Share News

వలసలపై వైసీపీలో గుబులు

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:28 AM

జడ్పీ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)ను అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకునిగా అధిష్ఠానం నియమించింది.

వలసలపై వైసీపీలో గుబులు

- టీడీపీ అరకు పార్లమెంట్‌ పరిశీలకుడిగా చిన్న శ్రీను నియామకం

- ఆయన టచ్‌లోకి వెళ్లిన పలువురు వైసీపీ నేతలు

- ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం

పార్వతీపురం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): జడ్పీ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను)ను అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకునిగా అధిష్ఠానం నియమించింది. పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా భౌగోళికంగా ఈ పార్లమెంట్‌ పరిధిలోకి వస్తుంది. చిన్న శ్రీనుకు ఈ పార్లమెంట్‌ బాధ్యతలను అప్పగించడంతో జిల్లాలో వైసీపీకి వలసల భయం పట్టుకుంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు చిన్న శ్రీను అనుచరులుగా గుర్తింపు పొందారు. వీరిలో చాలామంది ఆయన టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. చిన్న శ్రీనుతోనే తమకు గుర్తింపు వచ్చిందని, ఆయన అడుగు జాడల్లోనే నడుస్తామని వారు బాహటంగా చెబుతున్నట్లు సమాచారం. చిన్న శ్రీను వద్ద హామీ తీసుకుంటే అది నెరవేరుతుందనే ఆశతో పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికలకు ముందు, ఏ క్షణంలోనైనా వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. తొలుత జిల్లా కేంద్రం పార్వతీపురం నుంచి ఈ వలసలు ఉంటాయని సమాచారం.

Updated Date - Oct 12 , 2026 | 12:28 AM