Ratha Saptami రథసప్తమికి సర్వం సిద్ధం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:10 AM
All Set for Ratha Saptami జిల్లాలో ఏకైక ఆదిత్యుని ఆలయం.. పార్వతీ పురంలోని సూర్యపీఠం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. ఆదివారం వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పార్వతీపురం టౌన్, జనవరి24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏకైక ఆదిత్యుని ఆలయం.. పార్వతీ పురంలోని సూర్యపీఠం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. ఆదివారం వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి 20 వేల మంది భక్తులు రానున్నట్లు అంచనా. ఈ మేరకు ఉత్సవ కమిటీ సభ్యులు సూర్యపీఠంలో ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం వరకు పీఠాధిపతి వేమకోటి నరహరశాస్త్రి ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరగనున్నాయి. తొలుత వేదమంత్రోశ్చరణల మధ్య శ్రీఉషా, పద్మిని ఛాయా సూర్య భగవానునికి సుప్రభాత సేవ నిర్వహించనున్నారు. ప్రాతకాలార్చన అనంతరం భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఉదయం 8 గంటలకు సౌర దీక్షలు చేపట్టిన వారితో పాటు దంపతులతో ఆదిత్యునికి క్షీరాభిషేకాలు, ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, సత్యసాయి సేవా సమితి సభ్యులతో భజన కార్యక్రమం ఉంటుంది. వికాస తరంగిణి సభ్యులతో సామూహిక విష్ణు సహస్ర నామ స్త్రోత పారాయణాలు, రాత్రి 7 గంటల నుంచి స్వామి వారికి ఊంజల్, పూలంగి సేవ నిర్వహిస్తారు. అనంతరం నిర్వహించే పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుంది.