉపాధి వేతనదారులకు ఎంఎంఎస్‌ (మొబైల్‌ మోనటరింగ్‌ సిస్టం) ఫేస్‌ యాప్‌ బాధలు ఎక్కువయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి వేతనదారుల కోసం నూతనంగా ఎంఎంఎస్‌ ఫేస్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఉపాధి పనులు ప్రారంభ సమయానికి ముందు వేతనదారులు పనిచేసే ప్రదేశం నుంచి ఎంఎంఎస్‌ ఫేస్‌ యాప్‌లో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంది. అయితే, కొన్నిచోట్ల సిగ్నల్స్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడం, మరికొన్ని చోట్ల సిగ్నల్స్‌ ఉన్నప్పటికీ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వేతనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ యాప్‌లో ఫేస్‌ రికగ్నజేషన్‌ అయితేనే ఆ రోజు మస్తరు పడుతుంది. లేదంటే పనికి రానట్లే లెక్క. ఒకవైపు అధికంగా ఎండలు, మరోవైపు ముఖ హాజరు యాప్‌ సమస్య నెలకొనడంతో వేతనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 15 మండలాల పరిధిలోని 450 పంచాయతీల్లో నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల ఒకటో తేదీన పనులు ప్రారంభమయ్యాయి. అయితే పనుల్లో పాల్గొనేందుకు వేతనదారులు ఉత్సాహం చూపిస్తున్నా నిబంధనల కారణంగా హాజరు శాతం తగ్గుముఖం పడుతుంది. ప్రస్తుతం గ్రామాల్లో ఒకవైపు అధికంగా ఎండలు, మరోవైపు ముఖ హాజరు యాప్‌ సమస్య నెలకొంది. అధికారులు నిర్ణయించిన సమయానికి పని ప్రాంతానికి వేతనదారులు వెళ్లినా ముఖ హాజరుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. ఒక వేతనదారునికి ముఖ హాజరు వేసేందుకు గంట సమయం పడుతుంది. గతంలో ఉపాధి పథకానికి సంబంధించి వేతనదారుల హాజరు కోసం టీఎల్‌ఎస్‌ సర్వర్‌ను ఏర్పాటు చేశారు. దీనివల్ల ఇబ్బందులు ఉండేవి కావు. అయితే, గతంలో వేతనదారులు పనికి హాజరుకాకుండానే మస్తర్లు వేయడం వంటివి జరిగేవి. ఈ అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంఎంఎస్‌ యాప్‌లో ముఖ హాజరును ప్రవేశపెట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో 450 పంచాయతీల పరిధిలో 2.94 లక్షల మంది పనుల్లో పాల్గొనేవారు. ప్రస్తుతం జిల్లాలో 836 పనులకు గాను యాప్‌ హాజరుతో 63,786 మంది పనుల్లో పాల్గొంటున్నారు. ప్రతి మండలంలో రోజుకు పది వేల మందికి పైగా వేతనదారులు పనుల్లో పాల్గొవాలని ఆదేశాలు జారీ చేసినా యాప్‌ సమస్యతో లక్ష్యాలు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ హాజరు కాకుంటే వేతనదారులు విధిగా ఈకేవైసీ చేసుకోవలసి ఉంది. రోజుకు రెండు వేలకు పైగా వేతనదారులు ముఖ హాజరు పడకపోవడంతో ఈకేవైసీ చేసుకునేందుకు పరుగులు తీస్తున్నారు. నూతన యాప్‌తో ముఖ హాజరు ఉంటేనే వేతనదారునికి చెల్లింపులు జరిగే పరిస్థితి ఉంది. హాజరు లేకుంటే పనుల్లో పాల్గొన్నా వేతనం అందే పరిస్థితి లేదు. మొత్తంపై జిల్లాలో ఉపాధి వేతనదారులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు.

సీతంపేట ఏజెన్సీలో..

సీతంపేట ఏజెన్సీలోని దేవనాపురం, తుంబలి తదితర పంచా యతీల్లో ఈ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వేతన దారులు ఉపాధి పథకం మేట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా 53 పంచాయతీలో కూడా ఈసమస్య వెంటాడుతోంది. ఏజెన్సీలో మొత్తంగా 512 గిరిజన గ్రామాల పరిధిలో సుమారు 15వేల పైచీలుకు వేతనదారులు ఉపాధిపనులు చేస్తున్నారు. వీరందరూ ఎంఎంఎస్‌ సిస్టంలో భాగంగా ఫేస్‌యాప్‌ నమోదు చేసుకొని ఉపాధి పనులు చేయాల్సి ఉంది. అయితే, మారుమూల గిరిజన గ్రామాల్లో సిగ్నల్‌ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడం, మరికొన్ని చోట్ల సెల్‌సిగ్నల్స్‌ ఉన్నప్పటికీ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉపాధి వేతనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం

ఉపాధి వేతనదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటాం. యాప్‌ సమస్యను ఉన్నతాధికారులకు నివేదించాం. మరొక ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పని ప్రాంతంలో నిబంధనలు సడలించేందుకు చర్యలు చేపడుతున్నాం. వేసవి దృష్ట్యా వేతనదారులు వడదెబ్బకు గురికాకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.

-పి.త్రివిక్రమరావు, ఏపీడీ, పార్వతీపురం క్లస్టర్‌

Updated Date - Apr 06 , 2026 | 12:48 AM