Share News

An eye here, an eye there అటో కన్ను.. ఇటో కన్ను

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:10 AM

An eye here, an eye there పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరగనుండడంతో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే పైడితల్లి ఉత్సవాలు మొదలయ్యాయి. సిరిమాను చెట్టును మానుగా మలిచే పనులు సాగుతున్నాయి.

An eye here, an eye there అటో కన్ను.. ఇటో కన్ను

అటో కన్ను.. ఇటో కన్ను

ఒకేసారి అమ్మవారి పండగ, ఎన్నికలు

కత్తిమీద సాములా పోలీసుల విధులు

జిల్లాలో 1800 మంది సిబ్బంది కేటాయింపు

విజయనగరం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి):

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరగనుండడంతో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే పైడితల్లి ఉత్సవాలు మొదలయ్యాయి. సిరిమాను చెట్టును మానుగా మలిచే పనులు సాగుతున్నాయి. ఈ నెల 26న తొలేళ్లు, 27న సిరిమానోత్సవం జరగనుంది. నవంబరు 11న చండీహోమం, దీక్ష విరమణ అనంతరం ఉత్సవాలు ముగుస్తాయి. ఇదే సమయంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ వచ్చింది. విజయనగరం కార్పొరేషన్‌, బొబ్బిలి, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా చురుగ్గా జరుగుతోంది. దీంతో అంతటా సందడి నెలకొంది. వచ్చే నెలలో ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఒకపక్క పైడితల్లి ఉత్సవాలు, మరోపక్క ఎన్నికలతో పోలీసు యంత్రాంగానికి ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసు సిబ్బందితో పాటు అధికారుల సెలవులు రద్దయ్యాయి. షెడ్యూల్‌ వచ్చిన మరుక్షణం సెలవుల్లో ఉన్నవారు సైతం రిపోర్టు చేశారు. ఇప్పటికే జిల్లా ముఖద్వారాలు, ప్రధాని కూడళ్లలో వాహన తనిఖీలు చేపడుతున్నారు.

1800 మంది సిబ్బంది

జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఉండగా 10 సర్కిళ్ల పరిధిలోని 42 పోలీస్‌స్టేషన్లలో 1800 మంది వరకూ పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. ఇటీవల కొత్తగా కానిస్టేబుళ్లు వచ్చారు. కానీ ఇంకా కొరత ఉంది. ఉన్న సిబ్బందితో ఎన్నికలను సజావుగా జరిపించేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది.

20 చోట్ల చెక్‌పోస్టులు

ఎన్నికల నేపథ్యంలో అంతర్‌ రాష్ట్ర, జిల్లా రహదారుల పరిధిలో దాదాపు 20 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. నిరంతర నిఘాతో పాటు అవసరమైతే డ్రోన్లతో తనిఖీలు చేయనున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారంపై కూడా పోలీస్‌ శాఖ ఉక్కుపాదం మోపనుంది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేసుకునేందుకు సైతం వెనుకడుగు వేయబోమని చెబుతోంది. ఈ విధులన్నీ పోలీస్‌ శాఖకు కత్తిమీద సాములా మారనున్నాయి.

గీత దాటితే కఠిన చర్యలు

ఎస్పీ దామోదర్‌

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే చర్యలు తప్పవు. అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. పోలీస్‌ శాఖపరంగా నిరంతర నిఘా, తనిఖీలు ఉంటాయి. ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు 15,217 మందిని బైండోవర్‌ చేశాం. వారితో సొంతపూచీకత్తుగా రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు బాండ్లు తీసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా 549 మంది రౌడీషీటర్లను గుర్తించి వారిని బైండోవర్‌ చేశాం. 424 లైసెన్స్‌ తుపాకులు స్వాధీనం చేసుకుని భద్రపరిచాం.

----------------

Updated Date - Oct 18 , 2026 | 12:10 AM