Sankanti nature in farmer family అన్నదాత మోములో సంర‘కాంతి’
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:59 PM
Annadata Momulo San Raakanti జిల్లా అంతటా రైతుల్లో సంతోషం కన్పిస్తోంది. సంక్రాంతి ముందే వచ్చిందన్న ఆనందంలో వారంతా ఉన్నారు. ధాన్యం బిల్లులు వెంటవెంటనే అందుకోవడం వారికి చాలా ఊరటనిచ్చింది. పంటను ఇంటికి చేర్చడానికి పడిన కష్టాలన్నీ మర్చిపోయి కుటుంబమంతా సంబరపడుతున్నారు.
అన్నదాత మోములో సంర‘కాంతి’
ధాన్యం అమ్మిన వెంటనే బిల్లుల జమపై హర్షం
జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది రైతులకు రూ.700 కోట్లు విడుదల
ట్రక్ షీట్ జనరేట్ అయిన 24 గంటల్లో బిల్లులు
గంట్యాడ, జనవరి 8(ఆంధ్రజ్యోతి):
- గంట్యాడకు చెందిన రైతు ఎస్.శ్రీను నాలుగు రోజులు క్రితం కొటారుబిల్లిలో ఉన్న రైసు మిల్లుకు 320 బస్తాల ధాన్యం పంపించారు. మిల్లు యజమాని ట్రక్ షీట్ జనరేట్ చేసిన రోజునే ఆ రైతు బ్యాంకు ఖాతాకు ధాన్యం డబ్బులు జమయ్యాయి.
- గంట్యాడ మండలం వసంత గ్రామానికి చెందిన రైతు అప్పలనాయుడు తాను పండించిన ధాన్యాన్ని ఆర్‌ఎస్‌కే ద్వారా రావివలసకు పంపించారు. మిల్లులో ట్రక్ షీట్ జనరేట్ చేసిన 24 గంటల్లో బిల్లులు రైతు బ్యాంకు ఖాతాకు జమయ్యాయి. దీంతో సంక్రాంతి పండగ ఖర్చులు ముందుగా వచ్చాయని ఆ రైతు సంబరపడుతున్నాడు.
జిల్లా అంతటా రైతుల్లో సంతోషం కన్పిస్తోంది. సంక్రాంతి ముందే వచ్చిందన్న ఆనందంలో వారంతా ఉన్నారు. ధాన్యం బిల్లులు వెంటవెంటనే అందుకోవడం వారికి చాలా ఊరటనిచ్చింది. పంటను ఇంటికి చేర్చడానికి పడిన కష్టాలన్నీ మర్చిపోయి కుటుంబమంతా సంబరపడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు అనుకూలించడతో వరి పంట అనుకూలంగా పండింది. దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియను నవంబరు నెలలోనే మొదలు పెట్టింది. రైతులు కూడా ఈ సారి ఎక్కువ మంది యంత్రాలతో నూర్పులు చేపట్టారు. ఆపై ధాన్యాన్ని రైతు సేవ కేంద్రాలకు తీసుకువెళ్లి త్వరగా విక్రయించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షలు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ 70,559 మంది రైతుల నుంచి 3,47,000 టన్నుల ధాన్యం సేకరించారు. 69,570 మంది రైతులకు రూ.705 కోట్లు అందజేశారు. మిల్లులో ట్రక్ షీట్ జనరేట్ చేశాక 4 గంటలు నుంచి 24 గంటలలోపు రైతు బ్యాంకు ఖాతాకు డబ్బులు జమయ్యాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి బిల్లులు మంజూరు కావడంతో రైతుల్లో పండగ జోష్ కనిపిస్తోంది.