Share News

Another month...! మరో నెల...!

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:08 AM

Another month...! కూటమి ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ భూములపై విధించిన నిషేధం ఇకపైనా కొనసాగనుంది. భూపరిపాలన శాఖ (సీసీఎల్‌ఏ) ఎప్పటికప్పుడే నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.

Another month...!  మరో నెల...!
వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో యాజమాన్య హక్కు (ఫ్రీహోల్డ్‌) పొందిన అసైన్డ్‌ భూమి

మరో నెల...!

కొనసాగుతున్న ఫ్రీహోల్డ్‌ భూముల నిషేధం

ఏటూ తేల్చని మంత్రివర్గ ఉప సంఘం

రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రైతుల్లో నిరాశ

జిల్లాలో 7490.62 ఎకరాలకు శాశ్వత భూ హక్కు

దుర్వినియోగమైన భూముల వివరాలపై స్పష్టత కరువు

కూటమి ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ భూములపై విధించిన నిషేధం ఇకపైనా కొనసాగనుంది. భూపరిపాలన శాఖ (సీసీఎల్‌ఏ) ఎప్పటికప్పుడే నిషేధాన్ని పొడిగిస్తూ వస్తోంది. తాజాగా మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామంతో నిజమైన భూహక్కులు కలిగిన రైతులు నిరాశ చెందుతున్నారు.మరోవైపు దొడ్డిదారిన ఫ్రీహోల్డ్‌ భూములు పొందిన యజమానులు, సహరించిన అధికారులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. ఫ్రీహోల్డ్‌ ద్వారా దుర్వినియోగమైన భూముల వివరాలపైనా ప్రభుత్వానికి స్పష్టత రాలేదు.

కొండగంగుబూడిలో అదే జరిగింది...

వేపాడ మండలం కొండగంగుబూడి గ్రామంలో వైసీపీ ప్రభుత్వం 224.95 ఎకరాల అసైన్డ్‌ భూములను ఫ్రీహోల్డ్‌ చేసింది. భూ హక్కులు కల్పించాక నెల రోజులు తిరక్కముందే శృంగవరపుకోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 100.55 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ అయింది. ఆ గ్రామంలో అసైన్డ్‌ భూములు వందలాది ఎకరాలను దశాబ్దం క్రితమే నగరాల్లో నివాసం ఉంటున్న వ్యక్తులు కొనుగోలు చేశారు. మామిడి, జీడిమామిడి, టేకు వంటి తోటలను పెంచుతూ భూములను అమ్మిన రైతులనే కాపలా పెట్టుకున్నారు. కాగా అప్పట్లో పని చేసిన ఓ మండల స్థాయి అధికారి వైసీపీ ప్రజాప్రతినిధుల సహకారంతో పీఓటీ భూములు ఫ్రీహోల్డ్‌ జరిగేలా చేశారు. రైతుల పేరున భూయాజమాన్య హక్కులు రాగానే అంతకు ముందే కొనుగోలు చేసిన యజమానులకు రిజిస్ర్టేషన్‌ జరిగేలా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చక్రం తిప్పారు. ఇదంతా గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫ్రీహోల్డ్‌ భూములపై విచారణకు ఆదేశించింది.

శృంగవరపుకోట, మార్చి 12(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో 7490.62 ఎకరాల అసైన్డ్‌ భూములకు శాశ్వత భూ హక్కులను (ఫ్రీహోల్డ్‌) కల్పించారు. ఇందులో రామభద్రపురం మండలంలో 33.88 ఎకరాలు, దత్తిరాజేరులో 0.36 ఎకరాలు, గజపతినగరంలో 6.11 ఎకరాలు, మెరకముడిదాంలో ఎకరం, భోగాపురంలో 19.6 ఎకరాలు, డెంకాడలో 5.1 ఎకరాలు, విజయనగరంలో 11.56 ఎకరాలు, గంట్యాడలో 1.25 ఎకరాలు, వేపాడలో 100.55 ఎకరాలు కలిపి మొత్తం 179.41 ఎకరాల్లో రిజిస్ర్టేషన్‌ కానిచ్చారు. ఈ భూముల్లో రిజిస్ట్రేషన్‌ జరిగిన మరుక్షణమే రెవెన్యూ అధికారులు వెబ్‌ల్యాండ్‌లోనూ నమోదు చేసేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ తంతు అప్పట్లోనే పలు అనుమానాలకు తావిచ్చింది. అప్పటి ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకుల సహకారంతో రెవెన్యూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్‌ భూములకు శాశ్వత భూహక్కులు కల్పించారని తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భావించింది.

