పురాధీశుల ప్రమాణస్వీకారాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:05 AM
All Set for the Swearing-In Ceremony of the Newly Elected Municipal Leaders జిల్లాలోని మున్సిపల్ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలకు సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలోని కార్యాలయాల్లో ప్రిసైడింగ్ అధికారుల పర్యవేక్షణలో చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పార్వతీపురం, సాలూరు, పాలకొండలో ఏర్పాట్లు పూర్తి
ఉత్కంఠగా మారిన వైస్ చైర్మన్ ఎన్నిక
పార్వతీపురం/ పార్వతీపురం టౌన్/ సాలూరు/పాలకొండ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మున్సిపల్ నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలకు సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలోని కార్యాలయాల్లో ప్రిసైడింగ్ అధికారుల పర్యవేక్షణలో చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ చైర్‌పర్సన్లుగా కూటమి అభ్యర్థులు బెలగాం కరుణ, జి.విజయకుమారి, పి.విజయ నిర్మలతో పాటు కౌన్సిలర్ల అభ్యర్థులు ఆయా పురపాలక సంఘాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
వైస్ చైర్మన్ పీఠం ఎవరికో?
- సాలూరులో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో 11 చోట్ల టీడీపీ, 4 వార్డుల్లో జనసేన, 3 వార్డుల్లో స్వతంత్రులు, ఒక వార్డులో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 13 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. అయితే చైర్‌పర్సన్ పీఠాన్ని జనసేనకు కేటాయించగా.. వైస్ చైర్మన్ సీటును టీడీపీకి కేటా యించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి 2వ వార్డు కౌన్సిలర్ పప్పల మోహన్‌కు బీఫారం ఇచ్చారు. అయితే జనసేన పార్టీ నుంచి పలువురు ఆ పదవి కోసం పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇకపోతే వైసీపీ విప్‌గా 25వ వార్డు కౌన్సిలర్ బీసపు హైమా విజయలక్ష్మి, టీడీపీ విప్‌గా 21వ వార్డు టీడీపీ కౌన్సిలర్ హర్షవర్ధన్ ఉన్నారు. అయితే వైసీపీకి చెందిన కౌన్సిలర్లు విప్ పత్రంలో సంతకాలు చేయలేదని తెలిసింది. అంతేకాకుండా ఆపార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లతో క్యాంపు నిర్వహిస్తున్నట్టు భోగట్టా. ఏదేమైనా వైస్ చైర్మన్ ఎన్నిక కూటమి ధర్మానికి కట్టుబడి జరుగుతుందా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.
- పార్వతీపురంలోనూ వైస్ చైర్మన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. మున్సిపాల్టీలో 36 వార్డులు ఉండగా.. 27 వార్డుల్లో కౌన్సిలర్లుగా కూటమి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు టీడీపీలో చేరారు. దీంతో పాలకవర్గంలో కూటమి కౌన్సిలర్ల సంఖ్య 30కి చేరింది. వైసీపీ అభ్యర్థులు కేవలం ఆరు వార్డులకే పరిమితమయ్యారు. చైర్‌పర్సన్ పీఠం టీడీపీకి కేటాయించగా.. వైస్ చైర్మన్ సీటు బీజేపీకి కేటాయించారు.
- పాలకొండలో వైస్ చైర్మన్‌గా 26వ వార్డు కౌన్సిలర్ గుమ్మిడి దమయంతి పేరును టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఆమె భర్త గుమ్మిడి సింహాద్రి పాలకొండ టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలాఉండగా టీడీపీ నుంచి పలువురు ఆశావహులు వైస్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. నగర పంచాయతీలో 28 వార్డులుండగా.. 23 వార్డుల్లో కూటమి అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. నాలుగు వార్డులకే వైసీపీ అభ్యర్థులు పరిమితం కాగా.. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. చైర్‌పర్సన్ పీఠం జనసేనకు కేటాయించారు.