అందరి వేళ్లూ పోలీసులవైపే!
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:53 PM
పొందూరు మండలం పెనుబర్తి సమీపాన రైలు కిందపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అందరి వేళ్లూ పోలీసుల వైపే చూపిస్తున్నాయి.
విచారణ పేరిట పోలీసుస్టేషన్‌కు పిలుపు
పదేపదే రమ్మని చెప్పడంతో మనస్తాపం
అవమానం భరించలేక మహిళ ఆత్మహత్య
చివరిక్షణంలో కొడుకును తప్పించి వైనం
సంతకవిటి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): పొందూరు మండలం పెనుబర్తి సమీపాన రైలు కిందపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అందరి వేళ్లూ పోలీసుల వైపే చూపిస్తున్నాయి. దొంగతనం కేసులో వీరినే అనుమానితులుగా పదేపదే పోలీసుస్టేషన్‌కు రమ్మని చెప్పడంతో ఆ తల్లి మనస్తాపం చెందినట్లు, దీంతోనే ఆత్మహత్య చేసుకునట్లు కుటుంబీకులు చెబుతున్నారు. వారి వివరాల మేరకు.. సంతకవిటి మండలం రామారాయిపురం గ్రామానికి చెందిన వై.కళావతి (55) ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి తన ఒక్కగానొక్క కుమారుడు చిరంజీవితో జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల 25న గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో నాలుగు తులాల బంగారం, రూ.10 వేల నగదు చోరీకి గురయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక ఎస్‌ఐ అనుమానితులుగా కళావతి, ఆమె కొడుకు చిరంజీవిని అనుమానితులుగా విచారణ పేరిట స్టేషన్‌కు పదేపదే పిలవడంతో వారు తీవ్ర మనస్తాపం చెందినట్ల తెలుస్తోంది. మంగళవారం కూడా మరోసారి పోలీసుస్టేషన్‌కు రావాలని సమాచారం అందడంతో ఇద్దరూ వెళ్లారు. అయితే ఎస్ గోపాలరావు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వస్తున్న సమయంలో ఇద్దరూ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. తమను పోలీసుస్టేషన్‌కు పదేపదే పిలవడం, దీంతో గ్రామంలో దొంగలుగా ముద్ర వేయడం వారిని కుంగదీసింది. ఈ నేపథ్యంలో ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీని గురించి కొందరు గ్రామస్థులకు, బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం కూడా అందించారు. వారు ఇద్దరినీ వెతుకుతూ వెళ్లారు. అయితే అప్పటికీ ఆలస్యమైంది.
చివరి క్షణంలో మేల్కొన్న మాతృత్వం
పెనుబర్తి సమీపంలో రైల్వే పట్టాల వద్ద నిలబడ్డ తల్లి, కొడుకు ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రైలు సమీపిస్తుండగా.. ఆమెలో మాతృత్వం మేల్కొంది. వెంటనే అతడిని బలంగా పక్కకు నెట్టేసింది. తాను మాత్రం రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి కళ్లముందే జరిగిన ఈ ఘటన నుంచి చిరంజీవి ప్రాణాలతో బయటపడగా, తీవ్ర మానసిక వేదనలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
వారిద్దరిపైనే ఎందుకు?
కళావతి ఆత్మహత్య ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల చోరీ కేసులో ఇతర అనుమానితులను పక్కనపెట్టి తనను, తన తల్లిని మాత్రమే పదేపదే స్టేషన్‌కు పిలుస్తూ దొంగలుగా చూస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఆమె కుమారుడు చిరంజీవి బుధవారం వెల్లడించాడు. చోరీ కేసు దర్యాప్తు పేరుతో తరచూ విచారణకు పిలవడం, గ్రామంలోనూ అనుమానితులుగా ముద్ర పడడం వల్ల తల్లీకొడుకులు మానసికంగా కుంగిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్ధితులే చివరికు విషాదానికి దారితీశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బుధవారం సంతకవిటి పోలీసు స్టేషన్‌కు వచ్చిన అదనపు ఎస్పీ పి.సౌమ్యలత దృషికి ఈ విషయాన్ని కొందరు తీసుకువెళ్లారు. అయితే తాను ఆ అంశంపై రాలేదని ఆమె చెప్పారు. స్టేషన్‌లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించడానికి, పనిచేయని కెమెరాలను వెంటనే మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎస్పీ ఆదేశాల మేరకు వచ్చినట్లు ఆమె తెలిపారు. కళావతి మృతి వెనుక ఉన్న పరిస్ధితులు, పోలీసుల వ్యవహార శైలి, కుమారుడు చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలనే డిమాండ్ స్థానికుల నుంచి వినిపిస్తోంది. ఈ ఘటనలో అందరి వేళ్లూ పోలీసులపైనే చూపిస్తున్నాయి.