Share News

Agency Area Laid Low మంచం పట్టిన మన్యం

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:49 PM

Agency Area Laid Low సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు గిరిజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ గిరిజన గ్రామంలో చూసిన పదులసంఖ్యలో జ్వరపీడితులు కనిపిస్తున్నారు.

Agency Area Laid Low  మంచం పట్టిన మన్యం
జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న హైరిస్క్‌ గ్రామం గొయ్యిపాండ్ర

  • ప్రభుత్వ వైద్యం కోసం ఎదురుచూపు

  • సంచి వైద్యులు, ప్రైవేటు క్లీనిక్‌లను ఆశ్రయిస్తున్న గిరిపుత్రులు

  • చేతిచమురు వదులుతోందని ఆవేదన

సీతంపేట రూరల్‌, జూన్‌26(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్‌, విషజ్వరాలు గిరిజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏ గిరిజన గ్రామంలో చూసిన పదులసంఖ్యలో జ్వరపీడితులు కనిపిస్తున్నారు. చిన్నా, పెద్దా అంతా మంచం పట్టారు. అపెడమిక్‌ సీజన్‌ కావడం, ఆపై వర్షాలు కురుస్తుండడంతో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఐటీడీఏ పరిధిలోని దోనుబాయి, మర్రిపాడు, కుసిమి పీహెచ్‌సీల పరిధిలోని హైరిస్క్‌ గిరిజన గ్రామాల్లోనే జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ప్రధానంగా మర్రిపాడు పీహెచ్‌సీ పరిధిలోని మేడవబ్బంగి, ఇసపరాయి, గొయ్యిపాండ్ర, కొత్తగూడ గ్రామాల్లో అధికంగా గిరిజనులు జ్వరాలతో వణుకుతున్నారు. అయితే తమ గ్రామాలవైపు ప్రభుత్వ వైద్యసిబ్బంది ఎవరూ రావడం లేదని గొయ్యిపాండ్ర, మేడవబ్బంగి, కొత్తగూడకు చెందిన సవర కాలేబు, సవర సింగన్న, జిలిమియో , అసొనోతి, కుమారి , ఒమోరియో, ప్రేమిక తదితరులు వాపోతున్నారు. మూడు రోజుల కిందట అందక సవర పొయ్యిబారి, సవర జోనస్‌,మార్తలను సీతంపేటలోని ఓప్రైవేట్‌ క్లీనిక్‌లో చూపించి వైద్యం అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఒక్కొక్కరికీ రూ.4వేల వరకు చేతిచమురు వదిలిందని వాపోయారు. ఇదిలా ఉండగా మర్రిపాడు పీహెచ్‌సీలో రెగ్యులర్‌ వైద్యులు లేరు. ఇద్దరు వైద్యాధికారులు కూడా ఇన్‌చార్జిలుగా ొనసాగుతున్నారు. దీంతో గ్రామస్థాయిలో గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు.

వైద్యం పేరుతో నిలువుదోపిడీ

సీతంపేట మన్యంలో జ్వరాలు విజృంభిస్తుండడంతో ప్రైవేటు క్లీనిక్‌ల నిర్వాహకులు అమాయక గిరిజనులను నిలువు దోపిడీ చేస్తున్నారు. బ్లడ్‌టెస్ట్‌లు, ట్రీట్మెంట్‌, మందుల పేరుతో అడ్డంగా దోచు కుంటున్నారని జ్వరపీడితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో బెడ్లు ఖాళీలేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పైవేట్‌ క్లీనిక్‌లు, సంచి వైద్యులను ఆశ్రయిస్తుంచాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు.

సీతంపేట ఆసుపత్రిలో..

ఐపీ(ఇన్‌పేషెంట్‌)కేసులతో ఎన్నడు లేనివిధంగా సీతంపేట ఏరియా ఆసుపత్రిలో వార్డులన్నీ కిక్కిరిశాయి. జనరల్‌తో పాటు మహిళలు, చిన్నారుల వార్డులన్నీ జ్వరపీడితులతో నిండిపోయాయి. ఇక్కడ 100పడకలు ఉండగా ఇన్‌పేషెంట్లు సుమారు 200వరకు ఉన్నారు. దీంతో ఒక్కో బెడ్డ్‌పై ఇద్దరు లేక ముగ్గురికి వైద్యసేవలు అందిస్తున్నారు. ఇక్కడకు వచ్చే రోగుల్లో ఎక్కువ మంది జ్వరపీడితులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. బెడ్లు ఖాళీ లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులను ఆరుబయట ఉన్న బెంచీలపై వైద్యసేవలు అందిస్తున్నారు. అత్యవసర వైద్యసేవల కోసం వచ్చే రోగులను తప్పనిసరి పరిస్థితుల్లో పాలకొండ, శ్రీకాకుళం, రాగోలులో ఉన్న ఆసుపత్రులకు రెఫర్‌ చేస్తున్నారు.

డిప్యూటీ డీఎంహెచ్‌వో ఏమన్నారంటే..

‘వాతావరణంలో మార్పుల కారణంగా ఏజెన్సీలో జ్వరపీడితులు పెరుగుతున్నారు. గ్రామ స్థాయిలో జ్వరాల తీవ్రతపై వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. అపెడమిక్‌ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మర్రిపాడు పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను డిప్యుటేషన్‌పై నియమించాం. ప్రైవేట్‌ క్లీనిక్‌లపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తాం.’ అని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో బి.విజయపార్వతి తెలిపారు.

Updated Date - Jun 26 , 2026 | 11:49 PM