Share News

Agri Labs అగ్రి ల్యాబ్‌లు సరే.. టెస్టింగ్‌లు ఎక్కడ?

ABN , Publish Date - May 31 , 2026 | 11:26 PM

Agri Labs Are Fine... But Where Are the Testing Facilities? జిల్లాలో పలుచోట్ల ఏర్పాటుచేసిన అగ్రి టెస్టింగ్‌ కేంద్రాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతా పరీక్షలు కానరావడం లేదు. రైతులకు ఏ మాత్రం సేవలందించడం లేదు.

Agri Labs   అగ్రి ల్యాబ్‌లు సరే..  టెస్టింగ్‌లు ఎక్కడ?
పాలకొండలో అ గ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌ ఇలా..

  • సాంకేతిక సిబ్బందిని నియమించని వైనం

  • ప్రస్తుతం దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్న ల్యాబ్‌లు

  • కానరాని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతా పరీక్షలు

  • కల్తీలతో నష్టపోతున్న రైతులు..

  • ఆయా కేంద్రాలను వినియోగంలోకి తేవాలని విన్నపం

పాలకొండ, మే31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల ఏర్పాటుచేసిన అగ్రి టెస్టింగ్‌ కేంద్రాలు దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతా పరీక్షలు కానరావడం లేదు. రైతులకు ఏ మాత్రం సేవలందించడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాలు మూతపడడంతో సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- వ్యవసాయ దిగుబడులు పెరగడంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో రైతుల నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకొని ఇబ్బడిముబ్బడిగా కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. నకిలీలు తెలుసుకోలేక అన్నదాతలు వాటిని కొనుగోలు చేసి నష్టాలను చవిచూస్తున్నారు. మొత్తంగా వ్యవసాయ పంటకు అవరమైన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు దొరక్క.. పంటను దక్కించుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు.

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో అగ్రి టెస్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి రూ.60 లక్షలు వెచ్చించారు. వ్యవసాయ ఉత్పత్తులతో పాటు మూగజీవాలకు వచ్చే వ్యాధి నిర్ధారణ కోసం కూడా ఇదే కేంద్రాన్ని వినియోగించాలని హడావుడిగా కేంద్రాలను ప్రారంభించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతా పరీక్షలకు అవసరమైన పరికరాలు, రసాయనాల కోసం రూ.30 లక్షలు చొప్పున వెచ్చించినా.. అవసరమైన సాంకేతిక సిబ్బందిని నియమించలేదు. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన అగ్రి ల్యాబ్‌లు మూతపడ్డాయి. ఆయా భవనాలు నిరుపయోగంగా మారాయి.

- వాస్తవంగా అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల నాణ్యత పరీక్షకు ఒక ఏవో, ఇద్దరు ఏఈవోల చొప్పున ఉండాలి. కాగా ఆయా కేంద్రాల్లో కేవలం విత్తనాల నాణ్యత పరిశీలించేందుకు మాత్రమే ఒక ఏఈవోను నియమించారు. అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు మూతపడడంతో పశు వ్యాధుల నిర్ధారణకు నియమించిన టెక్నికల్‌ సిబ్బంది సమీపంలోని పశువైద్య కేంద్రాల్లో ఉండి పరీక్షలు చేస్తున్నారు.

- ప్రస్తుతం విత్తనాల నాణ్యత ఏవో లేదా ఏడీఏ కార్యాలయాల్లో ఏఈవోలు నిర్వహిస్తున్నారు. కాగా మూతపడిన అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లను వినియోగంలోకి తేవాలని జిల్లా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- దీనిపై జిల్లా వ్యవసాయశాఖ డీడీవో అన్నపూర్ణను వివరణ కోరగా.. ‘అగ్రిటెస్టింగ్‌ ల్యాబ్‌లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. దీంతో ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలు చేపట్టడం సాధ్యం కావడం లేదు. విత్తనాల నాణ్యతను పరీక్షించేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో ఏఈవోలను అందుబాటులో ఉంచాం. సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందుల నాణ్యతా పరీక్షలు చేపట్టేందుకు చర్యలు చేపడతాం.’ అని తెలిపారు.

Updated Date - May 31 , 2026 | 11:26 PM