August! ఆగస్టుపైనే ఆశలు!
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:49 PM
All Hopes Rest on August! ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. లోటు వర్షపాతం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు నెల వచ్చినప్పటికీ కనీసస్థాయిలో వానలు లేక గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, గెడ్డలు మైదా నాన్ని తలపిస్తున్నాయి.
పూర్తిస్థాయిలో కురవని వర్షాలు
ఖరీఫ్ సాగుకు వెంటాడుతున్న నీటి కష్టాలు
ఆందోళనలో రైతులు..
పాలకొండ, ఆగస్టు2(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. లోటు వర్షపాతం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు నెల వచ్చినప్పటికీ కనీసస్థాయిలో వానలు లేక గ్రామీణ ప్రాంతాల్లోని చెరువులు, గెడ్డలు మైదా నాన్ని తలపిస్తున్నాయి. కొండవాగులు, గెడ్డలు అడుగంటాయి. ప్రాజెక్టులో సాగునీరు కొద్దోగొప్పో విడిచిపెడుతున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో పొలాలకు నీరందడం లేదు. మరోవైపు పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
లోటు వర్షపాతం ఇలా..
జిల్లాలో 2022లో సాధారణ వర్షపాతం 1113.8 మిల్లీమీటర్లు కాగా, 1169.8 మి.మి. వర్షపాతం నమోదైంది. 2023లో 1170.6 మిల్లీమీటర్ల మేర సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా 1189.4 మి.మి మేర అధిక వర్షం కురిసింది. 2024లో 1170.6 మిల్లీమీట్లర్ల వర్షానికి గాను 1159.3 మి.మి. వాన కురిసింది. 2025లో 1170.06 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1149.6 మిల్లీ మీటర్ల వాన కురిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 350.06 మిల్లీమీటర్ల వాన కురవాల్సి ఉండగా జూన్ చివరి నాటికి 250.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతమే నమోదైంది. మొత్తంగా మన్యంలో జూలై వరకు 40 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఏడాది ఆదిలోనే అన్నదాతలకు ఖరీఫ్ కష్టాలు ప్రారంభమయ్యాయి.
సాగు ఇలా..
- జిల్లాలో లక్షా 75 వేల హెక్టార్లలో ఖరీఫ్ కింద వరి సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇందులో 30 వేల ఎకరాల వరకు ఎద పద్ధతిలోనే సాగు చేపట్టారు. మిగిలిన రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆగస్టు నెల మొదటి వారం వచ్చినప్పటికీ వర్షం జాడ లేకపోవడంతో రైతులు నిట్టూరుస్తున్నారు.
- ఒడిశా ఏరియా క్యాచ్‌మెంట్‌లో పూర్తిస్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో తోటపల్లి, వెంగళరాయసాగర్, ఒట్టిగెడ్డ, జంఝావతి తదితర ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు అనుకున్న స్థాయిలో నీరు చేరడం లేదు. కాలువ దిగువ ప్రాంతంలో ఉన్న రైతులకు మాత్రమే సాగునీరందుతుంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని శివారు ప్రాంత ఆయకట్టుదారులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.
- దీనిపై జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్‌ను వివరణ కోరగా.. ‘జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతుంది. పూర్తిస్థాయిలో వర్షాలు కురిస్తేనే నాట్లు వేయాలి. ఏదేమైనా ఈ నెలాఖరు వరకు నాట్లు వేసేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున రైతులు వ్యవసాయశాఖ సూచనలు పాటించి చీడపీడలు సోకకుండా నారుమడులకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.’ అని తెలిపారు.