Share News

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:40 PM

జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, పక్కన ఎస్పీ మాధవరెడ్డి

-కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌లో జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ, జిల్లా రహదారి భద్రతా సమన్వయ కమిటీ, బాల్య వివాహాల నిర్మూలన చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల నివారణకు పోలీసు, రవాణా, అటవీ, ఎక్సైజ్‌ శాఖలు జాయింట్‌ ఆపరేషన్‌ను నిర్వహించాలన్నారు. బస్సులు, రైల్వేస్టేషన్లలో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టాలన్నారు. ‘గంజాయి విక్రయించినా, వినియోగించినా బైండోవర్‌ కేసులు నమోదు చేయాలి. అన్ని విద్యా సంస్థల వద్ద ఉన్న దుకాణాలను తనిఖీ చేసి మత్తు పదార్థాలు ఉంటే వెంటనే సీజ్‌ చేయాలి. ప్రతి గ్రామంలో మైక్‌సెట్ల ద్వారా మత్తు పదార్థాలు, బాల్య వివాహాలు, మహిళల అపహరణపై అవగాహన కల్పించాలి. జిల్లాలో బాల్య వివాహాలు జరగరాదు. ఇలాంటి వివాహాలు జరిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. రహదారి భద్రతా నియమాలు ఖచ్చితంగా అమలు చేయాలి.’అని కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో మాదక ద్రవ్యాల నివారణకు ఇతర శాఖలతో కలిసి పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మనీషారెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాలి, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రతి పంటకూ సాగునీరు అందించాలి

జిల్లాలో ఖరీఫ్‌ మాదిరిగానే రబీలో కూడా ప్రతి పంటకూ సాగునీరు అందించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునికీకరణ, కాలువల బలోపేతం, నీటి వినియోగ సామర్థ్యం పెంపుపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు కేవలం పాత పద్ధతిలోనే కాకుండా కొత్త ఆలోచనలతో ప్రాజెక్టుల నిర్వహణ చేపట్టాలన్నారు. కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ కింద కాలువలను బలోపేతం చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నీటి వృథాను అరికట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద అన్ని చెరువులు, కందకాలు తవ్వడానికి, మొక్కలు నాటడానికి నిధులు మంజూరు చేయాలని అన్నారు. జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. చెరువుల వద్ద ఆక్రమణలు తొలగించడానికి ఇంజనీరింగ్‌ అధికారులకు పూర్తి అధికారాలు ఉన్నాయన్నారు. రెవెన్యూ లేదా పోలీస్‌ శాఖల కోసం ఎదురుచూడకుండా ఆక్రమణలు తొలగించాలని అన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:40 PM