రాజాంలో అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు
ABN , Publish Date - Nov 14 , 2026 | 12:35 AM
దాదాపు 21 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాజాం మునిసిపల్ నగరా మోగింది.
- అన్నీతానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కోండ్రు
- బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రయత్నం
- వైసీపీ అభ్యర్థి ఖరారు.. అప్పుడే మొదలైన ప్రచారం
రాజాం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): దాదాపు 21 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రాజాం మునిసిపల్ నగరా మోగింది. ఈ నెల 26న అక్కడ పోలింగ్ జరగనుంది. 30న ఫలితం ప్రకటించనున్నారు. 32 వార్డుల్లో 36,786 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. బీసీ మహిళకు చైర్‌పర్సన్ పదవి ఖరారైంది. కూటమి తరపున జనసేనకు ఇక్కడ అవకాశమిచ్చారు. అటు వైసీపీ సైతం అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చేసింది. కూటమి కంటే ముందుగానే నిర్ణయం తీసుకుంది. పట్టణ వైసీపీ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు భార్య పేరు ఖరారు చేయడంతో ముందస్తు ప్రచారం మొదలుపెట్టారు. కూటమికి సంబంధించి జనసేనకు చైర్‌పర్సన్ పదవి కేటాయించడంతో పాటు 32 వార్డుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నీతానై వ్యవహరిస్తున్నారు. జనసేన, బీజేపీ నాయకులను సమన్వయం చేసుకొని అభ్యర్థుల జాబితాను వడబోస్తున్నారు. జనసేనకు చైర్‌పర్సన్ పదవి ఇవ్వడంతో 25కుపైగా వార్డుల్లో టీడీపీ పోటీచేసే అవకాశం ఉంది. జనసేన, బీజేపీకి 7 నుంచి 10 స్థానాల్లో ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు దొరకకపోతే మాత్రం టీడీపీ నుంచి కొందర్ని ఆ పార్టీల్లోకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
జనసేనకు టచ్‌లో తటస్థులు..
పాలకొండ నగర పంచాయతీని సైతం జనసేనకు కేటాయించారు. అక్కడ బలమైన అభ్యర్థి రంగంలోకి దిగడంతో విజయం సొంతమైంది. రాజాంలో సైతం సరైన అభ్యర్థిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తటస్థులను జనసేనలో చేర్పించి టిక్కెట్ కేటాయిస్తారన్న ప్రచారం ఉంది. ఇప్పటికే జనసేనలో పనిచేస్తున్న ముగ్గురు నేతలు ఆశావహులుగా ఉన్నారు. కానీ విద్యాధికులు, వివిధ రంగాల నిపుణులు సైతం జనసేన నాయకత్వానికి టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆర్థిక స్థితిమంతులు సైతం ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అవసరం అనుకుంటే కూటమిలో బలమైన అభ్యర్థిని జనసేన కండువా వేయిస్తారని కూడా టాక్ నడుస్తోంది. టీడీపీలో చాలామంది చైర్‌పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు వెళ్లడంతో చాలామంది పునరాలోచనలో పడ్డారు. జనసేనకు సరైన అభ్యర్థి చిక్కకపోతే అనూహ్య పరిణామాలు జరగబోతున్నాయని కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆ నాయకులపైనే భారం..
తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో హేమాహేమీలైన నాయకులు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా కోండ్రు మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆపై మాజీ మంత్రి, చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ప్రతిభాభారతిది ఇదే నియోజకవర్గం. అందుకే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూటమి గెలవాలి. ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా మూల్యం తప్పదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రెండుసార్లు వైసీపీ గెలిచింది. 2014లో టీడీపీ ప్రభంజనంలో సైతం ఆ పార్టీ విజయం సాధించింది. అందుకే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పదేళ్ల వైసీపీ హయాంలోఎటువంటి అభివృద్ధి జరగలేదన్న విమర్శ ఉంది. దానిని అనుకూలంగా మార్చుకోవాల్సిన అవసరం టీడీపీ కూటమిపై ఉంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి ఆర్థిక స్థితిమంతుడు. ఆపై గత కొన్నేళ్లుగా పదవిపై లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు. పట్టణ ప్రముఖులను కలిసి ఇప్పటికే సాయం అర్ధించారు. అందుకే వీలైనంత త్వరగా చైర్‌పర్సన్ అభ్యర్థితో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం కూటమిపై ఉంది.