Share News

ప్రచారానికి తెర

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:52 PM

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది.

ప్రచారానికి తెర

- మున్సిపాల్టీల్లో ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

- ప్రలోభాలపై అభ్యర్థుల దృష్టి

- రేపు పోలింగ్‌

- ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

విజయనగరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. విజయనగరం నగరపాలక సంస్థతో పాటు బొబ్బిలి మునిసిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీలో ఆదివారం పోలింగ్‌ జరగనుంది. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో కూటమి వర్సెస్‌ వైసీపీ అన్నట్టు పరిస్థితి ఉంది. నామినేషన్ల పర్వంలో కూటమి పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు కాక కొద్దిపాటి గందరగోళం నెలకొంది. కానీ, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కీలక నేతలు రంగంలోకి దిగారు. సర్దుబాటును సజావుగా పూర్తిచేశారు. దీంతో కూటమి అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది. కానీ, ప్రచారానికి వర్షం బెడద తప్పలేదు. మరోవైపు వైసీపీ నుంచి పోటీచేసేందుకు నేతలు పెద్దగా ముందుకు రాలేదు. అధికార పార్టీకి దీటుగా నిలబడడం, ఆర్థిక భారం తదితర కారణాలతో పెద్ద నేతలు విముఖత చూపారు. దీంతో సాధారణ నేతలు, కార్యకర్తలనే అభ్యర్థులుగా ఆ పార్టీ రంగంలోకి దించింది. విజయనగరం నగరపాలక సంస్థలో 62 డివిజన్లలో 169మంది కార్పొరేటర్‌ అభ్యర్థులు, ఏడుగురు మేయర్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బొబ్బిలి మునిసిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా కౌన్సిలర్‌ అభ్యర్థులుగా 95 మంది పోటీ చేస్తున్నారు. చైర్‌పర్సన్‌ పదవి కోసం నలుగురు పోటీ పడుతున్నారు. నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్మన్‌ పదవికి నలుగురు పోటీ పడుతున్నారు. కౌన్సిలర్ల పదవుల కోసం 59 మంది బరిలో ఉన్నారు. ఆదివారం పోలింగ్‌, మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. దీని కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మద్యం, నగదు ప్రవాహం

స్థానిక పోరులో మద్యం, నగదు ప్రవాహం ఉంటుందన్నది బహిరంగ రహస్యం. అయితే ఆర్థికంగా అండగా నిలబడతామన్న వైసీపీ పెద్దల భరోసాతోనే ఆ పార్టీ అభ్యర్థులు ఎక్కడికక్కడ నిలబడ్డారు. అయితే, ప్రచారపర్వం ముగిసినా వారికి ఆశించిన స్థాయిలో ఆర్థిక అండ రాలేదు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు మద్యంను శిబిరాలకు తరలించినట్టు తెలుస్తోంది. పోలింగ్‌ రోజున మద్యం అమ్మకాలు ఉండవు. షాపులను నిబంధనల ప్రకారం మూసివేస్తారు. దీంతో చీప్‌ లిక్కర్‌ నుంచి కాస్ట్‌లీ మద్యం వరకూ శిబిరాలకు తరలించినట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రచారం ముగియడంతో డబ్బు, మద్యం పంచేందుకు కొన్ని బృందాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏ డివిజన్‌కు ఎంత? ఏ వార్డుకు ఎంత పంచాలి? అనే లెక్కలు కట్టి మరీ ఈ బృందాలు రంగంలోకి దిగడం విశేషం.

Updated Date - Oct 30 , 2026 | 11:52 PM