Share News

ఆర్థికవృద్ధిలో ఏ-గ్రేడ్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 11:03 PM

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం కలెక్టర్ల సదస్సు జరిగింది.

ఆర్థికవృద్ధిలో ఏ-గ్రేడ్‌
సదస్సుకు హాజరైన మంత్రి సంధ్యారాణి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

-నిధుల ఖర్చులో.. ప్చ్‌!

-వాట్సాప్‌ గవర్నెన్స్‌, కేపీఐలో ఓకే

-ఇవీ మన్యం జిల్లా గణాంకాలు

-కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

పార్వతీపురం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రగతికి సంబంధించిన పలు గణాంకాలను వెల్లడించారు. ఆర్థికవృద్ధిలో జిల్లాకు ఏ గ్రేడ్‌, సామాజిక రంగంలో ఏ ప్లస్‌, వాట్సాప్‌ గవర్నెన్స్‌లో ఏ గ్రేడ్‌, 150 కీలక పనితీరు సూచీకల(కేపీఐ) స్కోరింగ్‌లో ఏ గ్రేడ్‌ లభించింది. ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) ప్రగతిని సీఎం ప్రస్తావించారు. 38,502 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 27,338 గృహాలు(79 శాతం) పూర్తి చేసినట్టు గణాంకాలతో సహా వివరించారు. వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ కొళాయి పథకంలో 35,435 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, 13,387 కనెక్షన్లు ఇచ్చినట్టు నివేదికలో స్పష్టం చేశారు. కానీ జిల్లాకు మంజూరైన అభివృద్ధి నిధులకు సంబంధించి 66 శాతం మాత్రమే ఖర్చు చేసినట్టు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు ఏడాదిలోగా ఇళ్ల పట్టాల మంజూరు పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతంలో రెండు సెంట్లు కేటాయించి ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కాగా జిల్లాల అభివృద్ధిపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి జిల్లాకు 25 ప్రాధాన్యత అంశాలు, నియోజకవర్గానికి 10 నుంచి 15 ప్రాధాన్యత అంశాలను గుర్తించాలని ఆదేశించారు. సదస్సులో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 11:05 PM