Amid Great Fanfare సందడిగా!
ABN , Publish Date - Jul 21 , 2026 | 12:01 AM
Amid Great Fanfare జిల్లాలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం సందడిగా జరిగింది. టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాఽధించిన 98 మందికి, ఇంటర్‌లో 23 మందికి రూ.20వేల నగదు, పతకం, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహించారు.
తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు
విద్యాభివృద్ధే లక్ష్యం: ప్రభుత్వ విప్ జగదీశ్వరి
పార్వతీపురం/బెలగాం, జూలై20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం సందడిగా జరిగింది. టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాఽధించిన 98 మందికి, ఇంటర్‌లో 23 మందికి రూ.20వేల నగదు, పతకం, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 121 మంది విద్యార్థులను సత్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తుకు నేటి విద్యార్థులే మార్గదర్శకులని అన్నారు. లక్ష్యాలకు అను గుణంగా బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యాభివృద్ధే లక్ష్యంగా కూటమి రాష్ట్ర సర్కారు పనిచేస్తోందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్న ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కే దక్కుతుందన్నారు. అనంతరం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మన్యం జిల్లా వెనుకబడింది కాదన్నారు. అన్నింటా ముందుండే జిల్లాగా అభివృద్ధి చెందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మన్యం జిల్లా రాష్ట్రస్థాయిలో ముందంజలో ఉండడం .. విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, డీఈవో బ్రహ్మాజీ రావు , డీఐఈవో హరిగోపాల్, ఆర్డీవో మాధురి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయశాంతి, ఎస్సీ, బీసీ సంక్షేమాధికారి శ్యామల, సర్వశిక్షా అభియాన్ ఎస్పీ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌తో పోరాడుతూనే..
పాలకొండ, జూలై20(ఆంధ్రజ్యోతి): పాలకొండకు చెందిన నివేదిత ఒక వైపు వైకల్యం, మరో వైపు క్యాన్సర్‌తో పోరాడుతూనే పదో తరగతిలో ప్రతిభ కనబరిచింది. షైనింగ్‌స్టార్‌గా ఎంపికై అవార్డును సొంతం చేసుకుంది. వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న సమయంలో ఆ విద్యార్థినికి బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏడాది పాటు చికిత్స పొందింది. ప్రస్తుతం కూడా మందులు వాడుతూ చదువును కొనసాగిస్తుంది. అనారోగ్యం కారణంగా 2024-25 పదో తరగతి పరీక్షలు రాయలేక పోయింది. 2025-26లో పాలకొండలోని ఓ పాఠశాలలో చేరి పీహెచ్‌సీ కోటాలో పరీక్షలు రాసి ప్రతిభ చాటింది. మొత్తంగా 500 మార్కులకు 480 మార్కులు సాధించి షైనింగ్ స్టార్‌గా నిలిచింది. ‘అధికారులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా సత్కారం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుర్తింపు నా జీవితంలో మధురమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, జిల్లా యంత్రాంగం, అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు.’ అని నివేదిత తెలిపింది. కాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం టెక్కలి పట్టణంలో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పి.నరసింహమూర్తి, అరుణ ఉంటున్నారు. వారు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోదరుడు వర్షిత్ స్వగ్రామంలోనే తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. నివేదిత మాత్రం పాలకొండలో మేనమామ ఎన్.రాంబాబు ఇంటిలో ఉంటూ చదువుకుంటోంది.
ఎంతో ఆనందంగా ఉంది
పదో తరతగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించి ఈ వేదికపై నిలబడడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రభుత్వం అందించిన రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటా. మాలాంటి విద్యార్థులకు ఈ నగదు ఎంతగానో ఉపయోగపడుతుంది.
- బిడ్డిక భవాని, గుమ్మలక్ష్మీపురం మండలం
==============================
ఈ సన్మానాన్ని మరువలేం..
పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించి మమ్మల్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు సన్మానించడం ఎప్పటికీ మరువలేం. అంతేగాకుండా రూ.20 వేలు, మెడల్ అందించడం ఎంతో ఆనందంగా ఉంది.
- వెంకటజ్యోత్స్న, రావివలస, గరుగుబిల్లి మండలం
====================================
వారి సహకారంతోనే..
ఎక్కువ మార్కులు సాధించిన మాలాంటి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారంతోనే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించగలిగాం.
ఎ.లోకేష్, జడ్పీ హైస్కూల్, బీజేపురం, జియ్యమ్మవలస మండలం