Share News

గంజాయిపై ఉక్కుపాదం

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:07 AM

జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పోలీస్‌ శాఖను ఆదేశించారు.

గంజాయిపై ఉక్కుపాదం
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- బెయిల్‌ రాకుండా కేసులు నమోదు చేయండి

- పోలీసులను ఆదేశించిన కలెక్టర్‌

పార్వతీపురం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పోలీస్‌ శాఖను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నివారణకు పోలీస్‌, ఫారెస్ట్‌, ఎక్సైజ్‌శాఖలు జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించాలన్నారు. ‘బస్సులు, రైల్వేస్టేషన్లలో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయాలి. గంజాయి విక్రయించినా, వినియోగించినా బెయిల్‌ రాకుండా బైండోవర్‌ కేసులు నమోదు చేయాలి. విద్యా సంస్థల వద్ద ఉన్న దుకాణాలను తనిఖీ చేయాలి. షాపుల్లో మత్తు పదార్థాలు ఉంటే సీజ్‌ చేయాలి. ప్రతి గ్రామంలో మహిళా పోలీస్‌, అంగన్‌వాడీ కార్యకర్తలతో డ్రగ్స్‌ అనర్థాలపై ర్యాలీలు చేపట్టాలి. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గంజాయిపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.’ అని అన్నారు.

బాల్య వివాహాలు చేస్తే జైలుకే

బాల్య వివాహాలు చేస్తే సంబంధిత తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామ సర్పంచ్‌ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం కలెక్టర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలను జరిపించే వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్టు ఎవరికైనా తెలిస్తే 1098 లేదా 181 కు సమాచారం అందించాలన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆ కార్యక్రమాల వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తే చాలా మందికి అవగాహన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ మాధవరెడ్డి, సబ్‌కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, అదనపు ఎస్పీ మనీషారెడ్డి, పార్వతీపురం పురపాలక శాఖ కమిషనర్‌ పావని, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:07 AM