Share News

ఎల్‌నినోతో అప్రమత్తం

ABN , Publish Date - Jun 25 , 2026 | 11:29 PM

ఎల్‌నినోతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, దాని ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులను తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

 ఎల్‌నినోతో అప్రమత్తం
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, దాని ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులను తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాబూరావునాయుడుతో కలిసి ఎలినినోపై కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగి నేలలో తేమ శాతం తగ్గుతుందన్నారు. దీనివల్ల సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాల పంటల దిగుబడి తగ్గే అవకాశం ఉందని అన్నారు. రైతు సాధికార ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాబూరావునాయుడు మాట్లాడుతూ.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. విత్తన గుళికల ద్వారా పీఎండీఎస్‌ విధానంలో పశుగ్రాసం పెంచాలని, తద్వారా పశువుల మేత కొరతను అధిగమించాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ లాభం ఉన్న కూరగాయల సాగు చేపట్టాలని అన్నారు. రైతులందరూ కరపత్రాల్లో ఉన్న మాదిరిగా సూచనలు పాటించాలని తెలిపారు.

Updated Date - Jun 25 , 2026 | 11:29 PM