తొలి విడత పల్లెపోరుకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:02 AM
All Set for the First Phase of Panchayat Elections జిల్లాలో తొలివిడత పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఓటింగ్ ప్రారంభం కానుండగా.. ఎనిమిది మండలాల్లోని 226 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
193 పంచాయతీల్లో ఎన్నికలు
226 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది
పార్వతీపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలివిడత పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఓటింగ్ ప్రారంభం కానుండగా.. ఎనిమిది మండలాల్లోని 226 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. పార్వతీపురం, కురుపాం నియోజకర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లోని పంచాయతీల్లో పోలింగ్ జరగనుండగా.. 2.98 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో పురుషులు 1.46 లక్షల మంది, 1.52 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు 47 మంది వరకూ ఉన్నారు. జిల్లాలో 226 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిల్లో 33 పంచాయతీలు, 970 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కాగా నేడు 193 పంచాయతీలు, 1146 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌లకు 546 మంది, వార్డు సభ్యులుగా 2,426 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రతిఒక్క ఓటరు సర్పంచ్‌కు, వార్డు సభ్యునికి వేర్వేరుగా ఓటు వేయాల్సి ఉంది.
ఓటుకు రూ.వెయ్యి!
పంచాయతీల్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు పంపిణీ చేస్తున్నారు. వాస్తవంగా 193 పంచాయతీల్లో కొన్నిచోట్ల గట్టి పోటీ నెలకొంది. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సర్పంచ్ అభ్యర్థుల తరపున నగదు, మద్యం పంపిణీ చేపట్టారు. మరికొందరు హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర దూర ప్రాంతాల నుంచి వలస ఓటర్లను గ్రామాలకు రప్పించి.. వారి ఖర్చులన్నీ చూసుకుంటున్నారు. రానుపోను రవాణా ఖర్చులు ఇచ్చి.. సకల మర్యాదలు చేస్తున్నారు. కాగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో సుమారు 25 వేల మంది వలస ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
పోలింగ్ తేదీల్లో పాఠశాలలకు సెలవు: డీఈవో
గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగే తేదీల్లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత పంచాయతీల్లో నేడు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎనిమిది మండలాల పరిధిలో పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఈనెల 29, డిసెంబరు 2న రెండు, మూడు విడతల పంచాయతీ పోలింగ్ సందర్భంగా ఆయా తేదీల్లోనూ పాఠశాలలకు సెలవులేనని పేర్కొన్నారు.
ప్రశాంత ఎన్నికలకు చర్యలు : కలెక్టర్
సీతానగరం: తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, సిబ్బందికి విధుల కేటాయింపు ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీలో ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలన్నారు. ఎన్నికల సిబ్బందికి అవసరమైన సామగ్రితో పాటు తాగునీరు, విద్యుత్, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తూ అధికారులు సమన్వ యంతో పనిచేయాలని సూచించారు.
- పార్వతీపురం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలింగ్ క్రేందాల్లోకి ఒకేసారి ఇద్దరి కంటే ఎక్కువ మంది ఓటర్లను అనుమతించరాదన్నారు. విధులకు హాజరుకాని సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశంచారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి జేసీ ఆర్.వైశాలి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు సచిన్ రహర్, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌వో హేమలత, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు: ఎస్పీ
బెలగాం: తొలి విడత పంచాయతీ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎస్పీ మాధవరెడ్డి తెలి పారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. ఎనిమిది మండలాల్లోని 226 పోలింగ్ కేంద్రాల్లో 650 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. క్షేత్రస్థాయిలోనూ పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా కొనసాగుతుందని చెప్పారు. రూట్ మొబైల్స్, స్ర్టైకింగ్ ఫోర్స్‌లు అప్రమత్తంగా ఉంటాయని తెలిపారు.