Alone in the Forest All Night… రాత్రంతా అడవిలో ఒంటరిగానే..
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:50 PM
Alone in the Forest All Night… తండ్రి వెంట నడుస్తూ అడవిలో దారి తప్పిపోయాడు నాలుగున్నరేళ్ల గిరిజన బాలుడు. తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియలేదు. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏం చేయాలో తోచలేదు. అడుగులేస్తూ.. గిరిశిఖరం చేరుకున్నాడు. రాత్రంతా అక్కడ ఒంటరిగానే ఉండిపోయాడు.
ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
24గంటల వ్యవధిలో గుర్తింపు
ఆనందంలో తల్లిదండ్రులు
సీతంపేట, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): తండ్రి వెంట నడుస్తూ అడవిలో దారి తప్పిపోయాడు నాలుగున్నరేళ్ల గిరిజన బాలుడు. తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియలేదు. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఏం చేయాలో తోచలేదు. అడుగులేస్తూ.. గిరిశిఖరం చేరుకున్నాడు. రాత్రంతా అక్కడ ఒంటరిగానే ఉండిపోయాడు. సీతంపేట ఏజెన్సీలోని చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే 24 గంటల వ్యవధిలోనే బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
కిండంగి పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామం గులుమూరుకు చెందిన సవర రామ్మూర్తి, మహేశ్వరి దంపతులు కొండ పోడు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా మంగళవారం ఎప్పటిలానే రామ్మూర్తి కొండపోడు పనుల కోసం అడవికి బయలుదేరాడు. అది చూసిన పెద్ద కుమారుడు సిద్ధు తండ్రి వెంటే గ్రామం దాటి అడవి ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. అయితే కుమారుడు తన వెంట వస్తున్నాడని రామ్మూర్తి గమ నించలేదు. తన పనుల హడావుడిలో ఉండిపోయాడు. ఇంటిలో సిద్ధు కనిపించకపోవడంతో తల్లి మహేశ్వరి గ్రామస్థులతో కలిసి వెతుకులాట ప్రారంభించింది. కుమారుడు గ్రామంలో ఎక్కడా కనిపించలేదు. ఇంతలో పనులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రామ్మూర్తికి భార్య మహేశ్వరి ఈ విషయం తెలిసింది. దీంతో వారు హుటాహుటిన సీతంపేట పోలీస్ట్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ మాధవరెడ్డి సీతంపేట ఎస్‌ఐ అమ్మన్నరావు, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. పార్వతీపురం నుంచి వచ్చిన స్పెషల్ ఫోర్స్ బృందం, స్థానిక పోలీసులు హుటాహుటిన గులుమూరు గ్రామానికి చేరుకున్నారు. బాలుడి మిస్సింగ్‌కు సంబంధించి వివరాలను సేకరిం చారు. అనంతరం గ్రామస్థులు, కుటుంబసభ్యులు, యువకులు, పోలీసులు గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని జల్లేడపట్టారు. అయినప్పటికీ సిద్ధు ఆచూకీ దొరకలేదు. కాగా బుధవారం మధ్యాహ్నం గులుమూరు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపై బాలుడిని పోలీసులు గుర్తించారు. రాత్రంతా అడవిలో ఒంటరిగా ఉన్న బాలుడికి సపర్యలు చేశారు. అయితే వారి వెంటే ఉన్న తండ్రి చెంతకు బాలుడు చేరాడు. అనంతరం సిద్ధుని వైద్యసేవల నిమిత్తం కుసిమి పీహెచ్‌సీకి తరలించారు. అయితే బాలుడు ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.