Share News

An End to the Struggles తీరనున్న వెతలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:04 AM

An End to the Struggles విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద కొన్నాళ్లుగా చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. త్వరలో వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు తీరనున్నాయి. మొత్తంగా నాలుగు జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వాసులకు మార్గం సుగమం కానుంది.

An End to the Struggles తీరనున్న వెతలు
చీపురుపల్లి వద్ద రైల్వేవంతెన పరిశీలిస్తున్న ఆర్టీసీ అధికారులు

  • నాలుగు జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వాసులకు మార్గం సుగమం

  • ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సన్నాహాలు

పాలకొండ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద కొన్నాళ్లుగా చేపడుతున్న రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. త్వరలో వాహనదారులు, ప్రయాణికుల ఇక్కట్లు తీరనున్నాయి. మొత్తంగా నాలుగు జిల్లాలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వాసులకు మార్గం సుగమం కానుంది. మరోవైపు ఆర్టీసీ అధికారులు కూడా బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా రైల్వే వంతెన ప్రారంభానికి సంబంధించి సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ఇదీ పరిస్థితి..

- చీపురపల్లి వద్ద రైల్వే బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో 2021 డిసెంబరు నుంచి దానిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపేశారు. దీంతో గత ఐదేళ్లుగా ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాలకు చెందిన ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కాగా ఈ వంతెన పనులపై నాటి వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో కొంతకాలంగా ప్రజలు చిలకపాలెం మీదుగా విజయనగరం, విశాఖపట్నం రాకపోకలు సాగించాల్సి వస్తోంది. అదేవిధంగా పాలకొండ, రాజాం, ఉత్తరావల్లి, గరివిడి మీదుగా విజయనగరం, విశాఖకు మరికొన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సుమారు 40 కిలోమీటర్ల అదనంగా ప్రయాణించాల్సి వస్తుండడంతో ప్రజలకు ఖర్చులు అధికమవుతున్నాయి. దూరా భారంతో పాటు సమయం కూడా వృథా కావడంతో ఆపసోపాలు పడుతున్నారు.

- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చీపురుపల్లి రైల్వే వంతెన పనులను ముమ్మరం చేసింది. ఆర్‌అండ్‌బీ, రైల్వే, జడ్పీ నిధులు సమకూర్చి నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది. మొత్తంగా ఏడాదిన్నరలోనే వంతెన పనులు కొలిక్కివచ్చాయి. ఈనెల 10 తర్వాత ఈ వంతెనను ప్రారంభించనున్నట్లు సమచారం. అదే జరిగితే వాహనదారులు, ప్రజల ప్రయాణ కష్టాలు తప్పనున్నాయి.

ఆర్టీసీకి కోట్లలో నష్టం...

చీపురుపల్లి రైల్వే వంతెన మరమ్మతులకు గురికావడంతో పాలకొండ ఆర్టీసీ డిపోకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రతి నెలా సరాసరి రూ.60 లక్షలు నుంచి రూ.80 లక్షల వరకు నష్టం వచ్చింది. వాస్తవంగా పాలకొండ ఆర్టీసీ డిపో నుంచి రోజూ రాజాం, చీపురుపల్లి, విజయనగరం మీదుగా విశాఖ, రాజమండ్రి, విజయవాడ తదిరత ప్రాంతాలకు 32 సర్వీసులను నడిపేవారు. వీటి ద్వారా రూ. రెండు లక్షల 50 వేలు వరకు ఆదాయం సమకూరేది. ఈ లెక్కన చూస్తే నెలకు రూ.60 నుంచి రూ.80 లక్షల వరకు ఆదాయం వచ్చేది. అయితే గత ఐదేళ్లుగా బస్సు సర్వీసులను ఆ దారిలో నిలిపివేశారు. దీంతో విశాఖపట్నం నడిపే 32 సర్వీసుల్లో 16 సర్వీసులు తగ్గించారు. నాటి నుంచి పాలకొండ, రాజాం, చిలకపాలెం మీదుగా ఎన్‌హెచ్‌-16 నుంచి విశాఖపట్నం తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. ఒకటి రెండు బస్సులను రాజాం, ఉత్తరావల్లి, గరివిడి మీదుగా నడుపుతున్నారు. కాగా ఇటీవల జిల్లా ప్రజా రవాణా అధికారి పి.వెంకటేశ్వరరావు, పాలకొండ డిపో మేనేజర్‌ మూర్తి, అసిస్టెంట్‌ మేనేజర్‌ యు.రమేష్‌ తదితరులు వంతెనను స్వయంగా పరిశీలించారు. దీనిపై జిల్లా ప్రజా రవాణా అధికారి పి.వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. ‘చీపురుపల్లి వద్ద రైల్వే వంతెన పనులు పూర్తయ్యాయి. ఇది అందుబాటులోకి వచ్చిన వెంటనే జిల్లా నుంచి ఆర్టీసీ సర్వీసులు పెంచుతాం.’ అని తెలిపారు.

Updated Date - Jan 03 , 2026 | 12:04 AM