Share News

ప్రచారానికి తెర

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:36 PM

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల తరువాత సైలెన్స్‌ పీరియడ్‌ అమలులో ఉంటుంది.

ప్రచారానికి తెర

- నేటితో ముగియనున్న మున్సిపల్‌ ఎన్నికల ప్రచార పర్వం

- ఎల్లుండి పోలింగ్‌

పార్వతీపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల తరువాత సైలెన్స్‌ పీరియడ్‌ అమలులో ఉంటుంది. దీంతో గత కొన్ని రోజులుగా హోరెత్తించిన మైకులు మూగబోనున్నాయి. ప్రచారం ముగియనుండడంతో అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు వార్డుల్లో ఉంటున్న ఓటర్లకు ఫోన్లు చేసి ఓట్లు అభ్యర్థించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటరు స్లిప్పులను అందించి పోలింగ్‌ కేంద్రాల వివరాలను తెలియజేయనున్నారు. తమేకే ఓటు వేసేలా మౌన ప్రచారానికి తెర తీయనున్నారు. జిల్లాలో పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. పార్వతీపురం మున్సిపాల్టీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా టీడీపీ నుంచి బెలగాం కరుణ, వైసీపీ నుంచి పి.సాయిశ్రీ, కాంగ్రెస్‌ నుంచి పాలకొండ సంధ్య, ఇండిపెండెంట్‌గా పూసర్ల లలిత పోటీలో ఉన్నారు. సాలూరు మున్సిపాలిటీలో జనసేన నుంచి గొర్లె విజయకుమారి, వైసీపీ నుంచి రిబ్కారాణి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి సిగడాపు ధనలక్ష్మితో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా గుళ్ల మంజీరా, లచ్చు బత్తుల కల్పన, నిమ్మాది శ్యామల బరిలో ఉన్నారు.పాలకొండ నగర పంచాయతీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనసేన నుంచి పల్లా విజయనిర్మల, వైసీపీ నుంచి పాలవలస ఇందుమతి, స్వతంత్య్ర అభ్యర్థిగా భాసూరు శ్రీదేవి పోటీ చేస్తున్నారు. నవంబరు 1న పోలింగ్‌, మూడో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. దీని కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్వేచ్ఛగా ఓటు వేయండి: కలెక్టర్‌

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అనంతరం మైకులు, సభలు, ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాలకు అనుమతి ఉండదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నవంబర్‌ 1న ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Updated Date - Oct 29 , 2026 | 11:36 PM