Share News

చురుగ్గా ‘సర్‌’

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:40 PM

జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం చురుగ్గా జరుగుతుంది.

చురుగ్గా ‘సర్‌’
పెద్దమరికిలో సర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం

- జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియ

- ఇంటింటికీ వెళ్తున్న బీఎల్వోలు

- ఇప్పటికే 1,18,148 ఎన్యుమరేషన్‌ దరఖాస్తుల పంపిణీ

పార్వతీపురం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం చురుగ్గా జరుగుతుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ‘సర్‌’ ప్రక్రియలో బూత్‌ లెవల్‌ అధికారులు, గ్రామ, వార్డు, స్వర్ణ పంచాయతీల సిబ్బంది, ఈఆర్వోలు భాగస్వాముల వుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. 2002 జాబితాలో ఉన్న ఓటర్లు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.. అదే నియోజకవర్గంలో ఉన్నారా.. వేరే చోటకు మారారా? అనేది పరిశీస్తున్నారు. 40 ఏళ్ల వయసు దాటిన వారి పేర్లు 2002 ఓటరు జాబితాలో ఉన్నాయా..లేదా చూసి మ్యాపింగ్‌ చేస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేందుకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. శాశ్వత వలస వెళ్లిన వారి పేర్లను, మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. పాత జాబితాలో పేరు ఉండి ప్రస్తుతం జాబితాలో లేని వారి వివరాలను సైతం నమోదు చేస్తున్నారు.

జిల్లాలో 7,90,562 ఓటర్లు

జిల్లాలో 7,90,562 ఓటర్లు ఉన్నారు. వీరి పరిధిలో 1032 బూత్‌ లెవల్‌ అధికారులు ఉన్నారు. ఎన్యూమరేషన్‌ దరఖాస్తులను పూర్తిస్థాయిలో ప్రింట్‌ చేశారు. ఇప్పటివరకు 1,18,148 మందికి దరఖాస్తులను పంపిణీ చేశారు. ఇందులో 1312 మంది తిరిగి దరఖాస్తులను డిజిటైజ్డ్‌ జరిగింది. ‘సర్‌’పై ఎటువంటి సందేహాలు అవసరం లేదని, లోతుగా వెరిఫికేషన్‌ చేసి నూటికి నూరు శాతం ఎటువంటి పొరపాట్లు లేకుండా ఓటర్ల జాబితా తయారు చేసేందుకే ఈ కార్యక్రమం ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. బూత్‌లెవెల్‌ అధికారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఓటును బాధ్యతగా మ్యాపింగ్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ కార్యక్రమంలో మూడు రకాల మ్యాపింగ్‌లు ఉంటాయి. ఈ ప్రక్రియ జూలై 14 వరకు కొనసాగుతుంది.

ఐదు అంశాల్లో నిర్వహణ

‘సర్‌’ కార్యక్రమం ఐదు అంశాల ద్వారా చేపడుతున్నారు. ముందుగా ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు సంబంధించి బూత్‌ లెవల్‌ అధికారి తన ఏరియాలోని ప్రతి ఇంటికీ వస్తారు. సంబంధిత ఓటర్లకు ఎన్యూమరేషన్‌ దరఖాస్తును అందిస్తారు. బీఎల్‌వో సేకరించిన డేటాతో కొత్త డ్రాప్ట్‌ ఓటర్‌ జాబితా తయారు చేసి పోలింగ్‌ స్టేషన్‌లో పెడతారు. దీనిపై అభ్యంతరాలుంటే 30 రోజుల్లో చెప్పాలి. దీనిపై ఫారం సిక్స్‌ లేదా ఫారం సెవన్‌ ద్వారా బీఎల్‌వో విచారణ చేసి పంపిస్తారు. చివరగా అన్ని క్లయిమ్‌లు పరిష్కరించాక ఎలక్షన్‌ కమిషన్‌ తుది జాబితాను విడుదల చేస్తుంది.

Updated Date - Jun 18 , 2026 | 11:40 PM