ఫ్రీహోల్డ్‌ నిషేధానికి ముందు...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీహోల్డ్‌ భూములపై విచారణకు దిగింది. ఈ భూముల లెక్క తేల్చేందుకు సిద్ధపడింది. ఓ జిల్లా కలెక్టర్‌తో ఫ్రీహోల్డ్‌ భూముల వివరాలు సేకరిస్తూనే మరో పక్క రిజిస్ట్రేషన్‌లు జరిగిన ఫ్రీహోల్డ్‌ భూముల వివరాలను కూడా పరిశీలిస్తోంది. 2024 ఆగస్టులో అప్పటి భూపరిపాలన, రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా జిల్లాల వారీగా ఈ భూముల వివరాలను పరిశీలించారు. విజయనగరం జిల్లాకు ఆగస్టు 16న వచ్చారు. జిల్లాలో అత్యధికంగా ఫ్రీహోల్డ్‌ భూముల్లో రిజిస్ట్రేషన్‌ జరిగిన శృంగవరపుకోట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ రికార్డులను పరిశీలించారు. అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌పైనా చర్యలు తీసుకున్నారు. దీంతో ఫ్రీహోల్డ్‌లో భూములపై అక్రమాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులపై చర్యలు ఉంటాయని ప్రచారం జరిగింది. ఆ భూములపై ఎలాంటి క్రయవిక్రయాలు జరగకుండా నిషేధం అయితే విధించింది.

చిక్కరు.. దొరకరు

జిల్లాలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులంతా వైసీపీ ప్రభుత్వంలో పని చేసినవారు. కాకపోతే మండలాలు మారారంతే. అప్పట్లో ఇక్కడొకరు తప్పు చేస్తే అక్కడొకరు చేశారు. ఒకరికి ఒకరు సహకరించుకొనేందుకు పంపించిన నివేదికలనే అటు ఇటూ మార్చి పంపిస్తుండడంతో లెక్క తేలడం లేదు. దీనికోసం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం కూడా ప్రభుత్వానికి స్పష్టంగా ఏమీ చెప్పలేకపోతోంది. ఫ్రీహోల్డ్‌పై నిషేధం సాగుతుండడంతో అసైన్డ్‌ భూముల్లో న్యాయంగా శాశ్వత భూహక్కులు పొందిన చిన్న, సన్నకార రైతులు క్రయ, విక్రయాలు చేసుకోలేకపోతున్నారు. రెవెన్యూ అధికారుల తీరుతో ప్రస్తుతానికి వీరికి నష్టం జరుగుతోంది.

కొత్త ప్రచారం

ఫ్రీహోల్డ్‌లో ఎటువంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల ప్రకారం నడుచుకోవడంతో ప్రభుత్వం జరిపిన విచారణలో తప్పులు పట్టుకోలేకపోతున్నారని పలువురు రెవెన్యూ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఫ్రీహోల్డ్‌కు అవకాశం ఇస్తుందని చెబుతుండడంతో ఇరవై ఏళ్లక్రితం రైతులు పొందిన అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసేందుకు ఎగబాకుతున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ఈ దందా నడుస్తోంది. తక్కవ ధరకు భూములను కొనుగోలు చేస్తున్నారు. ఫ్రీహోల్డ్‌ తరువాత రిజిస్ట్రేషన్‌ చేసేలా అనధికార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:08 AM