బొబ్బిలి వీణకు మరో అరుదైన గుర్తింపు
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:30 PM
చారిత్రాత్మకమైన బొబ్బిలి వీణకు మరో అరుదైన గుర్తింపు లభించింది.
- క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ ఐడెంటిటీ
- ఇక తెర మీదకు అసలైన కళాకారుల నైపుణ్యం
బొబ్బిలి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): చారిత్రాత్మకమైన బొబ్బిలి వీణకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రఽధానమంత్రి నరేంద్రమోదీకి ఏకండీ పనస కలపతో తయారు చేసిన సంగీత బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహూకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో ఏపీ హస్తకళలపై క్యూఆర్ కోడ్‌ను పొందుపరచాలని నిర్ణయించడం, అందులో బొబ్బిలి వీణకు మొదటి స్థానం దక్కడం విశేషం.
సమగ్ర సమాచారం..
బొబ్బిలి వీణ ఓ కళాఖండంలా అందరూ గౌరవిస్తారు. బొబ్బిలి, బాడంగి మండలం వాడాడ గ్రామాలకు చెందిన కళాకారులు తయారు చేసే ఈ వీణల గురించి సమగ్రంగా తెలుసుకునే విధంగా ఈ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాని విశిష్టత, సాంస్కృతిక చరిత్ర, తయారు చేసిన కళాకారుని పేరు, అతని కళానైపుణ్యం, ఏ ముడిసరుకుతో తయారు చేశారు వంటి వివరాలను కొనుగోలుదారులు సులభంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌లో స్కానింగ్ చేయగానే ఆ కళా ఉత్పత్తికి సంబంధించిన సమగ్ర సమాచారం అంతా అందులో స్పష్టంగా తెలుస్తుంది. బొబ్బిలి వీణతో పాటు కళంకారి పెయింటింగ్స్ అయిన సంపూర్ణ రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణలీల, మత్స్యావతారం, సవర ఆదివాసి పెయింటింగ్స్ సహా మొత్తం 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు క్యూఆర్ కోడ్‌ను అధికారులు కేటాయించడంపై కళాకారులతో పట్టణానికి చెందిన పలువురు సాంస్కృతికాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది..
గతంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్‌క్లింటన్ దగ్గర నుంచి నేడు మన ప్రధాని నరేంద్ర మోదీ వరకూ మనసును దోచుకున్న బొబ్బిలి వీణకు ఏడు సంవత్సరాల కిందట భౌగోళిక గుర్తింపు లభించింది. గత ఏడాది ఒక జిల్లా- ఒక ఉత్పత్తి అనే కాన్సెప్ట్ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. బొబ్బిలి వీణల ప్రాచుర్యానికి స్థానిక రాజవంశీయులు ఎంతో కృషి చేశారు. స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన అసెంబ్లీలో కళాకారుల అవస్థలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వీణలతయారీకి అవసరమైన పనస కలపను వెంటనే మా కేంద్రానికి పంపించారు. ఈ నెలలో ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నాం. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుల గురించి, కళాఖండం నేపథ్యం గురించి ప్రపంచానికి తెలియజేసే విధంగా టెక్నాలజీని అందుబాటులోనికి తేవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రకమైన ప్రోత్సాహం నేటి తరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ కళ అంతరించిపోకుండా అందరూ భాగస్వాములు కావడానికి ఊపిరి పోస్తుంది. మా కళాకారులమంతా చాలా ఆనందంగా ఉన్నాం. గొల్లపల్లిలో ని వీణల కేంద్రానికి కూడా కళాత్మకమైన హంగులను సమకూర్చితే సందర్శకులను మరింతగా ఆకట్టుకుంటుంది.
-సర్వసిద్ధి రామకృష్ణ, బొబ్బిలి వీణల కేంద్రం ఇన్‌చార్జి