Malaria గిరిజన విద్యార్థులకు మలేరియా
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:09 PM
Malaria Among Tribal Students మండలంలో తూర్పు ఏజెన్సీ గ్రామాలైన జమ్మువలస, పెదదోడిజకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు మలేరియా బారినపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు.
వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి
జియ్యమ్మవలస, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మండలంలో తూర్పు ఏజెన్సీ గ్రామాలైన జమ్మువలస, పెదదోడిజకు చెందిన ఇద్దరు గిరిజన విద్యార్థులు మలేరియా బారినపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. జమ్మువలసకు చెందిన కూరంగి జశ్వంత్ పీటీ మండల టీడబ్ల్యూఏయూపీ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం బాలుడికి జ్వరం రావడంతో హెచ్‌ఎం కొండగొర్రి సుగ్రీవులు సోమవారం ఉదయం హుటాహుటిన చినమేరంగి సీహెచ్‌సీలో చేర్పించారు. బాలుడికి వైద్య పరీక్షలు చేయగా మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ వాసుదేవరావు చికిత్స అందిం చారు. ఇక పెదదోడిజ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆరిక హర్షిత కొద్దిరోజులుగా మలేరియాతో బాధపడుతోంది. దీంతో తల్లిదండ్రులు రెండు రోజుల కిందట చినమేరంగి సీహెచ్‌సీలోనే చేర్పించారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలాఉండగా సోమవారం పెదదోడిజలో ఎంపీడీవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో ‘మా ఊరికి మలేరియా వచ్చింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచాయతీ సిబ్బందితో కాలువలు శుభ్రం చేయించారు. కాలువల్లో నీరు నిల్వ ఉన్న చోట, ఇళ్ల పరిసరాల చుట్టూ శుభ్రం చేసి ఏఎల్‌వో స్ర్పే చేయించారు. తరువాత గ్రామస్థులకు ఆరోగ్య సూత్రాలను తెలియజేసి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆర్‌ఆర్‌బీ పురం పీహెచ్‌సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.