An Airplane for Our Village మా ఊరికి విమానం
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:24 AM
An Airplane for Our Village అప్పుడప్పుడు గాలిలో విమానం వెళ్తున్న శబ్ధం విని ఎక్కడా.. అని ఆకాశంపై నలుదిక్కులూ వెతకడమే వారికి తెలుసు. ఇంటిల్లిపాదీ అదిగో విమానం.. అటు వెళ్తోంది చూడు.. అంటూ దూరంగా చూడటానికి ఆరాట పడేవారు. ఓ పక్షిలా విమానం కనిపిస్తే ‘నాకే కనిపించిందంటూ’ చెప్పుకునేవారు. అలాంటి అనుభవాలు ఉన్న వారంతా నేడు ఊరు పక్కకు విమానాశ్రయం రావడంతో పట్టలేనంతగా ఆనందపడుతున్నారు. విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానాన్ని దగ్గరగా చూసి పులకించిపోతున్నారు. విమానం మా ఊరుకే వచ్చేసిందోచ్ అంటూ సంతోషపడుతున్నారు.
మా ఊరికి విమానం
కలలో కూడా అనుకోలేదు
కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం
ఊరట చెందుతున్న ఎయిర్‌పోర్టు పరిసర గ్రామాల ప్రజలు
అప్పుడప్పుడు గాలిలో విమానం వెళ్తున్న శబ్ధం విని ఎక్కడా.. అని ఆకాశంపై నలుదిక్కులూ వెతకడమే వారికి తెలుసు. ఇంటిల్లిపాదీ అదిగో విమానం.. అటు వెళ్తోంది చూడు.. అంటూ దూరంగా చూడటానికి ఆరాట పడేవారు. ఓ పక్షిలా విమానం కనిపిస్తే ‘నాకే కనిపించిందంటూ’ చెప్పుకునేవారు. అలాంటి అనుభవాలు ఉన్న వారంతా నేడు ఊరు పక్కకు విమానాశ్రయం రావడంతో పట్టలేనంతగా ఆనందపడుతున్నారు. విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానాన్ని దగ్గరగా చూసి పులకించిపోతున్నారు. విమానం మా ఊరుకే వచ్చేసిందోచ్ అంటూ సంతోషపడుతున్నారు.
భోగాపురం, జూలై29(ఆంధ్రజ్యోతి): భోగాపురం చుట్టుపక్కల ప్రాంతీయులు కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు. తాము ఎప్పుడూ ఊహించని పరిణామాలను ఆస్వాదిస్తున్నారు. ఈప్రాంతంలో విమానాలు దిగడం, ఎగరడం చూసి ఇది నిజమేనా అనిపిస్తోందని, తమ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు చూస్తామని ఎప్పుడూ ఊహించ లేదంటున్నారు. గత అనుభవాలతో నేటి మార్పులను సరిచూసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాలన్నీ పిల్లలకు కూడా విడమర్చి చెబుతున్నారు. బస్ స్టేషన్‌లా విమానం స్టేషన్ వచ్చిందిరా అబ్బాయి అని తెలియజేస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో సాగుపై ఆధారపడేవారు ఎక్కువ. ఆ తర్వాత గంగపుత్రులు కీలకం. దీంతో ఎటు చూసినా పంట భూములే కనిపిస్తుండేవి. చేపల అమ్మకాలు విరివిగా సాగే దృశ్యాలు కూడా కనిపించేవి. ఎయిర్‌పోర్టు రాకతో నవలోకం ఆవిష్కృతం అయినట్లు వారంతా భావిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజున మనస్ఫూర్తిగా అంగీకరించని వారు కూడా నేటి మార్పులను చూసి ఇది కదా అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు. రచ్చబండ వద్దే కాదు.. చెట్టు, పుట్ట, చెరువు గట్టు.. ఇళ్ల బయట ఒకటే చర్చ నడుస్తోంది. విమానాశ్రయం తమ ప్రాంత దిశనే మారుస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఇక యువతలో మరిన్ని ఊహలు చిగురిస్తున్నాయి. తమ ప్రాంతానికి వచ్చే విమానంలో తామూ ప్రయాణం చేయాలని కలలు కంటున్నారు. వాటిని సాకారం చేసుకునేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. పెద్దలు మరో అడుగు ముందుకేసి అసలు ఏయే విమానాలు వస్తాయి? ఏఏ దేశాలు వెళ్లొచ్చు? టికెట్ ధరలు ఎలా ఉంటాయి? రానుబోను ఎంత ఖర్చు అవుతుంది? విదేశాలు వెళ్లాలంటే ఏం చేయాలి? అంటూ యువకులైన పిల్లల వద్ద ఆరా తీస్తుండడం కనిపించింది. మరోవైపు ఎయిర్‌పోర్టు సమీప గ్రామాల ప్రజలంతా ప్రారంభోత్సవం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఎప్పుడూ ఊహించలేదు
మాప్రాంతంలో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రోడ్లు కూడా సరిగా ఉండేవి కావు. ఎక్కడికి వెళ్లాలన్నా కాలి నడకే. కొన్నాళ్ల తర్వాత రహదారులు చూశాం. వాటిపై ప్రయాణించే కార్లు, బైకులు చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మా చెంత నుంచే గాలిలో ఎగురుతున్న విమానాలను చూస్తున్నాం. ఇలాంటి అనుభవాన్ని ఊహించలేదు.
