Annavaram జలదిగ్బంధంలో అన్నవరం
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:25 AM
Annavaram Under Water తీవ్ర వాయుగుండం తీరం దాటినా.. ఒడిశాలో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు జిల్లాలో నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోత వానలకు వాగులు, గెడ్డలు, సెలయేర్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక జిల్లాలో నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీతీర గ్రామాల ప్రజలు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. తోటపల్లి, మడ్డువలస, ఒట్టిగెడ్డ తదితర ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరదనీటితో పాటు పలు గెడ్డలు, వాగుల నుంచి నీరు నాగావళిలోకి చేరుతుండడంతో పలు నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పాలకొండ మండలంలో గోపాలపురం, అంపిలి, అన్నవరం గ్రామాల్లోకి భారీగా వరద చేరింది. ఉదయం 8 గంటలకే అన్నవరం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆ గ్రామస్థులు ముంపు నీటిలో తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న నాగావళి
చిగురుటాకుల్లా వణుకుతున్న నదీతీర గ్రామాలు
యుద్ద ప్రాతిపదికన యంత్రాంగం సహాయ చర్యలు
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
పాలకొండ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం తీరం దాటినా.. ఒడిశాలో ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు జిల్లాలో నాలుగు రోజుల పాటు కురిసిన కుండపోత వానలకు వాగులు, గెడ్డలు, సెలయేర్లు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక జిల్లాలో నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదీతీర గ్రామాల ప్రజలు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. తోటపల్లి, మడ్డువలస, ఒట్టిగెడ్డ తదితర ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరదనీటితో పాటు పలు గెడ్డలు, వాగుల నుంచి నీరు నాగావళిలోకి చేరుతుండడంతో పలు నదీతీర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పాలకొండ మండలంలో గోపాలపురం, అంపిలి, అన్నవరం గ్రామాల్లోకి భారీగా వరద చేరింది. ఉదయం 8 గంటలకే అన్నవరం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆ గ్రామస్థులు ముంపు నీటిలో తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి. సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ , డీఎస్పీ రాంబాబు, అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ ప్రత్యేక బోట్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గ్రామస్థులకు ధైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా చర్యలు చేపట్టారు. వరద ఉధృతిపై ఆరా తీస్తూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టారు. అన్నవరం గ్రామస్థులకు ఆహార పొట్లాలు సరఫరా చేయించారు. వడమ, అంపిలి, గోపాలపురంలోని వరద పరిస్థితిని ప్రజలకు తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకునేలా యం త్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గోపాలపురం, మంగళాపురం మధ్య పాలకొండ, రాజాం ప్రధాన రహదారిలో వరదనీరు అధికంగా ప్రవహించడంతో ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వరద కాస్త తగ్గడంతో ఉదయం 11 గంటల తర్వాత వాహనాలను యథావిధంగా అనుమతి ఇచ్చారు.
గర్భిణీని సురక్షితంగా చేర్చిన బృందాలు..
జలదిగ్బంధంలో చిక్కుకున్న అన్నవరం గ్రామానికి చెందిన 9 నెలల గర్భిణి భూమికను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సబ్ కలెక్టర్, డీఎస్పీలు ఆమె ఇంటికి చేరుకొని ఎన్‌డీఆర్‌ఎఫ్ బోటు ద్వారా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ఆమెను వడమ వరకు బోటులో తరలించి అక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన డయాలసిస్ రోగిని ఆసుపత్రికి తరలించారు.
పాలకొండ చుట్టూ వరదనీరు...
