Share News

An Invitation to Development అభివృద్ధికి ఆహ్వానం

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:31 AM

An Invitation to Developmentఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ వేళ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ధీమాతో ఉన్నారు. పిల్లలకు ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని, ఈ ప్రాంత ప్రజల భూములకు ఎక్కువ ధరలు వస్తాయని, మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

An Invitation to Development అభివృద్ధికి ఆహ్వానం

అభివృద్ధికి ఆహ్వానం

ఎయిర్‌పోర్టు రాకపై నిర్వాసితుల్లో ఆనందం

పిల్లలకు ఉపాధి దొరుకుతుందని ధీమా

తమ ప్రాంతానికి మేలు జరుగుతుందని సహకారం

కల సాకారం అవుతున్నందుకు హర్షం

ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ వేళ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ధీమాతో ఉన్నారు. పిల్లలకు ఉపాధి అవకాశాలు లభ్యమవుతాయని, ఈ ప్రాంత ప్రజల భూములకు ఎక్కువ ధరలు వస్తాయని, మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అభివృద్ధికి ఆహ్వానం పలుకుతున్నారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తామూ భాగస్వాములవ్వాలని ఉవ్విళ్లూరుతున్నారు. వెరసి నిర్వాసితులు, భోగాపురం మండలంలోని ప్రతి గ్రామంలోనూ పండుగ వాతావరణం కనిపిస్తోంది.

భోగాపురం, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు భోగాపురం ప్రాంతం నిర్మానుష్యంగా ఉండేది. వ్యవసాయ పనులు, తోట పనులు చేసుకొంటూ ప్రజలు జీవనం సాగించేవారు. 2016లో అన్యూహ్యంగా అప్పటి.. నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ఆలోచనతో భోగాపురం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు బీజం పోశారు. అనుకొన్నదే తడవుగా ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. భూసేకరణ కోసం సుమారు 5300 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. రైతుల్లో వ్యతిరేకత రావడంతో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పునరాలోచన చేసి సుమారు 2750 ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించారు. ముడసర్లపేట, బొల్లింకలపాలెం, మరాడపాలెం, రెల్లిపేట గ్రామాలు పూర్తిగా ఎయిర్‌పోర్టు భూముల్లో కలిసిపోయాయి. అయితే ప్రారంభరంలో భూములిచ్చేందుకు ప్రజలు, రైతులు కాస్త విముఖత చూపారు. ప్రభుత్వం అవగాహన పరచడంతో తమ నేల పోయినా పిల్లలకు ఉపాధి దొరుకుతుందని, ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్న ఆలోచనతో ముందుకొచ్చారు. ఇదిలా ఉండగా ఎయిర్‌పోర్టు నిర్మాణంతో గూడెపువలస, దల్లిపేట, రెడ్డికంచేరు, చేపలకంచేరు, సవరవల్లి, ఎ.రాయవలస తదితర చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఒక్కసారిగా మారి పోయింది. గతంలో రూ.లక్షల్లో ఉన్న భూముల ధరలు ఒక్కసారిగా రూ.కోట్లకు పరుగులు పెడుతున్నాయి. ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక గృహాలు నిర్మాణాలు, షాపుల నిర్మాణాలు జోరందుకున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో అద్దె గృహాలు అంటే తెలిసేది కాదు. ప్రస్తుతం వందలాది మంది అధిక మొత్తాల్లో అద్దెలు చెల్లిస్తూ నివాసం ఉంటున్నారు. ఆయా గ్రామాలు ఎయిర్‌పోర్టు పనులు చేస్తున్న కూలీలు, ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి.

మా ప్రాంతానికి మేలు

ఎయిర్‌ పోర్టుకు 35 ఎకరాలు ఇచ్చాను. అప్పట్లో ఎకరా ధర రూ.50లక్షల వరకు ఉన్నా రూ.33 లక్షలే ఇచ్చారు. అయితే మా ప్రాంతానికి మేలు జరుగుతుందనే ఆలోచనతోనే భూములు ఇచ్చాం. ఎయిర్‌పోర్టురావడంతో ఎకరా ధర రూ.10కోట్లు వరకు పలుకుతోంది. రహదారులు మారుతు న్నాయి. వ్యాపారాలు పెరిగాయి. ఇళ్ల అద్దెలు కూడా పెరిగాయి. పెద్ద పెద్ద స్టార్‌ హోటళ్లు వస్తున్నాయి. ఈ మార్పు చూస్తుంటే ఆనందం కలుగుతోంది

- బొల్లింకల ఆదినారాయణ, బొల్లింకలపాలెం

గ్రామాలు బాగుపడుతున్నాయ్‌

మా నేల పోయినా మా ప్రాంతం, గ్రామాలు బాగుపడుతున్నాయి. అప్పట్లో ఎయిర్‌పోర్టుకు 8 ఎకరాలు ఇచ్చాం. ప్రారంభంలో బాధ అనిపించినా ఇప్పుడు చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది. ఎయిర్‌పోర్టు రాకతో మా ప్రాంతంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ విధంగా మారుతుందని మేము ఊహించలే. భవిష్యత్‌ ఇంకా బాగుంటుందని అనిపిస్తోంది.

- సీరపు సూరమ్మ, బైరెడ్డిపాలెం

గర్వంగా ఉంది

ఎయిర్‌పోర్టు నిర్మాణం తర్వాత మా ప్రాంతానికి పెద్దపెద్ద నాయకులు వస్తున్నారు. ఇక్కడ ఎంతో గొప్ప విమానాశ్రయం నిర్మించారని చెబుతున్నారు. మేం కూడా దూరం నుంచి చూస్తున్నాం. విమానాలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి. భూములు ఇచ్చినప్పుడు కాస్త బాధ అనిపించింది. ఇప్పుడు అంతా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎయిర్‌పోర్టు కోసం నేను 3.70 ఎకరాలు ఇచ్చాను.

- కోరాడ సన్యాసి, రైతు, బైరెడ్డిపాలెం

మా నేలపై విమానాలు చూస్తున్నాం

నేను విమానాశ్రయానికి ఎకరం భూమి ఇచ్చాను. నేనిచ్చిన నేలపై విమానాలు దిగడం, ఎగరడం చూసి చాలా ఆనందం కలిగింది. ఈ విషయాన్ని అందరికీ ధైర్యంగా బతికున్నంత కాలం చెప్పుకొంటాను. నా నేల పోయినా మా ఊళ్లు బాగుపడుతున్నాయి. ఇది నాకు గర్వంగా ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది.

- గాలి పైడితల్లి, రైతు, బైరెడ్డిపాలెం

-------------------------------

Updated Date - Jul 29 , 2026 | 12:31 AM