కొలిక్కి వచ్చిన అగ్రహారం భూకబ్జా సమస్య
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:13 AM
అగ్రహారం భూకబ్జా పెద్ద దుమారమే లేపింది. ఎట్టకేలకు కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశాలతో సమస్య కొలిక్కి వచ్చింది.
కలెక్టర్ ఆదేశాలతో ఉద్యోగులను బెదిరించిన వ్యక్తిపై కేసులు
భూమి ఆక్రమణకు గురికాకుండా బైండోవర్
పూసపాటిరేగ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): అగ్రహారం భూకబ్జా పెద్ద దుమారమే లేపింది. ఎట్టకేలకు కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశాలతో సమస్య కొలిక్కి వచ్చింది. రెవెన్యూ ఉద్యోగులను బెదిరించడం, ఆక్రమణపై కథనాలు రాసిన పాత్రికేయుడు గోవింద్‌పై కర్రతో దాడి చేయటం లాంటి ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో కలెక్టర్.. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తిపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని, విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగులను బెదిరించి దుర్బాషలాడినందుకుగాను కేసును నమోదు చేయాలని స్థానిక తహసీల్దార్ ఎన్‌వీ రమణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ అరుణ్‌కిరణ్ కేసు నమోదు చేశారు. దీంతోపాటు ఆ భూమిపైకి ఆక్రమణకు తిరిగి వెళ్లకుండా ఉండేవిధంగా ఆర్డీవో వద్ద బైండోవర్ చేయించాలని ఆదేశాలు జారీ అవటంతో సమస్య సుమారుగా సద్దుమణిగింది. మరో పక్క పాత్రికేయుడిపై దాడిచేయటంతో ఆక్రమించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఉద్యోగులను ఆటంకపరిచినందుకు, దుర్బాషలాడినందుకు గాను 221, 324(3), 329 బీఎన్‌ఎస్‌లపై కేసులు నమోదు చేశారు.