Share News

Another extension? మరోసారి పొడిగింపు?

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:11 AM

Another extension? గొర్రెల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘ ఎన్నికలకు గడువు సమీపించింది. అయితే ఈసారి కూడా పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించే అవకాశం కనిపిస్తోంది.

Another extension? మరోసారి పొడిగింపు?
గొర్రెల పెంపకందారుల సహకార సంఘ కార్యాలయం

మరోసారి పొడిగింపు?

గొర్రెల పెంపకదారుల సహకార సంఘాలకు మళ్లీ పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించే అవకాశం

మరోవైపు ఎన్నికలపైనా ప్రభుత్వం దృష్టి

ప్రణాళిక రూపొందిస్తున్న పశుసంవర్థక శాఖ

విజయనగరం రూరల్‌, జనవరి 20 (ఆంరఽధజ్యోతి): గొర్రెల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘ ఎన్నికలకు గడువు సమీపించింది. అయితే ఈసారి కూడా పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో అతి త్వరలో ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. పర్సన్‌ ఇన్‌చార్జిల నియామకానికి ఆదేశాలిస్తూనే ఎన్నికల ఏర్పాట్లు చేయాలని అధికారులకు నిర్దేశించినట్లు సమాచారం.

గొర్రెల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాలకు పర్సన్‌ ఇన్‌చార్జిలుగా ప్రస్తుతం పశు సంవర్థక శాఖ సిబ్బంది వ్యవహరిస్తున్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లాలో 34 మండలాలు ఉండగా 120 సంఘాలు క్రియాశీలకంగా ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 87 సంఘాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 33 సంఘాలు నడుస్తున్నాయి. వీటన్నింటికీ పర్సన్‌ ఇన్‌చార్జులు ఉన్నారు. సహకార సంఘ ఎన్నికలు గత ఏడాది జరగాల్సి ఉండగా రెండు పర్యాయాలు (ఆరు నెలల చొప్పున ) పర్సన్‌ ఇన్‌చార్జుల వ్యవస్థను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గత ఏడాది జూలై 23, 2025న పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించింది. వారి పదవీ గడువు 2026 జనవరి 22తో ముగుస్తోంది. ఇదిలా ఉండగా వివిధ కారణాల వల్ల ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించలేమని, మరో ఆరు నెలలు గడువు కావాలని పశు సంవర్థకశాఖాధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో పర్సన్‌ ఇన్‌చార్జిల పాలనను మరో పర్యాయం పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 21న ఉత్తర్వులు విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఆ ప్రకారం 2026 జనవరి 22నుంచి జూన్‌ 22 వరకు పర్సన్‌ ఇన్‌చార్జిల పాలన గడువును పొడిగించవచ్చు.

- పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించినా కూడా అతి త్వరలో ఎన్నికలు జరిపేందుకు పశుసంవర్థక శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 120 సహకార సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం వీటి సభ్యులంతా కలిసి గొర్రెల పెంపకం దారుల జిల్లా సహకార సంఘానికి అధ్యక్ష, ఉపాఽధ్యక్షులు, మెంబర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 120 సహకార సంఘాల అధ్యక్షులు చేతులేత్తే పద్ధతిలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు తొమ్మిది మంది మెంబర్లను ఎన్నుకుంటారు.

ప్రతిష్ఠాత్మకంగా పాలకవర్గం ఎన్నిక

గొర్రెల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారే అవకాశం ఉంది. పార్టీలతో సంబంధం లేక పోయినా పార్టీ మద్దతుదారులే జిల్లాస్థాయి సహకార సంఘానికి చైర్మన్‌ అవుతారు. గత పాలకవర్గం అధ్యక్షుడిగా వున్న మన్యాల కృష్ణ టీడీపీలో వుండేవారు. 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో ఆయన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవ్వడంతో అధ్యక్షుడిగా వున్న మన్యాల కృష్ణ కూడా వైసీపీ కండువా వేసుకుని 2024 వరకూ అధ్యక్షుడిగా కొనసాగారు.

- ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ మద్దతుదారుడే ఉండాలన్న అభిప్రాయంతో టీడీపీ ఉంది. దీనిపై ఇప్పటికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ టీడీపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిమిడి నాగార్జున, ప్రసాదుల ప్రసాద్‌కు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. మత్స్యసహకార సంఘ ఎన్నికల్లో ఏ విధంగా అయితే టీడీపీ సానుభూతి పరులు విజయం సాధించారో? గొర్రెల పెంపకందారుల సహకార సంఘ ఎన్నికల్లో టీడీపీ వారే విజయం సాధించాలని మంత్రి పట్టుదలతో ఉన్నారు. ఈ పదవి కోసం ఇప్పటికే విజయనగరం నియోజకవర్గ పరిధిలో ఒకరిద్దరు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుని కోరుతున్నారు. దీనిపై ఆమె ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఏదేమైనా నెలఖరులోగా దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Jan 21 , 2026 | 12:11 AM