Share News

Parishad Elections పరిషత్‌ పోరులో కూటమి హవా

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:32 AM

Alliance Dominates Parishad Elections పరిషత్‌ పోరులో కూటమి హవా కొనసాగింది. కూటమి పార్టీల అభ్యర్థులు సత్తాచాటారు. అన్నిచోట్లా సమీప ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. 15 జడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో శనివారం ఓట్లు లెక్కింపు చేట్టారు.

  Parishad Elections  పరిషత్‌ పోరులో  కూటమి హవా
ఓట్లు లెక్కిస్తున్న దృశ్యం

  • కూటమి అభ్యర్థుల విజయదుందుభి

  • 15 జడ్పీటీసీ స్థానాల్లో ఏడు టీడీపీ, మూడు జనసేన, ఐదు వైసీపీ కైవసం

  • ఎంపీటీసీ స్థానాల్లో కూటమి జోరు

పార్వతీపురం/సాలూరు/పాలకొండ, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పరిషత్‌ పోరులో కూటమి హవా కొనసాగింది. కూటమి పార్టీల అభ్యర్థులు సత్తాచాటారు. అన్నిచోట్లా సమీప ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. 15 జడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో శనివారం ఓట్లు లెక్కింపు చేట్టారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాలకు సంబంధించి ఉల్లిభద్ర వద్ద ఉన్న ఉద్యాన కళాశాలలో ఓట్లు లెక్కించారు. పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాలకు సంబంధించి సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండ లాలకు సంబంధించి పాలకొండ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌ జరిగింది. కేంద్రాల్లోకి అభ్యర్థితోపాటు పోలింగ్‌ ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. ముందుగా అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్‌ బాక్సులను తెరిచి.. ప్రాదేశికాలవారీగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లును విభజించి కౌంటింగ్‌ చేపట్టారు. అయితే మొదటి రౌండ్‌ నుంచే కూటమి అభ్యర్థులు ఆధిక్యం చూపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ మెజార్టీ సాధించారు. కాగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండలోని ఓట్లు లెక్కింపు ప్రక్రియను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, ఎన్నికల సాధారణ పరిశీలకుడు చినరాముడు, సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి తదితరులు పరిశీలించారు. కౌంటింగ్‌ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఆరా తీశారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఇలా..

జిల్లాలో కురుపాం, జియ్యమ్మవలస, పాచిపెంట, పాలకొండ, గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బలిజిపేట, భామిని, వీరఘట్టంలో జనసేన, సాలూరు, మక్కువ, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, పార్వతీపురంలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. పార్వతీపురం జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు 301 ఓట్ల తేడాతో సమీప వైసీపీ అభ్యర్థిపై ఓటమి చెందారు. రీకౌంట్‌ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేసినా ఫలితం లేకపోయింది.

- 226 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు 124 స్థానాల్లో గెలుపొందారు. జనసేన 36, బీజేపీ 2, వైసీపీ 61, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు.

Updated Date - Nov 08 , 2026 | 12:32 AM