Share News

all are interest to anna centeens ‘అన్న’ర్తుల క్యాంటీన్లు

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:32 AM

all are interest to anna centeens అన్న క్యాంటీన్లు అన్నార్తుల పాలిట వరంగా నిలుస్తున్నాయి. గ్యాస్‌ కొరతతో కొందరు పేదలు ఒక పూట భోజనం అన్న క్యాంటీన్లలో చేస్తూ రెండో పూట మాత్రమే వంట చేసుకుంటున్నారు. విద్యార్థులు, కూలీలు, కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇటీవల కాలంలో అన్నక్యాంటీన్ల బాట పట్టారు.

all are interest to anna centeens ‘అన్న’ర్తుల క్యాంటీన్లు
విజయనగరం: అన్నక్యాంటీన్‌లో భోజనానికి ప్రజల బారులు

‘అన్న’ర్తుల క్యాంటీన్లు

గ్యాస్‌ కొరతతో హోటళ్ల మూత

పేదలకూ వంట భారం

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

గతం కంటే పెరిగిన టిఫిన్లు, భోజనాలు

శుచి, శుభ్రతపైనా ప్రజల సంతృప్తి

అన్న క్యాంటీన్లు అన్నార్తుల పాలిట వరంగా నిలుస్తున్నాయి. గ్యాస్‌ కొరతతో కొందరు పేదలు ఒక పూట భోజనం అన్న క్యాంటీన్లలో చేస్తూ రెండో పూట మాత్రమే వంట చేసుకుంటున్నారు. విద్యార్థులు, కూలీలు, కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇటీవల కాలంలో అన్నక్యాంటీన్ల బాట పట్టారు. చౌకగా మంచి భోజనం పెడుతున్నారని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శుభ్రత విషయంలోనూ బాగున్నాయంటున్నారు. కూపన్ల కోసం బారులుతీరుతూ కనిపిస్తున్నారు.

విజయనగరం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): విజయనగరంలో మూడు అన్న క్యాంటీన్లు ఉండగా వీటిలో రోజూ దాదాపు 500 మంది టిఫిన్లు, భోజనాలు చేస్తున్నారు. కొంతకాలంగా గ్యాస్‌ కొరతతో హోటళ్లు మూతపడిన పరిస్థితిలో ఈ క్యాంటీన్లు అద్భుతంగా నడుస్తున్నాయి. గ్యాస్‌పై ఆందోళనతో ఒక పూట మాత్రమే వంట చేసుకుంటూ రెండో పూట అన్న క్యాంటీన్లకు వస్తున్న వారు కోకొల్లలు. ఇటీవల కాలంలో మరింత మంది వచ్చి టిఫిన్లు, భోజనం చేస్తున్నారని, టోకెన్ల కోసం ప్రతిరోజూ బారులుదీరుతున్నారని క్యాంటీన్ల సిబ్బంది చెబుతున్నారు. గతంలో క్యూలో ఎక్కువమంది నిల్చునేవారు కాదు. ఇప్పుడు గంటల తరబడి వేచిచూస్తున్నారు. మూడు క్యాంటీన్లలో దాదాపు 500 మంది వరకూ భోజనాలు చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో విజయనగరంలో 3, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్లలో ఒక్కో అన్న క్యాంటీన్‌ నడుస్తోంది. సాధారణ రోజుల్లో 600 నుంచి 800 వరకూ భోజనాలు చేసేవారు. ఇటీవల హోటళ్లు మూతపడడంతో రోజుకు సగటున 1000 మంది వరకూ భోజనాలు, టిఫిన్లు చేస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. రూ.5కే నాణ్యమైన భోజనం అందుతోందని ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో కూడా అన్న క్యాంటీన్లు ఆసరాగా నిలిచాయంటున్నారు.

హోటళ్లు మూత..

జిల్లాలో చాలా హోటళ్లు మూతపడ్డాయి. కొందరు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. మరికొందరు వారికి ఉన్న పరపతితో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు తెప్పించుకొని హోటళ్లు నడిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. గత నెల 14 వరకూ వాణిజ్య సిలిండర్లు బాగానే సరఫరా చేశారు. ఆ తర్వాత దాదాపు సరఫరా నిలిపివేశారు. కేవలం ఆస్పత్రులు, వసతిగృహాలు, విద్యాసంస్థలకు మాత్రమే అందజేస్తున్నారు. ఫలితంగా హోటళ్ల నిర్వహణ కష్టతరంగా మారింది. అన్న క్యాంటీన్లలో మాత్రం ఏ రోజూ ఆ ఇబ్బంది కనిపించలేదు. ఎప్పటిలా టైమ్‌ ప్రకారం టిఫిన్లు, భోజనాలు పెడుతున్నారు. ప్రజలు వాటిని అందిపుచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పేదల పాలిట అండగా నిలుస్తున్నాయి.

గతం కంటే పెరిగారు..

గతం కంటే అన్నక్యాంటీన్లలో టిఫిన్లు, భోజనాలు చేసేవారి సంఖ్య పెరిగింది. సాధారణ రోజుల్లో అయితే విజయనగరం క్యాంటీన్లలో 300 మంది నుంచి 400 మంది వరకూ భోజనాలు చేసేవారు. ఇప్పుడు బాగా పెరిగారు. ప్రతిరోజు 100 నుంచి 150 అదనపు భోజనాలు, టిఫిన్లు అవుతున్నాయి. ఆహారంలో శుచి శుభ్రత పాటిస్తున్నాం.

- రమేష్‌, అన్న క్యాంటీన్‌ నిర్వాహకుడు, విజయనగరం

రోజూ క్యాంటీన్‌కే వస్తున్నా

ఎం.దినేష్‌, విద్యార్థి, విజయనగరం

రూ.5కే అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనం అందివ్వడం నా లాంటి పేద విద్యార్థులకు చాలా ఉపయోగం. విజయనగరంలో చౌకగా భోజనం అందించే ఓ హోటల్‌ మూసేశారు. అన్న క్యాంటీన్‌ కోసం తెలుసుకుని రోజూ ఇక్కడే భోజనం చేస్తున్నాను. రుచి కూడా బాగుంటోంది. నేను వచ్చేసరికే కూపన్‌ కోసం బారులుతీరుతున్నారు.

ఎంతో మేలు

రాము, ప్రైవేటు ఉద్యోగి, గజపతినగరం

ఉద్యోగం కోసం ప్రతిరోజూ గజపతినగరం నుంచి విజయనగరం వస్తున్నాను. ఇంటి వద్ద క్యారేజీ పెట్టాలని ఒత్తిడి చేయను. ఎందుకంటే అన్న క్యాంటీన్‌ ఉంటుందని నాకు ధీమా. అన్న క్యాంటీన్లలో భోజనం నా లాంటి వారికి ఎంతో మేలు. గ్యాస్‌ కొరతతో హోటళ్లు మూసివేస్తున్న ఈ రోజుల్లో చౌక ధరకు చక్కనైన భోజనం పెడుతున్నారు. అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు.

Updated Date - Apr 03 , 2026 | 12:32 AM