రెచ్చిపోతున్న ఆకతాయిలు!
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:12 AM
జిల్లాలో కొన్నిచోట్ల ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. విద్యార్థినులను, ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు.
- కళాశాలలు, హాస్టళ్ల వద్ద అటకాయించి..
- విద్యార్థినులు, మహిళలకు వేధింపులు
- జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి
- అలాంటిదేమీ లేదంటున్న పోలీస్‌శాఖ
-బొబ్బిలి ఘటనలో పోలీసుల తీరుపై విమర్శలు
- రెండు రోజుల తర్వాత కేసు నమోదు
విజయనగరం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొన్నిచోట్ల ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. విద్యార్థినులను, ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, రీడింగ్ రూమ్‌ల వద్ద విద్యార్థినులను అటకాయించి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీంతో విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లా విశాఖకు సరిహద్దులో ఉండడంతో ఎడ్యుకేషనల్ హబ్‌గా మారింది. భోగాపురం, విజయనగరం, రాజాం పరిధిలో పేరుమోసిన ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఉత్తరాంధ్ర నుంచి వేలాది మంది విద్యార్థినులు, యువత వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. కొందరు హాస్టళ్లలో, మరికొందరు ఇళ్లను అద్దెకు తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అయితే, చాలాచోట్ల ఆకతాయిల బెడద ఎక్కువైంది. బస్సుల్లో, బస్టాండ్లలో, కాలేజీలు, హాస్టళ్ల ప్రాంగణాల వద్ద విద్యార్థినులు, మహిళలను ఆకతాయి యువకులు వేధిస్తున్నారు. కొన్నిచోట్ల ర్యాగింగ్ సైతం జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లాలో ఆకతాయిల బెడద, ఈవ్‌టీజింగ్, వేధింపులు లేవని పోలీస్ అధికారులు చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది.
కొన్ని ఘటనలు..
- బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లిలో ఇటీవల విద్యార్థినులపై ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై విద్యార్థినులు టోల్‌ఫ్రీ నంబర్ 112కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. ఆకతాయిల్లో అధికార పార్టీకి చెందిన నాయకుల పిల్లలు ఉండడంతో ఘటన జరిగిన రోజున కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనక్కి తగ్గారనే విమర్శలు ఉన్నాయి. ఓ ఆకతాయికి చెందిన తండ్రి కళశాల సిబ్బందిపై రంకిలేశారు. మా పిల్లలపై ఎవరు కేసు నమోదు చేస్తారో చూస్తామని హూంకరించారు. దీంతో కళాశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆకతాయలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తరువాత రోజున పత్రికలు, సోషల్ మీడియాలో వార్తలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే కేసు నమోదు చేయకపోవడం పట్ల పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- బొబ్బిలి పట్టణంలో ఎన్నో పేరుమోసిన విద్యాసంస్థలు ఉన్నాయి. బీటెక్ మాత్రమే కాకుండా అన్నిరకాల సాంకేతిక విద్య అందించే విద్యాసంస్థలు ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉంటున్నారు. సాయంత్రమైతే చాలు ఆకతాయిలు బైక్‌లతో నానా రచ్చ చేస్తున్నారు. తోటి ప్రయాణికులు, వాహనదారులకు అసౌకర్యానికి గురిచేస్తున్నారు. ఇక గంజాయి మత్తు కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. బొబ్బిలిలో గంజాయితో ఇటీవల 11 మంది పట్టుబడ్డారు. అందులో ఒక మైనర్ ఉండడం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. విద్యార్థులకు విక్రయించేందుకే గంజాయిని తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- రాజాం పట్టణంలో సైతం పేరుమోసిన ఇంజనీరింగ్ కాలేజీతో పాటు విద్యాసంస్థలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. విద్యార్థినులను ఆకతాయిల వేధించడం, ప్రేమ పేరిట వారి వెంటపడడం జరుగుతున్నాయి. గంజాయి మత్తులో నడిరోడ్లపై యువత కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
- గతంలో విద్యాసంస్థల్లో ఈవ్‌టీజింగ్, వేధింపులు అధికంగా ఉండేవి. ఇప్పుడు విద్యాసంస్థల్లో తగ్గుముఖం పట్టగా, బయట ప్రాంతాల్లో పెరిగింది. పోలీసులు మాత్రం జిల్లాలో ఆకతాయిల బెడద లేదని చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది. కోమటిపల్లి ఘటనలో బాధిత విద్యార్థినులు నేరుగా టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం అర్థిస్తే, పోలీసులు మాత్రం ఫిర్యాదు రాలేదని చెబుతుండడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి ఉదాసీనతతో పోలీస్ శాఖకు చెడ్డపేరు వచ్చే అవకాశముంది. ఇప్పటికైనా ఆకతాయిలపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఉంది.
ఆ ఇద్దరిని తప్పించారా?
బొబ్బిలి సమీపంలోని కోమటిపల్లిలో విద్యార్థినులను వేధించిన ఘటనకు సంబంధించి ఆవల మోహనరావు, పెంట వినయ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ కె.నారాయ ణరావు తెలిపారు. అయితే విద్యార్థినులను నలుగురు వ్యక్తులు వేధించినట్లు చెబుతుండగా.. ఇద్దరిని వదిలేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఒకరు కీలకమైన వ్యక్తని తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతోనే ఇలా చేశారా? అని చర్చించుకుంటున్నారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం..
కొమటపల్లిలో విద్యార్థినులను వేధించిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదుచేశాం. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కానీ, సుమోటాగా స్వీకరించి కేసును నమోదు చేశాం. మహిళలు, విద్యార్థినులకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది. ఎక్కడైనా ఆకతాయిలు వేధిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్నెట్ సదుపాయం లేకున్నా యాప్ పనిచేస్తుంది. ఫోన్‌ను రెండు, మూడు సార్లు షేక్‌చేస్తే నేరుగా మీరుఉండే ప్రదేశాన్ని గుర్తిస్తుంది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారు.
-భవ్యరెడ్డి, డీఎస్పీ బొబ్బిలి