ఓనిగెడ్డ, జంపరకోటగెడ్డ, జంపర కోటగెడ్డ, రావాడగెడ్డ ఉప్పొంగి ప్రవహించాయి. గోపాలపురం వద్ద నాగావళి నదికి వరద పోటెత్తింది. దీంతో అన్నవరం, గోపాలపురం, అంపిలి తదితర గ్రామాలతో పాటు పాలకొండలోని కొండవీధి, నాగవంశపువీధి, వెంకటరమణ కాలనీ, వడమ, కొండాపురం గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. పట్టణంలోని వెంకటరమణ కాలనీలోని వరదలో చిక్కుకున్న స్థానికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 20 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదలు తగ్గేంతవరకు ఆ ఇళ్లకు చేరుకోవద్దని అధికారులు సూచించారు.
వరదనీటిలోనే పంటపొలాలు...
నదులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహించడంతో పంట పొలాలను వరదనీరు వీడడంలేదు. మరో నాలుగు రోజుల పాటు నీరు ఇలానే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతుండడంతో పంట కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు చెబతుఉన్నారు. కాగా ఒక్క పాలకొండ మండ లంలోని సుమారు వెయ్యి ఎకరాల వరకు పంట పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది.
ముంపులో బాసంగి
జియ్యమ్మవలస, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు నిర్వాసిత గ్రామం బాసంగి ముంపునకు గురైంది. శుక్రవారం వేకువ జామునకు గ్రామం వద్ద పాఠశాలతో పాటు లోతట్టు ప్రాంతంలో ఉన్న వీధులు జలమయమయ్యాయి. తోటపల్లి బ్యారేజీ నీటి పారుదలశాఖ అధికారులు ముందు జాగ్రత్తగా నీటిని దిగువకు విడిచిపెట్టడమే ఇందుకు కారణం. అయితే గురువారం రాత్రి నుంచే తహసీల్దార్ సాయికామేశ్వరరావు, ఎంపీడీవో హరిప్రసాద్, సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ ఎ.నీలకంఠరావు తదితరులు గ్రామంలోనే ఉండి ప్రజలను అప్రమత్తం చేయడంతో పెను ముప్పు తప్పింది. ఇదిలా ఉండగా వట్టిగెడ్డ రిజర్వాయర్ స్పిల్‌వే ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల కాజ్‌వే పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో టీకే జమ్ము, పీటీ మండ, కొండచిలకాం, అలమండ పంచాయతీలో ఉన్న 30 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ కాజ్‌వే వద్ద మినీ వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు.
వరదనీటిలో గ్రామాలు
కొమరాడ, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): నాగావళికి వరద పోటెత్తుతుండడంతో కోటిపాం, కళ్లికోట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మాదలింగి వద్ద గుమ్మడిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో ఎనిమిది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కళ్లికోట గ్రామంలో క్యాబేజీ పంట నీటమునిగింది. అరటి పంట నేలకొరిగింది. మండలంలోని 8 పంచాయతీల్లో సుమారు 80 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ఏడీఏ ఆర్.అన్నపూర్ణ తెలిపారు. మరోవైపు గుంపలోని సోమేశ్వరస్వామి ఆలయం కూడా నీట మునిగింది. దీంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. శు క్రవారం జిల్లా దేవాదాయశాఖ అధికారి ఎస్.రాజారావు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు భక్తులు నదివైపు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, స్థానికులకు సూచనలు జారీ చేశారు. నదివైపు వెళ్లరాదన్నారు.
సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ను పరిశీలించిన మంత్రి
సాలూరు, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు సాలూరు పట్టణంలో నీట మునిగిపోయిన ఆర్టీసీ కాంప్లెక్స్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం పరిశీలించారు. ప్రయాణికు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాయుగుండం కారణంగా నియోజకవర్గంలో రోడ్లు, చెరువులు, పంట పొలాలు, నివాహ గృహాల పరిస్థితిపై ఆరా తీశారు. పెదపదం పంచాయతీ నీలం చెరువు, దెబ్బతిన్న నెలిపర్తి - విశ్వనాథపురం రహదారి, చిట్టిగెడ్డ కల్వర్టు, పాడైన వేటగానివలస రహదారి పనులను వెంటనే చేయాలని ఆదేశించారు.