Share News

AI Services Hospital జిల్లాకేంద్రాసుపత్రిలో ఏఐ సేవలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:12 PM

AI Services at District Headquarters Hospital ఏఐ వినియోగంతో ప్రభుత్వాసుపత్రుల్లో మరింత సమర్థంగా వైద్యసేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్టప్‌ సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో 18 జిల్లాల్లో ఆసుపత్రులను ఎంపిక చేసింది.

AI Services Hospital జిల్లాకేంద్రాసుపత్రిలో ఏఐ సేవలు
పార్వ‌తీపురం జిల్లా కేంద్రాసుప‌త్రి

  • తొలివిడతగా బీపీ, షుగర్‌ టెస్ట్‌లు

  • త్వరలో పూర్తి స్థాయి వైద్య సేవలు

  • రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 18 ఆసుపత్రుల్లో జిల్లాకు చోటు

  • ప్రభుత్వ నిర్ణయంపై మన్యం వాసుల హర్షం

పార్వతీపురం, మార్చి9(ఆంధ్రజ్యోతి): ఏఐ వినియోగంతో ప్రభుత్వాసుపత్రుల్లో మరింత సమర్థంగా వైద్యసేవలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్టప్‌ సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో 18 జిల్లాల్లో ఆసుపత్రులను ఎంపిక చేసింది. అయితే ఆ జాబితాలో పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రి కూడా ఉండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమ వుతున్నాయి. ఏఐతో భవిష్యత్‌లో మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉందని మన్యం వాసులు భావిస్తున్నారు. కాగా నూతన విధానంలో సుమారు 40 పరికరాలతో 15 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. తక్కువ సమయంలోనే క్యాన్సర్‌, గుండె జబ్బులు, టీబీ ఇతర వ్యాధులను ఏఐ ద్వారా గుర్తించి అధునాతన టెక్నాలజీ ద్వారా రోగులకు వైద్య సేవలు అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయగా.. ఏఐ వినియోగంతో వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని వైద్యులు చెబుతున్నారు.

సేవలు ఇలా...

పైలెట్‌ ప్రాజెక్టు అమలులో భాగంగా రోగులు, వైద్యుల మధ్య జరిగే సంభాషణను రికార్డ్‌ చేస్తారు. దాని ఆధారంగా రుగ్మతపై ఒక నిర్ధారణకు వస్తారు. దగ్గు ద్వారా టీబీ , గుండెజబ్బులు రక్తహీనతను గుర్తిస్తారు. క్యాన్సర్‌ చికిత్సలో ఏఐ కెమెరా వినియోగించనున్నారు. చిన్న పిల్లల్లో న్యూరాలజికల్‌ సమస్యలు , క్యాటరాక్ట్‌, గ్లకోమా, సికిల్‌సెల్‌ ఎనీమియా తదితర వైద్య పరీక్షలకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించనున్నారు. శాలిసిటీ, సన్‌ఫాక్స్‌, కాగ్నెటివ్‌ బొటిక్‌ టెక్నాజీస్‌, ఆర్ట్‌ పార్క్‌ వంటి స్టార్టప్‌ సంస్థల ద్వారా ఆసుపత్రుల్లో ఈ పరీక్షలు చేయనున్నారు. రోగుల పూర్వడేటా ఆధారంగా డెంగ్యూ జ్వరాలు, తదితర వ్యాధులను గుర్తిస్తారు. రక్తనమూనా తీసుకోకుండానే రోగి కంటి ఫొటోతో బ్లడ్‌ గ్రూప్‌ గుర్తిస్తారు. చిన్న పరికరాన్ని అమర్చి.. గుండె సమస్యలు, క్యాన్సర్‌ , బీపీ, పల్స్‌ శరీర ఉష్ణోగ్రత తదితర వాటిని తెలుసుకోనున్నారు. ప్రస్తుతం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో ఏఐ ఆధారంగా షుగర్‌, బీపీ తదితర వైద్య పరీక్షలు చేస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో సేవలు అందించనున్నారు.

త్వరలో పూర్తిస్థాయిలో వైద్య సేవలు...

ఏఐ ఆధారిత వైద్య సేవల్లో భాగంగా రాష్ట్రంలో తొలివిడతగా ఎంపిక చేసిన 18 ఆసుపత్రుల్లో పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రి కూడా ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఏఐని వినియోగించి రోగులకు బీపీ, షుగర్‌ తదితర వ్యాధులకు సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరే విధంగా త్వరలోనే జిల్లా కేంద్రాసుపత్రిలో పూర్తిస్థాయిలో ఏఐ వైద్య సేవలు అందిస్తాం. ఆసుపత్రుల్లో వైద్యులు, రోగుల మధ్య జరిగే సంభాషణను రికార్డ్‌ చేస్తాం. దీని ఆధారంగా వ్యాధులను గుర్తించి.. వైద్యుల సిఫారసు చేసిన మందులతో నివేదిక తయారవుతుంది.

- నాగభూషణరావు, డీసీహెచ్‌ఎస్‌, పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రి

Updated Date - Mar 09 , 2026 | 11:12 PM