- ఎరుకొండ అప్పన్న, రెడ్డికంచేరు
చాలా ఆనందంగా ఉంది
మా ప్రాంతానికి విమానాశ్రయం రావడంతో చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడూ గాల్లో దూరంగా విమానాలు చూసి సంతోషపడేవాళ్లం. ఇప్పుడు మా కళ్లముందే విమానాలు రావడం, వెళ్లడం చూస్తుంటే అబ్బురమనిపిస్తోంది. ఇలా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇకపై మాప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అనుకొంటున్నాం.
- దల్లి కొత్తయ్యరెడ్డి, దల్లిపేట
దగ్గర నుంచి చూస్తున్నాం
మాగ్రామంలో సైకిళ్లు, మోటరు సైకిళ్లు, కొంతకాలంగా కార్లు తిరుగుతున్నాయి. విమానం గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకొనేవారిమి. విశాఖపట్నం వెళ్తే దగ్గరనుంచి విమానం చూసి వింతగా మాట్లాడుకునేవాళ్లం. అలాంటిది ఇప్పుడు మా ఊరిలోనే విమానాలు దిగడం, ఎగరడం చూస్తున్నాం. ఎంతో గొప్ప పరిణామంగా భావిస్తున్నాం.
- ముడసర్ల దుర్గమ్మ, ముడసర్లపేట
గొప్ప అనుభూతి
మాగ్రామంలోనే విమానాల స్టేషన్ ఏర్పాటు చేయడం, ఇక్కడే విమానాలు దిగడం, ఎగరడం చాలా గొప్ప అనుభూతి ఇస్తోంది. రాత్రి సమయాల్లో విమానాశ్రయం ఎంతో అందంగా కనిపిస్తోంది. మాగ్రామం ఆనుకొని విమానాలు వచ్చిపోతుంటే ఇది కలా, నిజమా అన్నట్లు అనిపిస్తోంది. ఇది మాకు ఊహించని పరిణామం.
- కొల్లిరాంనాయుడు, గూడెపువలస.
చివరి దశకు ఏర్పాట్లు
భోగాపురం, జూలై29(ఆంధ్రజ్యోతి): భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేయడానికి వస్తున్న ముఖ్య అతిథి ప్రధాని మోదీ సభకు ఏర్పాట్లు చివరి దశకు చేరాయి. బుధవారం నుంచి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక దళాలు మోహరించాయి. సుమారు 3లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని ప్రసంగం ఇచ్చే ప్రాంతానికి ప్రజలు కూర్చొనే చోటుకు మధ్య సుమారు 100 మీటర్ల ఖాళీ స్థలం ఉంచారు. అటుగా వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్నారు.
విద్యుత్ కాంతుల్లో విమానాశ్రయం
విజయనగరం కంటోన్మెంట్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మరో 48 గంటల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. ఇందులో భాగంగా ప్రాంగణమంతా విద్యుత్ వెలుగులతో కాంతులీనుతోంది. ఎయిర్‌పోర్టు ప్రధాన మార్గం వద్ద ఏర్పాటు చేసిన పౌంటైన్, ఏటీసీ, టెర్మినల్ భవనాలకు వివిధ వర్ణాల విద్యుత్ దీపాలను అలంకరించారు. రాత్రి వేళల్లో చూపురులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక మైదానమంతా గ్రీనరీతో నింపారు. ఎటు చూసినా పచ్చదనం ఉట్టిపడేలా వివిధ రకాలైన పూలమొక్కలు ఆహ్వానం పలుకుతున్నాయి.
చిరకాల స్వప్నం సాకారం
ఆగస్టు 16న తొలి విమానం భోగాపురం రాక
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
భోగాపురం, జూలై29(ఆంధ్రజ్యోతి): భోగాపురం(అల్లూరి సీతారామరాజు)అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమవుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఆవరణలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారన్నారు. ఎయిర్‌పోర్టును వచ్చేనెల 1న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభిస్తారని, ఆగస్టు 16వ తేది రాత్రి సింగ్‌పూర్ నుంచి భోగాపురానికి తొలి వాణిజ్య విమానం ల్యాండ్ అవుతుందన్నారు. తిరిగి 17న తెల్లవారుజామున ఇక్కడి నుంచి బయలు దేరుతుందన్నారు. హుద్‌హుద్ సమయంలో ఈప్రాంతంలో ఎయిర్‌పోర్టు పెట్టాలని సీఎం చంద్రబాబునాయుడుకు ఆలోచన వచ్చిందని, అందులో భాగంగానే 2019లో ఎయిర్‌పోర్టుకు ఆయన శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. తరువాత వచ్చిన గొడ్డలి పార్టీ కక్షతో ఎయిర్‌పోర్టు పనులు జరగకుండా చేసిందన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 24నెలల్లో పూర్తిచేసి ఆగస్టు1న ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తోందన్నారు. ఆయన వెంట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు.