Share News

మళ్లీ మన్యమే ఫస్ట్‌

ABN , Publish Date - May 01 , 2026 | 12:48 AM

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. గురువారం విడుదలైన ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణత సాధించారు.

 మళ్లీ మన్యమే ఫస్ట్‌
కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

- ‘పది’ ఫలితాల్లో సత్తాచాటిన జిల్లా విద్యార్థులు

- 96.07 శాతం ఉత్తీర్ణత

- వరుసగా నాల్గోసారి రాష్ట్రంలో ప్రథమ స్థానం

- ఆనందం వ్యక్తం చేసిన మంత్రులు, కలెక్టర్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. గురువారం విడుదలైన ఫలితాల్లో 96.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. దీంతో వరుసగా నాల్గోసారి కూడా రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఈ ఏడాది 10,506 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఇందులో 5,109 మంది బాలురకు 4,882 మంది, 5,397 మంది బాలికలకు 5,210 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 10,092 మంది (96.07 శాతం) ఉత్తీర్ణత పొందారు.

మొదటి మూడు స్థానాల్లో బాలికలే..

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. జియ్యమ్మవలస మండలం బీజేపురం జడ్పీ హైస్కూల్‌కు చెందిన బడే సృజన 593, సాలూరు బాలికల హైస్కూల్‌ విద్యార్థిని నడుపూరు మౌనిక 592, వీరఘట్టం మండలం తలవరం జడ్పీ స్కూల్‌కు చెందిన బౌరోతు తరణి 591, బలిజిపేట మండలం పెదపెంకి జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన పూసర్ల శిరీష 591 మార్కులు సాధించారు. ఈ విధంగా మొదటి మూడు స్థానాలను బాలికలే కైవసం చేసుకున్నారు.

- సీతంపేట మండలం చిన్నకోస్తా పాఠశాలకు చెందిన బి.జాస్మిన్‌ 590మార్కులు సాధించింది.

-పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస కొత్తపోలమ్మ ఉన్నత పాఠశాలకు చెందిన జె.హరిక 590, రెడ్డి దీపక్‌ 588, జి.పరిపూర్ణ 588, పార్వతీపురం డీవీఎంఎం విద్యార్థి పిల్లా అరవింద్‌నాయుడు 584 మార్కులు సాధించారు.

అనేక పాఠశాలల్లో శతశాతం ఉత్తీర్ణత..

- కురుపాం మండలంలోని నీలకంఠాపురం, లంకాజోడు, ఉదయపురం బాలికల ఆశ్రమ పాఠశాలలు, నీలకంఠాపురం, ధర్మలక్ష్మీపురం, జి.శివడ, మొండెంఖల్‌, పొడి బాలుర ఆశ్రమ హైస్కూళ్లలో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది.

- గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి పీటీజీ గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 80 మంది పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. బిడ్డి భవానీ 588, ఆరిక హరిత 586 చొప్పున మార్కులు సాధించారు. గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో 64 మంది పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. కస్తూర్భా పాఠశాలలో 40 మందికి విద్యార్థినులకు 40 మంది పాసయ్యారు. సాయి హర్షిత అనే విద్యార్థినికి 581 మార్కులు వచ్చాయి.

- కొమరాడ మండలం కోటిపాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 69 మందికి అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఏపీడబ్ల్యూఆర్‌ఎస్‌ (బాలురు), దళాయిపేట, గుణానపురం, మాదలింగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, పెదకేర్జీల టీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది. పార్వతీపురం మండలం డోకిశిల, రావికన ఆశ్రమ పాఠశాలలు, తాళ్లబురిడి జడ్పీహెచ్‌ఎస్‌లో శతశాతం ఉత్తీర్ణత నమోదైంది.

- కురుపాంలోని జ్యోతిబా పూలే గురుకుల బీసీ రెసిడెన్సియల్‌ పాఠశాల విద్యార్థి ఊన్న తేజ 585, కురుపాం ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థినులు నెల్లి శ్రీనిధి 583, ఎన్‌.మహేశ్వరి దేవి 583 మార్కులు సాధించారు.

- 2022-23విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 87.47, 2023-24లో 96.37 శాతం, 2024-25లో 93.90 శాతం ఉత్తీర్ణత సాధించింది.

ఇదే స్ఫూర్తి కొనసాగించాలి

పదో తరగతి ఫలితాల్లో జిల్లా నాల్గోసారి రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా జిల్లా ముందంజలో ఉండాలి. ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో పాటు ప్రతి ఒక్కరికీ పేరుపేరున అభినందనలు.

-కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి

ప్రతి ఒక్కరిరీ అభినందనలు

పదో తరగతి ఫలితాల్లో వరుసగా నాల్గో పర్యాయం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించే విధంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదం డ్రులకు, అధికారులకు పేరుపేరున ప్రతి ఒక్కరికీ అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధించి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను.

-గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి

ఎంతో ఆనందంగా ఉంది

పదో తరగతి ఫలితాల్లో జిల్లా నాల్గోసారి ప్రథమ స్థానాన్ని సాధించడం ఆనందంగా ఉంది. ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు బోధన చేయడంతో పాటు వారి పట్ల ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు. ఇదేస్ఫూర్తితో వచ్చే విద్యా సంవత్సరంలో కూడా రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం సాధించాలి. ఇంటర్‌ ఫలితాల్లో కూడా రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం లభించింది.

-ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌

ఈ ఫలితాలు డబుల్‌ హ్యాట్రిక్‌కు నాంది: కలెక్టర్‌

‘గత మూడేళ్లుగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి హ్యాట్రిక్‌ సాధించాం. ఈ ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించేందుకు ఈ ఫలితాలు నాంది కావాలి.’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలబెట్టడంపై విద్యాశాఖాధికారులను అభినందించారు. ‘రాష్ట్ర యావరేజ్‌తో పోల్చినా, గత ఏడాది మనం సాధించిన రిజల్ట్‌తో పోల్చినా పార్వతీపురం మన్యం జిల్లా చరిత్ర తిరగరాసింది. ఇంతటి ఘన విజయానికి కారణమైన తల్లిదం డ్రులు, విద్యాశాఖాధికారులు, స్పెషల్‌ ఆఫీసర్లు, అసోసియేషన్లు, 100 డేస్‌ ప్లాన్‌ అందించిన విద్యాశాఖామంత్రి లోకేష్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు ధన్యవాదాలు. ఈ సంవత్సరం విద్యాశాఖలో అనేక కార్య క్రమాలు ప్రవేశపెట్టాం. పిల్లలను అదే పనిగా పాఠశాలలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం వల్ల వారికి ఇబ్బంది ఉంటుంది. అప్పుడప్పుడు వారికి ఆటపాటలతో శారీరక శ్రమ ఉంటే బాగా చదువుతారు.’ అని అన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి అధికారులకు తినిపించారు. అనంతరం విద్యాఖాధికారులు కలెక్టర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, గిరిజన సంక్షేమశాఖ డీడీ విజయశాంతి, జిల్లాలోని ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:48 AM